Business

టెలిగ్రాం లేటెస్ట్ అప్‌డేట్-వాణిజ్య వార్తలు

టెలిగ్రాం లేటెస్ట్ అప్‌డేట్-వాణిజ్య వార్తలు

* టెలిగ్రాం లేటెస్ట్ అప్‌డేట్

వాయిస్‌, వీడియో కాల్స్‌కు ఫ్రెష్ డిజైన్ తీసుకువ‌స్తే టెలిగ్రాం (Telegram) లేటెస్ట్ అప్‌డేట్ వెర్ష‌న్ 10.5.0 ప్ర‌క‌టించింది. పూర్తి ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్‌లు, వాయిస్‌, వీడియో కాల్స్ కోసం దేశ‌వ్యాప్తంగా ప‌లువురు ఈ యాప్‌ను వినియోగిస్తున్నారు. ఈ న్యూ అప్‌డేట్ న్యూ లుక్‌, అప్పీల్ తీసుకురానుంది. నూత‌న యూఐ (యూజ‌ర్ ఇంట‌ర్‌ఫేస్‌) ప‌రిమిత వ‌న‌రుల‌ను వాడుతూ మెరుగైన సామ‌ర్ధ్యంతో పాటు మీ ఫోన్ల బ్యాట‌రీ లైఫ్‌ను పొడిగిస్తుంద‌ని టెలిగ్రాం పేర్కొంది. అప్‌డేట్‌తో పాత డివైజ్‌ల్లోనూ ఈ యాప్ మెరుగ్గా ప‌నిచేస్తుంద‌ని తెలిపింది.ఈ అప్‌డేట్‌లో తాము న్యూ యానిమేష‌న్స్‌, అంద‌మైన బ్యాక్‌గ్రౌండ్స్‌తో కాల్స్‌ను పూర్తిగా రీడిజైన్ చేశామ‌ని, రింగింగ్‌, యాక్టివ్‌, ఎండెడ్ వంటి కాల్ స్టేట‌స్‌కు అనుగుణంగా ఇవి మార‌తాయ‌ని న్యూ అప్‌డేట్‌ను వివ‌రిస్తూ టెలిగ్రాం వెల్ల‌డించింది. ఈ న్యూ అప్‌డేట్‌తో ఫోన్ బ్యాట‌రీ లైఫ్ సేవ్ అవుతుంద‌ని, పాత డివైజ్‌ల‌పైనా మెరుగ్గా ప‌నిచేస్తుంద‌ని తెలిపింది. మెరుగైన కాల్ నాణ్య‌త కూడా పెరుగుతుంద‌ని యాప్ ప్ర‌క‌టించింది.

* నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీలు గురువారం నష్టాల్లో ముగిశాయి. సూచీలు జీవనకాల గరిష్ఠానికి చేరగా మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో భారీగా పతనమయ్యాయి. మంగళవారం ఉదయం సెన్సెక్‌ నష్టాలతో మొదలైంది. నిఫ్టీ స్వల్ప లాభాలతో మొదలైనా ఆ తర్వాత కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకుంది. సూచీలు ఇంట్రాడేలోనూ కోలుకోలేదు. చివరకు సెన్సెక్స్‌ 379.46 పాయింట్లు పతనమై 71,892.48 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 76.10 పాయింట్లు తగ్గి 21,665.80 పాయింట్ల వద్ద స్థిరపడింది.దాదాపు 1,691 షేర్లు పురోగమించగా.. 1,631 షేర్లు పతనమయ్యాయి. 72 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో ఐషర్ మోటార్స్, ఎంఅండ్ఎం, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్‌ అండ్‌ టీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ టాప్ లూజర్‌గా నిలిచాయి. కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, దివిస్ ల్యాబ్స్ మరియు సిప్లా లాభపడ్డాయి. సెక్టార్లలో, ఫార్మా ఇండెక్స్ 2.5 శాతం పెరగ్గా.. ఆటో, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, బ్యాంక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక్కొక్కటి ఒక్కో శాతం తగ్గాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఫ్లాట్ నోట్‌లో ముగిశాయి.

* క్రెడిట్‌’ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టిన ఫోన్‌పే

ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ ఫోన్‌పే (PhonePe) ఎప్పటికప్పుడు యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. తాజాగా ‘క్రెడిట్‌’ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీంట్లో క్రెడిట్‌ స్కోర్‌తో  పాటు, క్రెడిట్‌ హిస్టరీని ఉచితంగానే తెలుసుకోవచ్చు. అలాగే క్రెడిట్‌ కార్డుల  నిర్వహణ, బిల్లు, రుణ వాయిదాల చెల్లింపుల వివరాలను కూడా ఈ ఫీచర్‌తో సమర్థంగా మేనేజ్‌ చేసుకోవచ్చని ఫోన్‌పే తెలిపింది.ఫోన్‌పే (PhonePe) యాప్‌ను ఓపెన్‌ చేయగానే హోమ్‌పేజీలోనే ‘క్రెడిట్‌’ అనే ట్యాబ్‌ కనిపిస్తుంది. ఒకవేళ అది కనిపించకపోతే.. యాప్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలి. ‘క్రెడిట్‌’పై క్లిక్‌ చేస్తే ‘క్రెడిట్‌ స్కోర్‌ ఫర్‌ ఫ్రీ’ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దాని కిందే ‘చెక్‌ నౌ’ అనే బటన్‌పై క్లిక్‌ చేయాలి. వెంటనే క్రెడిట్‌ స్కోర్‌  మీ ముందుంటుంది. ఈ స్కోర్‌ను ఎక్స్‌పీరియెన్‌ క్రెడిట్‌ బ్యూరో అందిస్తోంది. ఈ స్కోర్‌తో పాటు సకాలంలో చెల్లింపులు, క్రెడిట్‌ వినియోగ నిష్పత్తి, క్రెడిట్‌ ఏజ్‌, క్రెడిట్‌ మిక్స్‌, రుణ ఎంక్వైరీల వంటి ఇతర సమాచారం కూడా చూసుకోవచ్చు.ఈ ఫీచర్‌లో మేనేజ్‌ క్రెడిట్స్‌, రుణ ప్రొఫైల్‌, పేమెంట్‌ డ్యూస్‌ అనే మూడు ఆప్షన్లు ఉంటాయి. వీటి ద్వారా క్రెడిట్‌ కార్డుల నిర్వహణ, రుణ చెల్లింపుల వంటి సమాచారాన్ని సమర్థంగా నిర్వహించుకోవచ్చని ఫోన్‌పే తెలిపింది. సంబంధిత సమాచారాన్ని ఎంటర్‌ చేసి ఎప్పటికప్పుడు బిల్లు, ఈఎంఐల చెల్లింపుల స్థితిని సమీక్షించుకోవచ్చు. అయితే, ఫోన్‌పేలో లాగిన్‌ అయిన ఫోన్‌నెంబర్‌.. పాన్‌తో అనుసంధానమైన నెంబర్‌ ఒకటే అయి ఉండాలి.

యూపీఐ కొత్త రూల్స్‌

మన దేశంలో డిజిటల్ చెల్లింపుల్లో ‘యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)’ ప్రధానంగా మారింది. రూపాయి నుంచి లక్షల రూపాయల వరకు దేనికైనా యూపీఐ యాప్‌ల ద్వారా​డబ్బులు చెల్లించే వెసులుబాటు కలిగింది. యూపీఐ ద్వారా రోజూ కోట్ల రూపాయల్లో డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయి. అయితే, యూపీఐని అడ్డుపెట్టుకుని జరుగుతున్న కొన్ని మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం రూల్స్‌లో మార్పులు చేర్పులు చేసింది. మరి ఆ మార్పులేంటో చూద్దామా..?గూగుల్​పే, పేటీఎం, ఫోన్​పే లాంటి యూపీఐ ఐడీలను ఏడాది కాలంగా వాడకపోతే తొలగిస్తామని ‘నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)’ ప్రకటించింది. ఇలాంటి ఖాతాలతో మోసాలు జరగకుండా ఆపడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అయితే అవసరమైన వాళ్లు వాటిని తిరిగి యాక్టివేట్ చేసుకునే సదుపాయం ఉన్నది.యూపీఐ లావాదేవీల గరిష్ట రోజువారీ చెల్లింపు పరిమితిని NPCI లక్ష రూపాయలకు పెంచింది. అయితే విద్య, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల కోసం యూపీఐ లావాదేవీల పరిమితిని రూ.5 లక్షలకు పెంచారు. ఇంతకు ముందు ఈ లావాదేవీల పరిమితి లక్ష రూపాయలుగా ఉండేది.ఆర్బీఐ దేశవ్యాప్తంగా యూపీఐ ఏటీఎంలను ప్రవేశపెట్టనుంది. ఈ ఏటీఎంలతో మీరు మీ బ్యాంక్ ఖాతా నుంచి నేరుగా నగదు తీసుకోవడానికి క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయవచ్చు. ఇందుకోసం ఆర్బీఐ జపాన్‌కు చెందిన హిటాచీతో ఒప్పందం కుదుర్చుకుంది. అంతేగాక ఇక నుంచి యూపీఐ యాప్‌ల ద్వారా ఎవరికి డబ్బు పంపినా వారి బ్యాంకు ఖాతాలో ఉండే పూర్తి పేరు స్క్రీన్​పై కనిపిస్తుంది.

భారీగా పెరిగిన బియ్యం ధరలు

భారతదేశంలో బియ్యం ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి, ఒక క్వింటాల్ బియ్యం ధరల గరిష్టంగా సుమారు రూ. 1500 పెరిగినట్లు తెలుస్తోంది.భారతదేశంలో రూ. 4500 నుంచి రూ. 5000 వరకు ఉన్న క్వింటాల్ HMT, BPT, సోనామసూరి బియ్యం ధరలు ప్రస్తుతం రూ. 6200 నుంచి రూ. 7500కు చేరాయి. క్వింటాల్ ధరలు గతం కంటే కూడా రూ. 1000 నుంచి రూ. 15000 పెరిగింది. బియ్యం ధరలు పెరగటానికి ప్రధాన కారణం వరదల నష్టం వల్ల దిగుబడి తగ్గడమే కాకుండా.. వారి సాగు కూడా బాగా తగ్గడం అని సమాచారం.

కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ ను ప్రవేశపెట్టిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్(FD)ను ప్రవేశపెట్టింది. 175 రోజుల కాలపరిమితితో తీసుకొచ్చిన ఈ స్కీమ్‌లో డిపాజిట్‌ చేసే వారికి 7.50శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. జనవరి1 నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ స్కీమ్‌ పరిమిత కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని పేర్కొంది.బీఓఐ తీసుకొచ్చిన  సూపర్‌ స్పెషల్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో రూ.2 కోట్ల నుంచి రూ.50కోట్ల లోపు మాత్రమే డిపాజిట్‌ చేయొచ్చని బ్యాంక్‌ పేర్కొంది. స్వల్పకాలానికి పెట్టుబడి చేయాలకొనే సంపన్న భారతీయులు(HNI), వ్యాపారస్థులకు ఈ ఎఫ్‌డీ ఉపయోగపడుతుందని తెలిపింది. 6 నెలల నుంచి 3 సంవత్సరాల్లోపు కాలపరిమితితో చేసే రూ.2 కోట్ల లోపు డిపాజిట్ల‌పై సీనియర్‌ సిటిజన్లకు 0.50శాతం అదనపు వడ్డీని ఇస్తోంది. 80ఏళ్లు పైబడిన సూపర్‌ సీనియర్‌ సిటిజన్లకు అదనంగా 0.65శాతం మేర‌ వ‌డ్డీని అందిస్తోంది.ఇదిలా ఉండగా.. ఇటీవల స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) రూ.2 కోట్లలోపు డిపాజిట్లపై గరిష్ఠంగా 50 బేసిస్‌ పాయింట్లు మేర పెంచింది. వీటితో పాటూ ఫెడరల్‌ బ్యాంక్‌ (Federal Bank), కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ , డీసీబీ బ్యాంక్‌ (DCB Bank), యాక్సిస్‌ బ్యాంక్‌ కూడా టర్మ్ డిపాజిట్‌ వడ్డీ రేట్లను  2023 డిసెంబరులో పెంచిన విషయం తెలిసిందే.

* ఆర్బీఐ ప్రత్యేక డ్రైవ్‌లు

బ్యాంకు ఖాతాదారుల అన్‌ క్లెయిమ్డ్‌ డిపాజిట్లకు సంబంధించి ఆర్బీఐ సమగ్ర మార్గదర్శకాలు వెలువరించింది. సదరు ఖాతాదారుల ఆచూకీ తెలుసుకునేందుకు తరచూ ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని బ్యాంకులకు సూచించింది. బ్యాంకింగ్‌ వ్యవస్థలో అన్‌ క్లెయిమ్డ్‌ డిపాజిట్లను తగ్గించేందుకు, ఆ నిధులను వాటి అసలు యజమానులకు తిరిగి అందించేందుకు ఇప్పటికే బ్యాంకులు, రిజర్వ్‌ బ్యాంకు తీసుకుంటున్న చర్యలకు ఈ మార్గదర్శకాలు అదనపు మద్దతు ఇవ్వనున్నాయి.ఆర్బీఐ నోటిఫికేషన్‌ ప్రకారం బ్యాంకులు వినియోగంలో లేని ఖాతాలు, అన్‌ క్లెయిమ్డ్‌ డిపాజిట్లకు సంబంధించి లేఖలు, ఈ మెయిల్‌ లేదా ఎస్‌ఎంఎస్‌ పంపడం ద్వారా ఖాతాదారులను సంప్రదించాలి. ఈ మెయిల్‌/ఎస్‌ఎంఎస్‌లను మూడు నెలలకు ఒకసారి పంపాలి. అవసరమైతే ఖాతాదారును కనుగొనేందుకు ఇంట్రడ్యూసర్‌ను, నామినీని కూడా సంప్రదించాలి.

స్టార్‌లింక్‌తో ఎలాంటి చర్చలు జరపడం లేదు!

దేశీయ టెలికాం సంస్థ వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌ (Vodafone Idea – VI) షేర్లు గత రెండు ట్రేడింగ్‌ సెషన్లలో అనూహ్యంగా పుంజుకున్నాయి. కంపెనీలో కొంత వాటాను బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌కు  చెందిన శాటిలైట్‌ కమ్యూనికేషన్ల సంస్థ స్టార్‌లింక్‌కు (StarLink) విక్రయించనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు స్టార్‌లింక్‌తో వీఐ చర్చలు జరుపుతున్నట్లు పలు కథనాలు పేర్కొన్నాయి. కంపెనీలో ప్రభుత్వానికి ఉన్న 33 శాతం వాటాను విక్రయించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే వీఐ షేర్లు ఎగబాకాయి. అయితే, తాజాగా ఈ అంశంపై కంపెనీ క్లారిటీ ఇచ్చింది.స్టార్‌లింక్‌తో తాము ఎలాంటి చర్చలు జరపడం లేదని స్పష్టం చేసింది. అసలు ఈ వార్తలకు ఆధారమేంటో తమకు తెలియదని పేర్కొంది. ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో స్పష్టతనిచ్చింది. షేరు విలువను ప్రభావితం చేసే ఎలాంటి సమాచారాన్నైనా రెగ్యులేటరీలకు వెంటనే తెలియజేస్తామని పేర్కొంది. ఈ ప్రకటన తర్వాత కంపెనీ షేరు విలువ కిందకు దిగొచ్చింది. మంగళవారం మధ్యాహ్నం 2:04 గంటల సమయంలో షేరు ధర 5.59 శాతం కుంగి రూ.16.05 దగ్గర ట్రేడవుతోంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z