NRI-NRT

ఉండవల్లికి ప్రవాసాంధ్రుల లేఖ

AP NRIs write letter to undavalli arunkumar asking for a public debate

నమస్కారం అరుణ్ కుమార్ గారూ !

మేము అమెరికాలో నివసిస్తున్న ప్రవాసాంధ్రులం. ప్రస్తుతం మీరు అమెరికా పర్యటన్లో ఉన్నారని తెలిసింది. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం తపించే వ్యక్తిగా మీరంటే మాకు ఎంతో గౌరవం. విభజన సమయంలోనూ, ఆ తరువాతి పరిణామాల్లోనూ మీ భావజాలం, సుప్రీంకోర్టు తలుపులు తట్టిన మీ క్రియాశీలత చూసి మీరంటే గౌరవం ఇంకా పెరిగింది. రాజకీయపార్టీలకు అతీతంగా మన ఆంధ్రప్రదేశ్, దాని ప్రయోజనాలే మిన్న అని బలంగా నమ్మే మీలాంటి పెద్దలు రాష్ట్ర విభజన సమయంలో తమ స్వరం వినిపించడంవల్లనే మన రాష్ట్రప్రయోజనాలు కొద్దిగానైనా కాపాడబడినాయి. గత కొద్దిరోజులుగా విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలు, తెలంగాణాతో ఆస్తుల విభజన, గోదావరి నదీజలాలను శ్రీశైలానికి తరలించే కొత్తప్రతిపాదనలు …తదితర అంశాల్లో జరుగుతున్న పరిణామాలు, నెలకొన్న సందిగ్ధత మన రాష్ట్రప్రయోజనాలకి విఘాతం కలిగిస్తాయేమో అనే అనుమానం మాకు కలుగుతున్నది. ఇటువంటి సందర్భంలో సుదీర్ఘమైన అనుభవం, విజ్ఞత కలిగిన మీవంటి పెద్దలు స్పందించి మన రాష్ట్రానికి ఇవన్నీ మేలు చేకూరుస్తాయా లేక మళ్ళీ మరొకసారి మనవేలితో మన కన్నే పొడుచుకుంటున్నామా అనే విషయాల్ని ఆంధ్రులతో, మీడియాతో బహిరంగంగా చర్చిస్తే బాగుంటుందని మా అభ్యర్ధన. మీలాంటి మేధావులు స్పందిస్తే కనీసం ఏవైనా దురాలోచనలు ఉన్నవారికి అడ్డుకట్ట వేసినట్లైనా అవుతుంది. లేకపోతే విభజన సమయంలో మాదిరిగానే ‘ఎవరికి పుట్టిన బిడ్డరా వెక్కి వెక్కి ఏడుస్తోంది” అన్న చందాన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అనాథ అవుతుందని మా భయం. దయచేసి మన రాష్ట్రప్రయోజనాల కోసం ఈ కీలక సమయంలో మీరు స్పందించగలరని అభ్యర్ధిస్తున్నాం. వీలయితే అమెరికాలో ఏదైనా పౌరవేదిక కార్యక్రమంలో ఈ విషయాలగురించి మీరు స్పందిస్తే మాకు కొంత అవగాహన పెరుగుతుందని ఆశిస్తున్నాం.

ధన్యవాదాలతో,
అమెరికా ప్రవాసాంధ్రులు