తెలంగాణను కొల్లగొట్టినవాళ్లే తమను 420 అనడం వింతగా ఉందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పదేండ్లలో రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ప్రజలపై అప్పుల భారాన్ని మోపినోళ్లు నెలరోజులు కూడా కాని తమ పాలనపై విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. శనివారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మార్నింగ్ వాక్ చేస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజాపాలనలో ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకొని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పదేండ్లలో రాష్ట్రాన్ని దోచుకొని నాశనం చేసిన వాళ్లపై 379, 382, 384, 392 సెక్షన్లతోపాటు రాబరీ కేసు పెట్టి విచారణ జరపాల్సి ఉంటుందన్నారు. పదేండ్ల విధ్వంసాన్ని పూడ్చాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. బీఆర్ఎస్ పాలనలో దోపిడీ చేయడమే కాకుండా ప్రజలను హింసించారని చెప్పారు. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులను పోలీసులతో తీవ్రంగా కొట్టించారన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం వారిని అన్నివిధాలా ఆదుకుంటూనే ప్రాజెక్టును పూర్తిచేసి రైతులకు నీళ్లిస్తుందన్నారు. గత పాలకులు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ నే నిర్మించలేదని, అయినా నీళ్లు తెచ్చామని నమ్మించే ప్రయత్నం చేశారన్నారు. ఇంకా 2000 ఎకరాల భూమి సేకరించి కాలువలు నిర్మిస్తామన్నారు. దేవాదుల, శ్రీరామ్ సాగర్, వరద కాలువ ఫేజ్2 ద్వారా నీళ్లు వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. త్వరలోనే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ప్రశ్నించే గొంతుకలను అణచివేసి, ప్రజలను నిర్బంధించి గత పాలకులు అనేక అరాచకాలకు పాల్పడ్డారని మంత్రి విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే పనిలోపడ్డామన్నారు. బీఆర్ఎస్ పాలకులు మూసేసిన ధర్నాచౌక్‌ను తిరిగి తెరిచామన్నారు.
నాలుగు నెలలకోసారి ప్రజాపాలన
ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసినా ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని పొన్నం అన్నారు. అర్హులైన వారందరికీ ఆరు గ్యారంటీలను అందిస్తామన్నారు. దీనిపై ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. ఆరునూరైనా ఆరు గ్యారంటీలను అమలుచేస్తామన్నారు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్రజాపాలన నిర్వహిస్తామని, ప్రజలు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. హమాలీలు, ఇతర అసంఘటిత రంగాల కార్మికులను తమ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని మంత్రి పొన్నం చెప్పారు. హమాలీలకు హెల్త్ ప్రొఫైల్ టెస్ట్ చేయించి అవసరమైన వైద్య సేవలు అందిస్తామన్నారు. హైదరాబాద్‌లోని నిమ్స్, ఎంఎన్‌జే తదితర ఆస్పత్రుల్లో హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక వైద్యసేవలను అందిస్తామన్నారు. హుస్నాబాద్ నుంచి ఏ ప్రాంతానికైనా బస్ సౌకర్యం అవసరమైతే ఏర్పాటు చేస్తామన్నారు. హుస్నాబాద్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు రిపేర్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత, వైస్‌చైర్‌పర్సన్ అయిలేని అనిత, ఆర్డీవో బెన్శాలోమ్, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్, ఏసీపీ సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –