Business

ఫార్మా కంపెనీలకు కొత్త రూల్స్-వాణిజ్య వార్తలు

ఫార్మా కంపెనీలకు కొత్త రూల్స్-వాణిజ్య వార్తలు

* ఏథర్‌ నుంచి మరో కొత్త స్కూటర్‌

ప్రముఖ విద్యుత్‌ వాహనాల తయారీ సంస్థ ఏథర్‌ (Ather) నుంచి మరో కొత్త స్కూటర్‌ విడుదలైంది. ఎప్పటి నుంచో టీజర్లతో ఊరిస్తూ వస్తున్న ఏథర్‌ 450 అపెక్స్‌ (Ather 450 Apex)ను ఆ సంస్థ శనివారం లాంచ్‌ చేసింది. దీని ధర రూ.1.89 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌) కంపెనీ నిర్ణయించింది. ఏథర్‌ ప్రస్తుతం 450 ఎస్‌, 450 ఎక్స్‌ పేరిట రెండు మోడళ్లను విక్రయిస్తోంది. వాటితో పోలిస్తే కొత్త స్కూటర్‌లో అదనంగా ఏమేం తీసుకొచ్చారు? కొత్త స్కూటర్‌ విశేషాలు ఇప్పుడు చూద్దాం..ఏథర్‌ కొత్త స్కూటర్‌లో 3.7kWh బ్యాటరీ ఇచ్చారు. ఇది సింగిల్‌ ఛార్జితో 157 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది. ఇందులో మొత్తం ఐదు రైడింగ్‌ మోడ్‌లు ఇచ్చారు. వ్రాప్‌ మోడ్‌ స్థానంలో కొత్తగా వ్రాప్‌ ప్లస్‌ను పరిచయం చేశారు. అలాగే మ్యాజిక్‌ ట్విస్ట్‌ అనే ఫీచర్‌ను తీసుకొచ్చారు. సాధారణంగా బ్రేక్‌ వేసేటప్పుడు థ్రోటల్‌ రిలీజ్‌ చేస్తూ.. బ్రేక్‌ అప్లయ్‌ చేస్తుంటాం. ఈ కొత్త ఫీచర్‌లో థ్రోటల్‌ రిలీజ్‌ చేసిన ప్రతిసారీ బ్రేక్‌ వేయాల్సిన అవసరం ఉండదు. ఆటోమేటిక్‌గా బ్రేక్‌ అప్లయ్‌ అవుతుంది.ఈ స్కూటర్‌ 2.09 సెకన్లలోనే 0-40 kmph వేగాన్ని అందుకుంటుంది. గరిష్ఠంగా 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఏథర్‌ 450 అపెక్స్‌ను ఇడియమ్‌ బ్లూ రంగులో తీసుకొచ్చారు. ఇది ఐదేళ్లు/ 60వేల కిలోమీటర్ల బ్యాటరీ వారెంటీతో వస్తోంది. 450ఎక్స్‌తో పోలిస్తే హార్డ్‌వేర్‌ పరంగా ఇతర మార్పులేవీ చేయలేదు. ఈ స్కూటర్‌ బుకింగ్స్‌ గత నెల నుంచే ప్రారంభమయ్యాయి. రూ.2500 చెల్లించి స్కూటర్‌ను బుక్‌ చేసుకోవచ్చు. మార్చి నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

* టాటా ‘పంచ్‌ ఈవీ’ బుకింగ్స్‌

దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ తయారీ కంపెనీ టాటా మోటార్స్, తన ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగంలో మొట్టమొదటి సరికొత్త ‘పంచ్.ఈవీ’ కారును మార్కెట్లోకి తీసుకురాబోతుంది. ఇది మొత్తం కూడా ఎలక్ట్రికల్ వేరియంట్‌లో వస్తుంది. దీనికి సంబంధించిన ముందస్తు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కస్టమర్లు కంపెనీ డీలర్‌షిప్‌లు, స్టోర్ల వద్ద రూ.21,000 చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుకింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది. టాటా పంచ్ EV ధర అంచనాల ప్రకారం, రూ.12 లక్షల నుంచి ఉండేఇది సన్‌రూఫ్, నాన్-సన్‌రూఫ్‌లలో లభిస్తుంది. ఫాస్ట్ చార్జింగ్ కోసం 7.2kW హోమ్ చార్జర్, 3.3 kW వాల్‌బాక్స్ చార్జర్‌ను అందిస్తున్నారు. కారు లోపల డిజైన్ కొత్తగా ఉంటుంది. ముందు LED హెడ్‌ల్యాంప్‌లు, 17.78 సెం.మీ హర్మాన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ చార్జర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఆటోహోల్డ్‌ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 360-డిగ్రీల సరౌండ్-వ్యూ సిస్టమ్, ప్రయాణికుల భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు వంటి వాటిని ఈ కారులో అందించారు. అవకాశం ఉంది.

* ఫార్మా కంపెనీలకు కొత్త రూల్స్!

దేశీయ ఫార్మా కంపెనీలు నూతన సంవత్సరంలో కొత్త తయారీ ప్రమాణాలకు అనుగుణంగా తమ ఔషధాలను ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికి సంబంధించి శనివారం నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. గతంలో ఔషధాల నాణ్యత, భద్రతపై ఆందోళనలు వచ్చాయి. ముఖ్యంగా దేశీయ ఫార్మా కంపెనీలు విదేశాలకు ఎగుమతి చేసే ఔషధాల వలన అక్కడ మరణాలు సంభవించాయని వార్తలు రావడంతో ఇది భారత ఔషధ పరిశ్రమ ప్రతిష్టకు హాని కలిగిస్తుందని భావించి ఔషధాల తయారీలో నాణ్యత, శుద్ధి ఉండాలని కేంద్రం కొత్త నియమాలను తీసుకొచ్చింది.ఔషధాల ఉత్పత్తుల నాణ్యతకు ఆయా తయారీ సంస్థలే బాధ్యత వహించాలి. పరీక్షల సమయంలో ఔషధాలను పూర్తిగా టెస్టింగ్ చేసి అవి “సంతృప్తికరమైన ఫలితాలు” పొందిన తర్వాత మాత్రమే వాటిని ఉత్పత్తి చేసి మార్కెట్లోకి విడుదల చేయాలని ప్రభుత్వం పేర్కొంది. నాణ్యత లేని వాటి వలన రోగులను మరింత ప్రమాదంలోకి నెట్టివేసినట్లవుతుంది. కాబట్టి నాణ్యత ప్రమాణాలను పాటించాలని పేర్కొంది.గతంలో భారత్‌లోని 8,500 చిన్న ఫార్మా కంపెనీల్లో నాలుగింట ఒక వంతు కంటే తక్కువ మాత్రమే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన అంతర్జాతీయ ఔషధ తయారీ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుతం భారత ఔషధ పరిశ్రమ దాదాపు $ 50 బిలియన్ల మార్కెట్‌ను కలిగి ఉంది.

* ఎర్ర సముద్రంలో దాడులు

ఎర్ర సముద్రంలో జరుగుతున్న వరుస దాడులు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. యెమెన్‌కు చెందిన హౌతీలు జరుపుతున్న దాడులు నౌకా రవాణాను దెబ్బతీస్తున్నాయి. దీంతో భారత వాణిజ్యంపైనా ప్రభావం పడుతోంది. ఎర్ర సముద్రంలో నెలకొన్న అలజడి మూలంగా సరకు రవాణా వ్యయం, ఇన్సురెన్స్‌ ప్రీమియం పెరగనుందని ఆర్థిక మేధోసంస్థ గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చి ఇనిషియేటివ్‌ (GTRI) పేర్కొంది. సరకు రవాణా కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలిపింది.మధ్యధరా సముద్రానికి, హిందూ మహాసముద్రానికి మధ్యనున్న ఎర్ర సముద్రంలో బాబ్‌ ఎల్‌ మాందెబ్‌ జలసంధి గుండా సరకు రవాణా నౌకలు ప్రయాణం చేస్తుంటాయి. ఈ జల సంధి వద్దే హౌతీలు దాడులు జరుపుతున్నారు. దీంతో ప్రస్తుతం నౌకలు కేప్‌ ఆఫ్‌ గుడ్‌ హోప్‌ గుండా ప్రయాణం చేయాల్సి వస్తోంది. దీంతో సరకు రవాణా 20 రోజులు ఆలస్యం అవుతోంది. హౌతీల దాడులతో భారత వాణిజ్యంపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. మధ్యప్రాశ్చం, ఆఫ్రికా, యూరప్‌ దేశాలతో మన దేశ వాణిజ్యం ప్రధానంగా ఈ మార్గం గుండానే జరుగుతోంది.మన దేశానికి వచ్చే క్రూడాయిల్‌, ఎల్‌ఎన్‌జీ దిగుమతుల కోసం భారత్‌ బాబ్‌ ఎల్‌ మాందెబ్‌ జలసంధిపైనే ఆధారపడుతోంది. యూరప్‌, ఆఫ్రికాతో జరిగే వాణిజ్యంలో 50 శాతం దిగుమతులు, 60 శాతం ఎగుమతుల కోసం ఈ మార్గమే ఆధారం. మొత్తం 113 బిలియన్‌ డాలర్ల వర్తకం జరుగుతోంది. హౌతీల దాడుల కారణంగా కేప్‌ ఆఫ్‌ గుడ్‌ హోప్‌ వంటి ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూడాల్సిన అవసరం ఏర్పడిందని జీటీఆర్‌ పేర్కొంది. అంతేకాకుండా క్రూడాయిల్‌, ఎల్‌ఎన్‌జీ కోసం ఇతర దేశాలను ఆశ్రయించడంతోపాటు, దాడుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలనూ భారత్‌ పరిశీలించే అవకాశం ఉందని వెల్లడించింది.‘‘ఎర్ర సముద్రంలో దాడుల కారణంగా షిప్పింగ్‌ కాస్ట్‌ 40-60 శాతం మేర పెరిగే అవకాశం ఉంది. ఇతర మార్గాల ద్వారా ప్రయాణం వల్ల సరకు రవాణా 20 రోజుల మేర ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఇన్సురెన్స్‌ ప్రీమియం సైతం 15-20 శాతం మేర పెరిగే అవకాశం ఉంది’’ అని జీటీఆర్‌ఐ పేర్కొంది. బాబ్ ఎల్‌ మాందెబ్‌ జలసంధిలో షిప్పింగ్ అంతరాయాలను భారతదేశం చాలా కాలం పాటు ఎదుర్కోవాల్సి ఉంటుందని, స్వప్రయోజనాలను కాపాడుకోవడానికి భారత్‌ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని జీటీఆర్‌ఐ సహ వ్యవస్థాపకుడు అజయ్‌ శ్రీవాస్తవ అన్నారు. దక్షిణాఫ్రికా, అమెరికా వంటి దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకోవడం, దాడులకు ఆస్కారం లేని మార్గాలను అనుసరించడం, వాణిజ్యంపై ప్రభావం పడిన కంపెనీలను ఆర్థికంగా ఆదుకోవడం వంటి చర్యలను ప్రభుత్వం చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

* ఎల్‌ఐసీపై మళ్లీ జీఎస్టీ దాడి

గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC)కి GST నుండి మరో నోటీసు అందింది. ఎల్‌ఐసికి అందిన ఈ నోటీసు డిమాండ్ నోటీసు, ఇందులో జిఎస్‌టి శాఖ రూ.663 కోట్ల డిమాండ్ చేసింది. గత వారంలో ఎల్‌ఐసీకి ఇది రెండో జీఎస్టీ నోటీసు.చెన్నై కమిషనరేట్ నోటీసు…LICకి CGST, సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం నుండి చెన్నై నార్త్ కమిషనరేట్ నుండి ఈ నోటీసు అందింది. జనవరి 1న ఎల్‌ఐసీకి ఈ నోటీసు వచ్చింది. ఆ తర్వాత కంపెనీ కూడా జనవరి 3న నోటీసును స్టాక్ మార్కెట్లకు తెలియజేసింది. వస్తువులు, సేవల పన్ను చెల్లింపులో లోటు కారణంగా దాదాపు రూ.663.45 కోట్ల డిమాండ్ నోటీసును ఎల్‌ఐసి అందుకుంది. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను కంపెనీ తప్పుగా ఉపయోగించుకుందని డిమాండ్ నోటీసులో పేర్కొంది. అంతే కాకుండా, 2017-18, 2018-19లో GSTR-1లో టర్నోవర్‌ని GST యేతర సరఫరాగా కంపెనీ ప్రకటించింది, అయితే దానిపై పన్ను చెల్లించాలి. నోటీసులో, నిర్ణీత గడువులోగా అప్పీల్ దాఖలు చేయడానికి ఎల్‌ఐసికి అవకాశం ఇవ్వబడింది. నోటీసుపై కంపెనీ అప్పీల్ కమిషనర్, చెన్నైకి అప్పీల్ చేయవచ్చు.మహారాష్ట్ర జీఎస్టీ నోటీసు..మహారాష్ట్ర జీఎస్టీ నుంచి రూ.800 కోట్లకు పైగా జీఎస్టీ నోటీసును కూడా ఎల్ఐసీ అందుకుంది. 2017-18కి సంబంధించిన కొన్ని లోటుపాట్లకు సంబంధించి మహారాష్ట్ర రాష్ట్ర పన్నుల డిప్యూటీ కమిషనర్ రూ. 806.3 కోట్ల నోటీసును ఎల్‌ఐసీకి పంపారు. ఈ నోటీసులో రూ. 365.02 కోట్ల జీఎస్టీ బకాయిలు, రూ. 404.7 కోట్ల పెనాల్టీ, రూ. 36.5 కోట్ల వడ్డీ ఉన్నాయి.మూడు నెలల్లో చాలా నోటీసులు…ఎల్‌ఐసీకి ఇంతకుముందు కూడా జీఎస్టీ నుంచి నోటీసులు అందాయి. డిసెంబర్ నెలలో తెలంగాణ జీఎస్టీ రూ.183 కోట్ల నోటీసును ఎల్ఐసీకి అందజేసింది. సెప్టెంబరు 22న ఎల్‌ఐసీకి బీహార్ జీఎస్టీ నుంచి నోటీసు వచ్చింది. ఆ నోటీసు రూ.290 కోట్లకు పైగా ఉంది. అంతకు ముందు, 2023 అక్టోబర్‌లో తక్కువ పన్ను చెల్లించినందుకు ఎల్‌ఐసికి జిఎస్‌టి అధికారులు రూ.36,844 జరిమానా విధించారు. అక్టోబర్‌లోనే జమ్మూ కాశ్మీర్ జీఎస్టీపై ఎల్‌ఐసీకి నోటీసులిచ్చింది.