యాదాద్రి, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఒక్కటంటే ఒక్క మండలంలోనైనా సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. సూర్యాపేట జిల్లాలో ఒకే ఒక్క మండలంలో సాధారణ వర్షాలు కురిశాయి. ఈనాడు, హైదరాబాద్: వర్షాభావ పరిస్థితులు కొనసాగుతుండటంతో కరవు ఛాయలు అలుముకుంటున్నాయి. రాష్ట్రంలో 433 మండలాల్లో వర్షాభావం తీవ్రస్థాయికి చేరింది. తెలంగాణపై నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. కారుమబ్బులు లేనందున సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మంగళవారం నుంచి మరో 2 రోజులూ తేలికపాటి వర్షాలేనని వాతావరణ శాఖ తెలిపింది. ఈ పరిస్థితుల్లో రైతులు తక్కువ కాలంలో పండే వంగడాలనే ఎంచుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
* గత నెల ఒకటి నుంచి సోమవారం వరకూ రాష్ట్రస్థాయిలో సాధారణ వర్షపాతం 232.7 మిల్లీమీటర్ల(మి.మీ.)కు గాను 152.2 మి.మీ.లే కురిసింది. గత నెల(జూన్)లో వర్షపాతం లోటు 33 శాతముంటే ఈ నెలలో అది మరింత విస్తరించి 35కి పెరిగింది.
* కొన్ని మండలాల్లో వర్షపాతంలోటు 90 శాతానికిపైగా ఉంది. ఇది 60 శాతానికి మించితే కరవు ఉన్నట్లుగా భావిస్తారు.
* ఇప్పటికే 40 లక్షల ఎకరాలకుపైగా విస్తీర్ణంలో వేసిన పైర్లు సైతం నీరు అందక వాడుముఖం పడుతున్నాయి. మరో వారం, పది రోజులు వర్షాలు లేకపోతే పంటలు చాలా వరకూ ఎండిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
* హైదరాబాద్‌లో సోమవారం పగటి ఉష్ణోగ్రత సాధారణంకన్నా 4 డిగ్రీలు అధికంగా ఉంది. భద్రాచలంలో ఆదివారం రాత్రి 27.5 డిగ్రీలుంది. ఇది సాధారణంకన్నా 3.1 డిగ్రీలు ఎక్కువ. అధిక వేడికి గాలిలో తేమ తగ్గి ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు.
జులై మూడో వారం వచ్చినా ఇంతవరకూ వర్షాలు లేనందున పలు పంటల సాగు కాలం తీరిపోయింది. మినుము, పెసర, వేరుసెనగ, సోయాచిక్కుడు వంటి ప్రధాన పంటలను ఈ ఖరీఫ్‌లో ఇక సాగుచేయవద్దని జయశంకర్ వ్యవసాయ వర్సిటీ పరిశోధన సంచాలకుడు జగదీశ్వర్ రైతులకు సూచించారు. వరిలోనూ తక్కువకాలంలో పండే వంగడాలకే నారు పోయాలన్నారు. ఈ నెలాఖరు వరకూ వర్షాలు లేకపోతే ఆగస్టులో నారు, నాట్ల జోలికి వెళ్లకుండా నేరుగా వరి విత్తనాలను చల్లే సాగు పద్ధతిని అనుసరించాలని చెప్పారు.