Politics

తహతహలాడుతున్న వైకాపా ప్రభుత్వం

తెదేపాకు ఆ ఘనత దక్కకుండా చేయాలని తహతహలాడుతున్న వైకాపా ప్రభుత్వం

: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఎలాగోలా అమలు చేయాలని, తెదేపాకు ఆ ఘనత దక్కకుండా చేయాలని వైకాపా ప్రభుత్వం తహతహలాడుతోంది. ఇందుకు ఎంత వ్యయమవుతుంది? ఎలా అమలు చేస్తారు? పక్క రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి? తదితర వివరాలను జగన్‌ ప్రభుత్వం.. ఆర్టీసీ అధికారుల నుంచి తీసుకుంటోంది. తెదేపా అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు గతేడాది మేలో జరిగిన మహానాడులో ప్రకటించారు. అప్పటి నుంచి వైకాపా ప్రభుత్వం అప్రమత్తమై.. ముందుగా తామే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసేందుకు ఆరాటపడుతోంది. ఇందులో భాగంగా దీనికి సంబంధించి కొందరు ఉన్నతాధికారులు, ఆర్టీసీ అధికారులను నివేదిక ఇవ్వాలని కోరడంతో.. అన్ని వివరాలు క్రోడీకరించి ఇటీవల వారు నివేదిక అందజేశారు. ‘ఇప్పటికే ఆర్టీసీ రాబడిలో 25 శాతం తీసుకుంటున్నారు. కొత్తగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలనుకుంటే.. ఆ రాయితీ భారం అధికంగానే ఉంటుంది. అటు రాబడిలో వాటా ఇచ్చి, ఇటు ఉచిత ప్రయాణ రాయితీ భరించాలంటే సంస్థకు తీవ్ర నష్టం. కనీసం డీజిల్‌ కొనుగోలుకు కూడా అవసరమైన సొమ్ము సంస్థ వద్ద ఉండదు’ అని ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది.

రాయితీ సొమ్ము సర్దుబాటు ఎలా?
ఆర్టీసీలో నిత్యం సగటున 40 లక్షల మంది వరకు ప్రయాణిస్తున్నారు. ఇందులో 15 లక్షలకు పైగా మహిళలు ఉంటారని అంచనా. ఆర్టీసీకి టికెట్ల విక్రయాల రూపంలో రోజుకు సగటున రూ.16-17 కోట్ల చొప్పున నెలకు రూ.500 కోట్ల వరకు వస్తోంది. ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణం అమలుచేస్తే నెలకు రూ.150-180 కోట్ల వరకు రాబడి కోల్పోతామని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ మొత్తాన్ని ప్రభుత్వం ఎలా సర్దుబాటు చేస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఆర్టీసీ ఉద్యోగులకు తాము జీతాలు ఇస్తున్నందున.. సంస్థ రాబడిలో 25 శాతం ఇవ్వాలని చెబుతూ ప్రతినెలా సగటున రూ. 125 కోట్ల వరకు ప్రభుత్వం తీసుకుంటోంది. 2022, ఆగస్టు నుంచి ఇలా ప్రతినెలా 25 శాతం రాబడిని ఆర్టీసీ.. ప్రభుత్వ ఖజానాకు జమచేస్తోంది.

ఇప్పుడు మహిళలకు రాయితీ భరించడంతోపాటు, ప్రభుత్వానికి సొమ్ము చెల్లింపు కూడా కొనసాగిస్తే.. ప్రతినెలా దాదాపు రూ.300 కోట్ల వరకు ఆర్టీసీ కోల్పోతుంది. అంత మొత్తం లేకపోతే డీజిల్‌, విడిపరికరాలు కొనుగోళ్లు, బస్సులు, బస్టాండ్ల నిర్వహణ కూడా సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. బ్యాంకు రుణాలు, ఉద్యోగులకు చెల్లించాల్సిన బాకాయిలతో పాటు కొత్తగా కొనుగోలు చేస్తున్న బస్సులకు చెందిన రుణ వాయిదాలూ చెల్లించే పరిస్థితి ఉండదని పేర్కొంటున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z