వ్యతిరేక పవనాలు తీవ్రంగా వీస్తున్న వేళ.. ఆ వ్యతిరేకతను ఎమ్మెల్యేలపైకి బదిలీ చేసేందుకు వైకాపా అధినాయకత్వం మార్పుచేర్పుల పేరుతో చేస్తున్న కసరత్తులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల టికెట్లతో బంతాట ఆడుతోంది. మంత్రులను ఎంపీలుగా, ఎంపీలను ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యేలను ఎంపీ అభ్యర్థులుగా మారుస్తోంది. మంగళవారం 27 పేర్లతో జాబితాను ప్రకటించింది. గత నెల 11న వెల్లడించిన 11 మందితో కలిపితే ఇప్పటివరకూ 38 మంది సమన్వయకర్తల స్థానాల్లో మార్పులు చేసింది. ఈ సంఖ్య ఇంకెంత పెరుగుతుందో.. తమ టికెట్ ఏమవుతుందోనని ఎమ్మెల్యేలు బిక్కుబిక్కుమంటున్నారు. మంగళవారం సుమారు 20 మంది ఎమ్మెల్యేలు సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి తమ పరిస్థితి ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేశారు. తాజా జాబితాలో ఎస్సీ ఎమ్మెల్యేలు కొండేటి చిట్టిబాబు(పి.గన్నవరం)ను పూర్తిగా పక్కన పెట్టేయగా.. గొల్ల బాబూరావు (పాయకరావుపేట) స్థానంలో రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులును తీసుకొచ్చారు. బాబూరావును రాజ్యసభకు పంపుతున్నారని సీఎంఓ వర్గాలు చెబుతున్నాయి.
మంత్రులకు స్థానాల మార్పు
మంత్రులు ఉష శ్రీచరణ్‌ను కళ్యాణదుర్గం నుంచి పెనుకొండకు, వేణుగోపాలకృష్ణను రామచంద్రపురం నుంచి రాజమహేంద్రవరం గ్రామీణానికి మార్చారు. అనకాపల్లిలో గుడివాడ అమర్‌నాథ్‌కు అవకాశం ఇవ్వలేదు. ఆయనకు ఏ టికెట్ ఇస్తారో చెప్పకుండా గాల్లో పెట్టారు. ఆలూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గుమ్మనూరు జయరాంను కర్నూలు లోక్‌సభ అభ్యర్థిగా దాదాపు ఖరారు చేశారంటున్నారు. దీన్నింకా అధికారికంగా ప్రకటించాలి.
ఎంపీ… మంత్రి.. వర్గపోరులో
అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను కళ్యాణదుర్గానికి మార్చారు. కళ్యాణదుర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఉష శ్రీచరణ్‌తో ఎంపీకి మొదటి నుంచీ వర్గపోరు కొనసాగుతోంది. రంగయ్య వర్గానికి చెందిన నాయకుడు కళ్యాణదుర్గం పురపాలక సంఘానికి ఛైర్మన్‌గా ఎన్నికైనా, చాలాకాలంపాటు ఆయన్ను బాధ్యతలు చేపట్టనివ్వకుండా మంత్రి అడ్డుకున్నారని ఎంపీ వర్గం ఆగ్రహంతో ఉంది. ఇరువర్గాల వారు పరస్పరం కేసులూ పెట్టుకున్నారు. ఈ వర్గపోరును సర్దుబాటు చేసేందుకే ఇప్పుడు రంగయ్యను కళ్యాణదుర్గానికి, మంత్రి ఉషను పెనుకొండకు మార్చారంటున్నారు. రంగయ్య సామాజికవర్గం ఓట్లు కళ్యాణదుర్గంలో ఎక్కువగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
ముందునుంచే ప్రయత్నాలు
ఎంపీ మార్గాని భరత్ మొదటి నుంచీ రాజమహేంద్రవరం నగర అసెంబ్లీ నియోజకవర్గంలో పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడే తన పట్టును నిలబెట్టుకునేందుకు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సైతం ప్రయత్నించడంతో ఆయనకు, భరత్‌కు మధ్య వర్గపోరు సాగింది. ఎప్పటికైనా అక్కడ పాగా వేయాలని.. ఎప్పటికప్పుడు రాజకీయ పలుకుబడి లేనివారిని పార్టీ సమన్వయకర్తలుగా నియమింపజేస్తున్నారు. ఇప్పుడు భరత్‌కే ఆ టికెట్ ఖరారైంది.
అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, కాకినాడ ఎంపీ వంగా గీత 2019లో ఎంపీలుగా ఎన్నికైనా.. అప్పటి నుంచే తాము కోరుకుంటున్న అసెంబ్లీ నియోజకవర్గాలపై దృష్టి సారించారు. మాధవి అటు పాడేరు, ఇటు అరకుపై దృష్టిపెట్టారు. ఇప్పుడు ఆమెకు అరకు దక్కింది. వంగా గీత గతంలో తాను ఎమ్మెల్యేగా గెలిచిన పిఠాపురంపైనే దృష్టి సారించారు. ఇప్పుడదే టికెట్ ఆమెకు వచ్చింది.
పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అరకు లోక్‌సభకు, పెనుకొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకరనారాయణ అనంతపురం లోక్‌సభకు సమన్వయకర్తలుగా నియమితులయ్యారు. శంకరనారాయణపై పెనుకొండలో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఈ సారి ఆయనకు టికెట్ ఇస్తే ఊరుకోబోమని పార్టీ నేతలు బహిరంగంగా చెప్పారు. శంకరనారాయణ సామాజికవర్గ ఓట్లు అనంతపురం జిల్లాలో భారీగా ఉన్నందున ఆయన్ను పక్కనపెడితే పార్టీకి ఇబ్బంది కలగవచ్చనే అంచనాతో.. అనంతపురం లోక్‌సభ టికెట్ ఆయనకు ఖరారుచేశారు.
ఎట్టకేలకు సాధించిన బోస్
పిల్లి సుభాష్‌చంద్రబోస్ తన సొంత నియోజకవర్గం రామచంద్రపురాన్ని దక్కించుకునేందుకు తీవ్రంగానే పోరాడాల్సి వచ్చింది. అక్కడ నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వేణుగోపాలకృష్ణతో యుద్ధమే చేశారు. బోస్ వర్గీయులపై మంత్రి మనిషి దాడికి దిగేంతవరకూ పరిస్థితి వెళ్లింది. వీరి వ్యవహారంలో సీఎంఓలో పలుమార్లు పంచాయితీలూ జరిగాయి. చివరకు తనకు లేదా తన కుమారుడికి రామచంద్రపురం టికెట్ ఇవ్వకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేసైనా సరే స్వతంత్రంగా పోటీచేస్తానని అల్టిమేటం జారీచేశారు. ఎట్టకేలకు ఆయన కుమారుడికి ఇప్పుడు రామచంద్రపురం సమన్వయకర్త పదవి దక్కింది.
సిటింగులకు మొండిచేయి
మంగళవారం ప్రకటించిన జాబితాలో మంత్రి గుడివాడ అమరనాథ్ (అనకాపల్లి), మల్లాది విష్ణు (విజయవాడ సెంట్రల్), చెన్నకేశవరెడ్డి (ఎమ్మిగనూరు), పీవీ సిద్దారెడ్డి (కదిరి), కొండేటి చిట్టిబాబు (పి.గన్నవరం), గొల్ల బాబూరావు (పాయకరావుపేట) టికెట్లు గల్లంతయ్యాయి. తెల్లం బాలరాజు(పోలవరం)కు బదులు ఆయన భార్య రాజ్యలక్ష్మికి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.
మంత్రుల స్థానాలు మారాయి
చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రామచంద్రపురం నుంచి రాజమహేంద్రవరం గ్రామీణానికి, కేవీ ఉష శ్రీచరణ్‌ను కళ్యాణదుర్గం నుంచి పెనుకొండకు మార్చారు. వారిద్దరికీ సొంత స్థానాల్లో తీవ్ర వ్యతిరేకత రావడం వల్లే ఇలా చేసినట్లు తెలుస్తోంది.
లేదు.. లేదంటూనే వారసులకు
ఈసారి ఎన్నికల్లో తమ వారసులకు టికెట్లు ఇవ్వాలంటూ అనేకమంది మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి జగన్‌ను పలుమార్లు కలిసి విన్నవించారు. వీళ్లలో కొందరైతే తాము రాజకీయంగా రిటైరైపోతామనీ చెప్పారు. కానీ, ‘ఈసారి వారసులకు టికెట్లు ఇచ్చేది లేదు.. మీ వారసులను నియోజకవర్గాల్లో తిప్పండి. కానీ ఈ ఎన్నికల్లో మీరే పోటీ చేయాలి’ అంటూ అప్పట్లో చెప్పిన జగన్.. ఇప్పుడు కాస్త తగ్గినట్లున్నారు. భూమన కరుణాకరరెడ్డి (తిరుపతి) కుమారుడు అభినయ్‌రెడ్డికి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (చంద్రగిరి) కుమారుడు మోహిత్‌రెడ్డికి, పేర్ని నాని (మచిలీపట్నం) కుమారుడు పేర్ని కృష్ణమూర్తికి, రామచంద్రపురం అసెంబ్లీ టికెట్‌ను ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్‌కు ఖరారు చేశారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ ముస్తఫాకు బదులు ఆయన కుమార్తె నూరి ఫాతిమాకు టికెట్ ఇచ్చారు.
మధ్యాహ్నం కండువా.. సాయంత్రం పేరు
బళ్లారికి చెందిన మాజీ మంత్రి బి.శ్రీరాములు సోదరి జోలదరాశి శాంత మంగళవారం మధ్యాహ్నం వైకాపాలో చేరారు. ఆమెకు సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సాయంత్రానికి హిందూపురం లోక్‌సభ అభ్యర్థిగా ఆమె పేరును ప్రకటించేశారు. గోరంట్ల మాధవ్‌ను పూర్తిగా పక్కన పెట్టేశారు.
👉 – Please join our whatsapp channel here –