రికార్డు అప్పులతో రాష్ట్రం దూసుకువెళ్తోంది. 2024లో ప్రవేశించిన రెండో రోజే రూ.3,000 కోట్ల రుణం సమీకరించింది. 8 ఏళ్ల కాలపరిమితితో తిరిగి చెల్లించేలా 7.74% వడ్డీతో రూ.1000 కోట్లు, 12 ఏళ్ల కాలపరిమితితో 7.74% వడ్డీకే మరో రూ.1000 కోట్లు తీసుకుంది. ఇంకో రూ.1000 కోట్లను 19 ఏళ్ల కాలపరిమితితో 7.70% వడ్డీకి తీసుకుంది. ఆ నిధులు రాష్ట్ర ఖజానాకు బుధవారం జమ అయ్యే అవకాశం ఉంది. మరో వైపు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛన్ల చెల్లింపునకు ఆపసోపాలు తప్పట్లేదు. ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరం అప్పుల భారం రూ.లక్ష కోట్లకు చేరువవుతోంది. ఇంకా మూడు నెలలు గడవాలి. కేంద్రం నుంచి వివిధ రూపాల్లో రుణ అనుమతులు తీసుకునేందుకు సర్కార్ ప్రయత్నాలు సాగిస్తోంది. అసలే ఎన్నికల సంవత్సరం. వీలైనంత మందిని సంతృప్తిపరచాలనే తాపత్రయంతో పుట్టినన్ని అప్పులు చేసి గట్టెక్కాలనే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి.
8 నెలల్లో రూ.65,660 కోట్ల అప్పు
రాష్ట్రప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం తొలి 8 నెలల్లోనే అంచనాలకు మించి అప్పులు పుట్టించింది. బడ్జెట్ ప్రతిపాదనల్లో ఆర్థిక సంవత్సరం మొత్తం మీద రూ.54,587.53 కోట్ల రుణం తీసుకుంటామంది. కానీ, నవంబరు నెలాఖరు వరకే రూ.65,660 కోట్ల రుణం తీసుకున్నట్లు కాగ్‌కు తెలియజేసింది. అంచనాలకు మించి 20% మేర అప్పటికే తీసేసుకున్నారు. చివరి మూడు నెలల్లో మరిన్ని రుణ అనుమతుల కోసం ప్రభుత్వం కేంద్ర ఆర్థికశాఖ వద్ద ప్రయత్నాలు సాగిస్తోంది. విద్యుత్తు సంస్కరణలు, సీపీఎస్ అమలు రూపేణా అదనపు రుణసౌలభ్యం పొందుతున్నారు. కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలెంతో స్పష్టం చేయలేదని కాగ్ తన నివేదికల్లో ప్రశ్నించింది. ఇప్పటికే వివిధ కార్పొరేషన్ల పేరుతో రూ.25వేల కోట్లకు పైగా రుణాలు తీసుకున్నారు. ఇప్పటికే అన్ని రుణాలు కలిపి రూ.లక్ష కోట్లు దాటేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల్లో పుట్టించే అప్పులతో రికార్డులు బద్దలవుతాయి.
ఆంధ్రప్రదేశ్‌లో నవంబరు నెలాఖరు వరకు పన్నుల రాబడి మొత్తం రూ.79 వేల కోట్లు ఉంటే రాష్ట్రంలో చేసిన అప్పుల మొత్తం రూ.65 వేల కోట్లుగా ఉందని కాగ్ నివేదికలే పేర్కొంటున్నాయి. ఇందులో కార్పొరేషన్ల రుణాలు కూడా చేరిస్తే పన్నుల వసూళ్ల కన్నా రుణాల మొత్తమే ఎక్కువవుతుంది.
మరో రూ.18 వేల కోట్ల అప్పు కావాలి
ఎన్నికలకు ముందు వీలైనంత అప్పు పుట్టించేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన మూడు నెలల్లో రూ.18 వేల కోట్లు కావాలని రిజర్వు బ్యాంకుకు వర్తమానం పంపింది. జనవరిలోనే రూ.9,000 కోట్లు తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. తొలి తొమ్మిది నెలలకు కేంద్రం ఇచ్చిన రుణ పరిమితుల మేరకు అప్పులు పుట్టించిన ప్రభుత్వం.. ఇప్పుడు అదనపు అనుమతుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. తొలి ప్రయత్నాల్లో రూ.5,000 కోట్ల వరకు అప్పులకు రాష్ట్రానికి కేంద్రం అనుమతులు ఇచ్చినట్లు తెలిసింది. మంగళవారం రూ.3,000 కోట్ల సమీకరణ పూర్తయింది. ఫిబ్రవరిలో రూ.5,000 కోట్లు, మార్చి నెలలో రూ.4,000 కోట్లు అప్పు కావాలని రిజర్వు బ్యాంకుకు రాష్ట్రం తెలియజేసింది. కేంద్రం నుంచి అనుమతుల వస్తేనే ఆ రుణం తీసుకోవడం సాధ్యమవుతుంది.
👉 – Please join our whatsapp channel here –