కనుబొమలు తీరైన ఆకృతిలోకి రావాలంటే పార్లర్‌కు వెళ్లి త్రెడింగ్ చేయించుకుంటాం. ఇంట్లో అప్పుడప్పుడూ ప్లక్కర్‌తో అవాంఛితంగా పెరిగిన వాటిని తీసేస్తాం. ఏది చేసినా కొద్దిగా నొప్పి, అక్కడి చర్మం ఎర్రగా కందిపోవడం వంటి సమస్యలు మామూలే. ఇలాంటివేవీ లేకుండా ఇప్పుడు కొత్త పద్ధతి అందుబాటులోకి వచ్చిందట. అదే ఐబ్రో పిన్చింగ్. అంటే కనుబొమలను నొక్కినట్లు చేయడం. లండన్, న్యూయార్క్‌లోని ఓ ప్రముఖ బ్యూటీపార్లర్ తన శాఖలన్నింట్లో దీన్ని ప్రవేశపెట్టడంతో ఇప్పుడు ఇది అంతర్జాలంలో హల్‌చల్ చేస్తోంది. కనుబొమలను సున్నితంగా నొక్కుతూ, వాటికి మర్దన చేస్తూనే అవి సరైన ఆకృతిలో వచ్చేలా చూస్తారు. దీనివల్ల ఆ భాగంలో రక్తప్రసరణా సజావుగా సాగుతుందట. ఇది బొటాక్స్ కంటే మెరుగైందని చెబుతున్నారు సౌందర్య నిపుణులు. కనుబొమలు షేప్ చేయించునేటప్పుడు వచ్చే వాపూ తగ్గుతుందని, ఆ భాగంలో గీతలు, ముడతలు లాంటివి పడవని అంటున్నారు. ఈ చికిత్స మూలాలు ఆయుర్వేదంలో ఉన్నాయని అంటున్నారు కొందరు వైద్యులు. ఆయుర్వేదం ప్రకారం శరీరంలో కొన్ని ప్రదేశాల్లో ఒత్తిడి పెంచడం ద్వారా మిగతా భాగాలకు సాంత్వన చేకూరుతుంది. ఇదీ అలాంటిదేనని అంటున్నారు. సాధారణంగా కంటి చుట్టూ ఉండే కణజాలం వదులవడం వల్ల ఆ ప్రాంతంలో వాపు కనిపిస్తుంది. మృదువుగా మర్దనా చేస్తే ఆ సమస్య అదుపులో ఉంటుంది. కళ్లూ ఆరోగ్యంగా ఉంటాయి. దీనికోసం నిపుణుల దగ్గరకే వెళ్లాలని లేదు. ఇంట్లోనూ ప్రయత్నించొచ్చు. ఎలాగంటే… చల్లటి ఐసు ముక్క లేదా వస్త్రాన్ని ఆ ప్రాంతంలో అద్దినట్లు చేసినా చాలు. షేపింగ్, ఫేషియల్స్ తరువాత దీన్ని చేయడం వల్ల హాయిగా అనిపిస్తుంది.
Have you heard of eyebrow pinching technology
Related tags :