DailyDose

అంగన్‌వాడీలపై ఎస్మా ప్రయోగం దుర్మార్గం- తాజా వార్తలు

అంగన్‌వాడీలపై ఎస్మా ప్రయోగం దుర్మార్గం- తాజా వార్తలు

* అంగన్‌వాడీలపై ఎస్మా ప్రయోగం దుర్మార్గం

అంగన్‌వాడీలపై ఎస్మా ప్రయోగం దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అంగన్వాడీల సమ్మె చేపట్టారని, కానీ సమ్మెను నిషేధించడం హేయమైన చర్య అని అన్నారు. అక్రమ జీవోలతో అంగన్వాడీల న్యాయ పోరాటాన్ని అడ్డుకోలేరని చెప్పారు. తక్షణమే జీవో నెం.2 ఉపసంహరించుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. అంగన్‌వాడీల పోరాటానికి టీడీపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంపై అంతిమ విజయం అంగన్‌వాడీలదేనని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడబోతున్నారని అచ్చెన్నాయుడు జోస్యం చెప్పారు.

* పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తా!

పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తానని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలిపారు. పీర్జాదిగూడ నగర మేయర్‌ జక్కా వెంకట్‌రెడ్డితో కలిసి శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయన్నారు. ఆరు పథకాలు ఏ విధంగా అమలు చేస్తారో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. తనపై పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్‌ అభ్యర్థి.. గెలిచినట్టు తిరుగుతూ మేడ్చల్‌ నియోజకవర్గ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. భారాసతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.

* భారత దేశంలో 774 కోవిడ్ కేసులు నమోదు

భారతదేశంలో ఒకే రోజు 774 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, అయితే క్రియాశీల కేసుల సంఖ్య 4,187 గా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది.. ఉదయం 8 గంటలకు అప్‌డేట్ చేసిన మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, 24 గంటల వ్యవధిలో ఇద్దరు మరణాలు తమిళనాడు మరియు గుజరాత్‌ల నుండి ఒక్కొక్కటి నమోదయ్యాయి.డిసెంబరు 5 వరకు రోజువారీ కేసుల సంఖ్య రెండంకెలలో ఉంది, అయితే ఇది చల్లని వాతావరణ పరిస్థితుల మధ్య మరియు కొత్త కోవిడ్-19 వేరియంట్ JN.1 ఆవిర్భావం తర్వాత మళ్లీ పెరగడం ప్రారంభమైంది. డిసెంబర్ 5 తర్వాత, డిసెంబర్ 31, 2023న అత్యధికంగా 841 కేసులు నమోదయ్యాయి, ఇది మే 2021లో నమోదైన గరిష్ట కేసుల్లో 0.2 శాతం అని అధికారిక వర్గాలు తెలిపాయి..

* ఆదిత్య ఎల్-1 అద్భుత విజయంపై జగన్‌ హర్షం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సైంటిస్టులకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్-1 అద్భుత విజయంపై సీఎం జగన్‌ హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఇస్రో మరిన్ని విజయాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు.భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రయోగించిన ఆదిత్య ఎల్‌-1 మిషన్‌ శనివారం అద్భుత విజయం సాధించింది. ఆదిత్య వ్యోమనౌక సాయంత్రం 4 గంటలకు సూర్యుడికి అతి సమీపంలో లాంగ్రేజియన్‌ పాయింట్‌లోకి ప్రవేశించింది. ఈ వ్యోమనౌక అంతరిక్షంలో 127 రోజుల పాటు 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి ఎల్‌-1 పాయింట్‌లోకి ప్రవేశించింది.

* ఏపీలో కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదు

అంగన్వాడీల సమ్మెపై ఎస్మా ప్రయోగం సరైందేనని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘‘అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, గర్భిణులు ఇబ్బంది పడుతున్నారు. వారి ప్రాణాలు కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అత్యవసర సర్వీసుల కింద ఉన్నారు.. తిరిగి విధుల్లో చేరాలని పలుమార్లు విజ్ఞప్తి చేశాం. కానీ, ప్రభుత్వ ఆదేశాలను వారు ధిక్కరించారు. అందుకే అంగన్వాడీల సమ్మెపై ఎస్మా ప్రయోగించాల్సి వచ్చింది’’ అని పేర్కొన్నారు.షర్మిల కాంగ్రెస్‌లో చేరడం వెనుక తెదేపా అధినేత చంద్రబాబు కుట్ర ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. షర్మిల రాజకీయంగా ఎక్కడి నుంచైనా ప్రాతినిధ్యం వహించవచ్చన్నారు. ఆమె వల్ల వైకాపాకు వచ్చే నష్టం ఏమీ ఉండదని వ్యాఖ్యానించారు. ఏపీలో కాంగ్రెస్‌ పార్టీకి భవిష్యత్తు లేదని.. అలాంటి పార్టీని తాము పట్టించుకోమని సజ్జల తెలిపారు.

* ఎస్మా ప్రయోగంపై అంగన్వాడీల తీవ్ర అభ్యంతరం

ఆంధ్రప్రదేశ్‌లో తమ డిమాండ్ల సాధన కోసం 26 రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నారు అంగన్వాడీలు.. వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇదే సమయంలో.. ప్రభుత్వం జరిపిన చర్చలు కూడా విఫలం అయ్యాయి.. దీంతో, అంగన్వాడీలపై సీరియస్‌ యాక్షన్‌కు దిగింది ఏపీ ప్రభుత్వం.. వారిపై ఎస్మా ప్రయోగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనంలో కోత విధించింది. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకొస్తూ జీవో నెం.2 తీసుకొచ్చింది.. అయితే, ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంపై అంగన్వాడీల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.. తమను అదిరించి, బెదిరించి ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టం చేస్తున్నారు. తమకు కనీస వేతనం 26,000 ఇచ్చి తీరాలని లేదంటే అప్పటివరకు సమ్మె చేసి తీరతాం అంటున్నారు. అత్యవసర విధులు అనుకుంటే, తమకు అందాల్సిన హక్కుల్ని కూడా ప్రభుత్వం పట్టించుకోవాలని గుర్తు చేస్తున్నారు అంగన్వాడీలు. తాము హక్కుల సాధన కోసం ఎంతవరకైనా పోరాడుతామని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అమలు చేసే వరకు సమ్మె విరమించబోమని తేల్చేశారు అంగన్వాడీలు.

* కూకట్​పల్లి జోనల్ కమిషనర్ మమత ఔట్

కూకట్​పల్లి జోన్ పరిధిలో సుధీర్ఘ కాలంగా పని చేస్తున్న జోనల్ కమిషర్​మమతకు స్థాన చలనం లభించింది. కూకట్​పల్లి జోనల్​కమిషనర్​మమతను నేషనల్​ఇన్‌స్టిట్యూట్​ఆఫ్​అర్బన్​మేనేజ్​మెంట్ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీఆర్ఎస్​ పార్టీకి విధేయురాలిగా పని చేస్తుందని, మాజీ మంత్రి అండతో తనకు కావలసిన చోట పోస్టింగ్​ వేయించుకోవడం, గంటలో తనకు వచ్చిన బదిలీ ఆర్డర్‌ను సైతం వెనకకు తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయిస్తూ సుధీర్ఘ కాలం కూకట్ పల్లి జోన్‌లోనే పాతుకు పోయినట్లు ఆమెపై పలు ఆరోపణలు ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి గతంలో జోనల్​కమిషనర్​ మమతకు వినతి పత్రం అందజేసేందుకు వచ్చిన.. ఆమె పట్టించుకోక పోవడంతో రేవంత్​రెడ్డి జోనల్​కమిషనర్​మమతపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటనలు ఉన్నాయి.ఈ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మమతపై వేటు పడుతుందని భావించగా.. ముఖ్యమంత్రిగా రేవంత్​రెడ్డి బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకు జోనల్ కమిషనర్​మమత టీజీఓ సంఘం తరఫున రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపింది. దీంతో మమత బదిలీ అంత త్వరగా ఉండక పోవచ్చని అందరు భావించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం శనివారం జీహెచ్‌ఎంసీ పరిధిలో జోనల్ కమిషనర్‌లకు స్థాన చలనం కల్పించి మమతను నేషనల్​ఇన్‌స్టిట్యూట్​ఆఫ్​ అర్బన్​మేనేజ్​మెంట్ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగిస్తూ, ఆమె స్థానంలో ఐఏఎస్ అధికారి అభిలాష అభినవ్‌ను కూకట్​పల్లి జోనల్​ కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

* రెండవరోజు రాజరాజ నరేంద్ర వేదికపై నిర్వహించిన కృతజ్ఞతాంజలి సభ

ఒక జాతి సాంస్కృతిక గొంతుక భాషేనని, అందుకే అమ్మ భాష తెలుగు వ్యాప్తికి అందరూ బాధ్యత తీసుకోవాలని, మిజోరాం గవర్నర్ డా. కంభంపాటి హరిబాబు సూచించారు. తెలుగు భాష పట్ల అభిమానం పెంచుకుని వ్యాప్తి చేయడం, ప్రోత్సహించడం చేయాలన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో రాజమండ్రి గైట్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న త్రిదిన అంతర్జాతీయ తెలుగు మహా సభలలో భాగంగా రెండవరోజు రాజరాజ నరేంద్ర వేదికపై నిర్వహించిన కృతజ్ఞతాంజలి సభలో ఈయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్బంగా డా.హరిబాబు మాట్లాడుతూ.. మన దేశంలో దాదాపు 14వందల భాషలు ఉన్నాయని, అందులో 230 భాషలు ఈశాన్య రాష్ట్రాల్లోని గిరిజన తెగలకు సంబందించిన భాషలున్నాయని ఆయన చెప్పారు. అయితే సుందరమైన భాష తెలుగు అని తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి వ్యాఖ్యానిస్తే, దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష దేవరాయలు అన్నారని, ఇక ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అనే నానుడి తెలుగు భాషకు ఉందని గుర్తుచేశారు. అవధాన ప్రక్రియ మహత్తర తెలుగు భాష సొంతమన్నారు. తెలుగు ప్రాచీన భాషగా కూడా గుర్తింపు పొందిందని గుర్తుచేశారు.కవితలు, కథలు, గేయాలు, హరికథలు, బుర్రకథలు గజల్స్ వంటి ఎన్నో ప్రక్రియలు తెలుగు భాషలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు వంటి మహనీయుల కీర్తనలు , పింగళి, ఆరుద్ర , త్రిపురనేని వంటి కవుల రచనలు తెలుగు భాషకు వన్నె తెచ్చాయన్నారు. అల్లూరి సీతారామరాజు, డొక్కా సీతమ్మ, కందుకూరి, మధునాపంతుల, శ్రీపాద, బోయి భీమన్న వంటి మహనీయులు తెలుగుజాతిలో చిరస్మరణీయులని డా.హరిబాబు పేర్కొన్నారు. శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు ఎన్నో నదులు తెలుగు నేలపైనే ప్రవహిస్తున్నాయని వివరించారు. ఇందులో కాటన్ మహాశయుని కారణంగా గోదావరి నది జలాలు సస్య శ్యామలం చేస్తున్నాయన్నారు. ప్రస్తుతం కొన్ని పరిస్థితులు చూస్తే తెలుగు బలహీన పడుతోందన్న భయం, మన పిల్లలు తెలుగు నేర్చుకోవడం లేదన్న ఆందోళన వ్యక్తమవుతున్నాయని డా. హరిబాబు పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z