DailyDose

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం-తాజా వార్తలు

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం-తాజా వార్తలు

* న్యాయవాదుల పోరాటానికి జనసేన మద్దతు

గుంటూరు, విజయవాడ బార్‌ అసోసియేషన్‌ల న్యాయవాదులు శుక్రవారం జనసేన కార్యాలయంలో పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ను కలిశారు. సమగ్ర భూరక్ష చట్టంలో లోపాలపై న్యాయవాదులతో పవన్‌ చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టంపై ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవాదుల పోరాటానికి జనసేన మద్దతుగా ఉంటుందని ఈ సందర్భంగా పవన్‌ ప్రకటించారు.న్యాయవాదులతో సమావేశం అనంతరం పవన్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘సమగ్ర భూరక్ష చట్టం వల్ల న్యాయవాదులకు అనేక ఇబ్బందులు వస్తాయి. నా భూమిపై నీకు హక్కేంటి అనేది ఇక్కడి సమస్య. ఈ చట్టం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది. రెవెన్యూ అధికారుల సాయంతో ఆస్తులు దోచుకోవచ్చు. కోర్టు నుంచి న్యాయరక్షణ పొందవచ్చు అనే దాన్ని ఇందులో లేకుండా చేశారు. విశాఖలో దోచుకున్న ఆస్తులను చట్టబద్ధం చేసుకునేందుకే దీన్ని తీసుకొచ్చారా? ఇలాంటి వాటి ద్వారా రుషికొండను దోచుకొని నచ్చిన వారికి రాసుకోవచ్చు. సమగ్ర భూరక్ష చట్టం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.సమగ్ర భూరక్షలో.. కోర్టుల మధ్యవర్తిత్వాన్ని తీసేశారు. ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు దారి తీస్తుంది. అసలు ఆస్తి పత్రాలపై జగన్‌ బొమ్మ ఉండటం ఏంటి? రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల నుంచి న్యాయవాదుల వరకు ఉద్యమాలు చేసే పరిస్థితి వచ్చింది. సమగ్ర భూరక్షకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న న్యాయవాదులకు సంపూర్ణ మద్దతు ఇస్తా. సగటు మనిషికి సులువుగా అర్థమయ్యేలా ఈ అంశంపై మరింత అధ్యయనం చేస్తా. అందరికీ అర్థమయ్యేలా చెప్పేందుకు నాకు కాస్త సమయం కావాలి’’ అని పవన్‌ పేర్కొన్నారు.

* రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత సర్కార్ పలు మార్పులు చేస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే గత ప్రభుత్వం నియమించిన 54 మంది వివిధ కార్పొరేషన్ల చైర్మన్ల నియామకాలను ఇటీవల రద్దు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం నియమించిన 33 జిల్లాల గ్రంథాలయ సంస్థల చైర్మన్లు, సభ్యులను తొలగించింది. ఈ మేరకు ఇవాళ చైర్మన్లు, సభ్యులను తొలగిస్తూ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

* హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్‌

హైదరాబాద్‌-నాగ్‌పూర్‌(Hyderabad-Nagpur) జాతీయ రహదారి(National highway)పై భారీగా ట్రాఫిక్ జామ్‌(Heavy traffic jam) అయింది. సుమారు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సిద్దిపేట జిల్లాలోని నిన్న ఓ గ్రామంలోని యువతిని కక్షపూరితంగా కారుతో గుద్దించి చంపేశారని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఇదే ప్రమాదంలో మరో నలుగురు గాయపడ్డారు. కాగా, యువతి మృతికి కారణమైన వారిని శిక్షించాలని జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు. కుటుంబ సభ్యుల ఆందోళనతో రోడ్డుపైన భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

* సోనియా గాంధీ ఖమ్మంలో పోటీ చేస్తే.. వీహెచ్‌ ఏమన్నారంటే.. !

సోనియాగాంధీ ఖమ్మంలో పోటీ చేస్తే ఆ ప్రభావం అన్ని నియోజకవర్గాలపై పడుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. రాష్ట్రంలో సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అన్ని నియోజకవర్గాల్లో ఇంటింటి ప్రచారం చేస్తానన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సోనియా గాంధీ భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తామని, భారత్ కూటమిని గెలిపిస్తామని వీహెచ్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలకు పనిలేక 420 బుక్ లెట్ తో కాంగ్రెస్ పార్టీని బద్నామ్ చేస్తున్నారని మండి పడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు కాంగ్రెస్ పార్టీ ని గెలిపెంచారని స్పష్టం చేశారు. పది ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని హామీలు నిరవేర్చారో ప్రజలకు చెప్పాలి? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవరుస్తుందని.. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు భయం పట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన దళితులకు ముడు ఎకరాల భూమి ఇంటికో ఉద్యోగ హామీలు నెరవేర్చలేకపోయారన్నారు.

* విశాఖలో భువనేశ్వరి పర్యటన

‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా విశాఖలో తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించారు. 45వ డివిజన్‌లోని తాటిచెట్లపాలెంలో చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన తెదేపా కార్యకర్త కనకరాజు కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. శ్రేణులకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబసభ్యులకు రూ.3 లక్షల ఆర్థికసాయం అందజేశారు. అనంతరం కార్యకర్తలు, నాయకులు, ప్రజలను పలకరించారు. భువనేశ్వరి వెంట ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత తదితరులు ఉన్నారు.

* నన్ను చంపేందుకు ప్రయత్నించారు

డిసెంబర్ 25న తనను చంపే ప్రయత్నం జరిగిందని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే క్రిస్మస్ పండుగనాడు తనకు ఫుడ్ పాయిజనింగ్ ఇచ్చారని వెల్లడించారు. ప్రస్తుతం విశాఖపట్నంలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నానని తెలిపారు. దేవుడి దయవల్ల ఫుడ్ పాయిజన్ నుంచి బతికి బయట పడినట్లు స్పష్టం చేశారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఇలా జరిగిందని ఇవాళ ఓ ఆడియోతో మీడియాకు తెలిపారు.

* ఊపిరి ఉన్నంత వరకు వైసీపీతోనే

ఎన్నికల సమయంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన మార్పులు, చేర్పులపై కొందరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కారు.. పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన విషయం విదితమే కాగా.. ఉన్నట్టుండి ఇప్పుడు ఆయన యూ టర్న్‌ తీసుకున్నారు.. ఓపిక ఉన్నంత వరకు కాదు.. ఊపిరి ఉన్నంత వరకు వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతోనే ఉంటాను అని స్పష్టం చేశారు ఎంఎస్‌ బాబు.. ఇంట్లో తండ్రిని కొడుకు ఏ విధంగా అడుగుతాడో అదే హక్కుతో నేను మాట్లాడాను.. వాటిని కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేశాయని మండిపడ్డారు.ఇక, నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి, తండ్రి లాంటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, నన్ను గెలిపించిన పూతలపట్టు నియోజకవర్గ ప్రజలే కారణం అన్నారు ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు.. నేను ప్రెస్ మీట్ లో మాట్లాడినవి ఎవరిని ఉద్దేశించి కాదన్న ఆయన.. నా ప్రాణం ఉన్నంత వరకు వైసీపీ కోసమే కష్ట పడతాను, మంత్రి పెద్దిరెడ్డి, సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి మేలు మరువలేనిది పేర్కొన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కుటుంబంలో చిచ్చుపెట్టే విధంగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నన్ను వైసీపీ నుంచి బయటకు పంపించాలన్న ఉద్దేశంతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు.కాగా, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు లేదని చెప్పడంపై సీఎం వైఎస్‌ జగన్‌ఫై పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు హాట్‌ కామెంట్లు చేసిన విషయం విదితమే.. రాబోయే ఎన్నికల కోసం అభ్యర్థులను ఎంపిక చేసేందుకు వైసీపీ హైకమాండ్‌ ఐప్యాక్ సర్వేలపై ఆధారపడుతున్నట్టు ప్రచారంలో ఉండగా.. డబ్బులిస్తే ఐప్యాక్ వాళ్లు సర్వే ఫలితాలు తారుమారు చేస్తారు అని ఆయన ఆరోపించారు. ఈసారి ఎన్నికల్లో తనకు అవకాశం లేదని, పూతలపట్టు టికెట్ ఆశించవద్దని చెప్పడం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు.. పూతలపట్టు నియోజకవర్గం కోసం ఎంతో పాటుపడ్డాను.. కానీ, తనకు టికెట్ నిరాకరించడం సరైన నిర్ణయం కాదన్నారు.. టికెట్ల అంశంలో వైసీపీలో దళితులకు అన్యాయం జరుగుతోంది.. దళితులు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లోనే మార్పులు చేస్తున్నారు అంటూ ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం విదితమే కాగా.. ఇప్పుడు ఆయన యూటర్న్‌ తీసుకోవడం విశేషం.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z