రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, తగ్గేదే లేదంటూ.. పారిశుద్ధ్య కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. ఆందోళన ప్రారంభించి రోజులు గడుస్తున్నా సర్కారు పట్టించుకోవడం లేదంటూ మండిపడుతున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఓంగోలులోని మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. కమిషనర్ వాహనాన్ని అడ్డుకున్నారు. చెత్తవాహనాలు కార్యాలయం నుంచి బయటకు రాకుండా నిలిపివేశారు. గేటు ఎదుట ఉద్యోగులను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తోటి కార్మికులను అరెస్టు చేసి తీసుకెళ్తున్న పోలీసు వాహనాన్ని అడ్డుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో వాహనంలోకి ఎక్కించిన కార్మికులను పోలీసులు వెంటనే దించేశారు. పెండింగ్‌లో ఉన్న జీతాలను విడుదల చేస్తామని కార్మికులకు కమిషనర్ హామీ ఇచ్చారు.
మరోవైపు రాజంపేట మున్సిపల్ కార్యాలయాన్ని కూడా పారిశుద్ధ్య కార్మికులు ముట్టడించారు. కనీస వేతనం రూ.26వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. సీఐటీయూసీ నాయకుడు రవితోపాటు పలువురు కార్మికులను పోలీసులు వాహనం ఎక్కించారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసనకు సిద్ధమైన కార్మికులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. విజయనగరం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెళ్తున్న వారిని అరెస్టు చేశారు.
👉 – Please join our whatsapp channel here –