కాంగ్రెసు పార్టీకి ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొండా దంపతులు కాంగ్రెసు పార్టీని వీడి బిజెపిలో చేరడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో పరకాల నుంచి కాంగ్రెసు తరఫున పోటీ చేసిన కొండా సురేఖ చల్లా ధర్మారెడ్డిపై ఓటమి పాలయ్యారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని వీడి కాంగ్రెసులో చేరిన కొండా దంపతులకు ఎన్నికల్ల చుక్కెదురైంది. కాంగ్రెసులో చేరే సమయంలో కొండా సురేఖ భర్త కొండా మురళి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. బిజెపిలో చేరడానికి కొండా సురేఖ షరతు పెడుతున్నట్లు తెలుస్తోంది. తన కూతురు సుస్మితా పటేల్ కు భూపాలపల్లి శాసనసభ స్థానం కేటాయించాలని ఆమె కోరుతున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లోనే సుస్మితా పటేల్ ను భూపాలపల్లి నుంచి బరిలోకి దింపాలని కొండా దంపతులు భావించారు. తమ కుటుంబానికి మూడు సీట్లు కావాలని కొండా సురేఖ కోరారని, అందుకు టీఆర్ఎస్ నాయకత్వం అంగీకరించలేదని, అందువల్లనే పార్టీని వీడారని అంటారు. అయితే, కాంగ్రెసులో చేరినప్పటికీ కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ కు శాసనసభ టికెట్ లభించలేదు. సుస్మితా పటేల్ భూపాలపల్లిలో చురుగ్గా వ్యవహరిస్తూ వస్తున్నారు. అయితే, గత ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన గండ్ర సత్యనారాయణ కూడా బిజెపిలో చేరడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. తొలుత టీడీపిలో ఉన్న గండ్ర సత్యనారాయణ 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. భూపాలపల్లి టికెట్ ను అటు కొండా సురేఖతో పాటు గండ్ర సత్యనారాయణ కూడా అడుగుతుండడంతో బిజెపి నాయకత్వం సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది.
కొండా దంపతులకు భాజపాలో ప్రాముఖ్యత ఉంటుందా?
Related tags :