జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్, సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా, వయాకామ్ 18 వంటి బ్రాడ్‌కాస్టర్లు తమ శాటిలైట్ చానెళ్ల బొకేల ధరలను పెంచుతున్నాయి. దీంతో కస్టమర్ల నెలవారీ టీవీ బిల్లు పెరగనుంది. ఒక బ్రాడ్‌కాస్టర్ అందించే మొత్తం చానెల్స్‌ను కలిపి బొకే అంటారు. పెరుగుతున్న కంటెంట్ ఖర్చులను భర్తీ చేయడానికి ధరలను పెంచుతున్నామని సంస్థలు అంటున్నాయి. నెట్వర్క్18, వయాకామ్18 డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఇండియాకాట్ తమ పోర్ట్‌ఫోలియోకు స్పోర్ట్స్ చానెల్స్‌ను చేర్చాక బొకేల ధరను 20-–25శాతం పెంచింది.
జీ తన బొకేల ధరలను 9–-10శాతం పైగా పెంచింది. సోనీ బొకే ధరలు 10–-11శాతం పెరిగాయి. డిస్నీ స్టార్ తన కొత్త బొకే ధరను ఇంకా ప్రకటించలేదు. వచ్చే నెల నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని బ్రాడ్‌కాస్టర్లు చెబుతున్నారు. అయితే, 2024 ఎన్నికల సంవత్సరం కావడంతో, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) బ్రాడ్‌కాస్టర్ రేట్ కార్డ్‌లను జాగ్రత్తగా గమనిస్తోంది. బ్రాడ్కాస్టర్ల కొత్త రేట్లు కొత్త టారిఫ్ ఆర్డర్ (ఎన్టీఓ) 3.0కి అనుగుణంగా ఉన్నాయో లేదో ట్రాయ్పరిశీలిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
బ్రాడ్‌కాస్టర్లు తమ ఛానెల్స్ కోసం అలా కార్టే (ఒక్కో చానెల్‌ను విడిగా కొనుక్కోవడం), బొకే ధరలు రెండింటినీ ప్రకటించాల్సి ఉంటుంది. చాలా మంది కస్టమర్లు ఖర్చు తక్కువ కాబట్టి బొకేలను ఇష్టపడతారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) డిజిటల్ హక్కులు, బీసీసీఐ మీడియా హక్కులు, సౌత్ ఆఫ్రికా క్రికెట్ మీడియా హక్కులు, ఒలింపిక్స్ 2024 వంటి క్రీడా హక్కుల కోసం వయాకామ్ 18 రూ. 34 వేల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టడం వల్ల బొకే ధరలను భారీగా పెంచింది. డిస్నీ స్టార్ ఐసీసీ మీడియా హక్కులను మూడు బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. డిజిటల్ హక్కులను నిలుపుకుంటూ జీకి టీవీ హక్కులను సబ్‌లైసెన్స్ చేసింది. వినియోగదారులపై భారాన్ని తగ్గించేందుకు బ్రాడ్‌కాస్టర్లు టీవీ పంపిణీ ప్లాట్‌ఫారమ్‌లు త్వరలో చర్చలు జరపనున్నాయి. పెరుగుదల సింగిల్ డిజిట్‌లో ఉంటుందని ఎక్స్పర్టులు చెబుతున్నారు.
పెరుగుతున్న కస్టమర్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–-జూన్ క్వార్టర్లో నలుగురు డీటీహెచ్సర్వీస్ ప్రొవైడర్లు తమ కస్టమర్ బేస్‌ను 2.50 లక్షలు పెంచుకున్నారు. కేబుల్ టీవీ ప్లాట్‌ఫారమ్‌లకు నెలకు రెండు శాతం వరకు కస్టమర్లు పెరుగుతున్నారు. బొకే పరిమాణాన్ని తగ్గించడం ద్వారా కస్టమర్‌పై భారం పడకుండా చూస్తున్నామని కేబుల్ టీవీ కంపెనీకి చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
బ్రాడ్‌కాస్టర్లకు రాబడి పెరగకపోవడంతో ధరలను పెంచారు. ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయాన్ని పెంచడం ద్వారా సబ్‌స్క్రిప్షన్ ఆదాయాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఉందని సీనియర్ టీవీ ఎగ్జిక్యూటివ్ ఒకరు అన్నారు. 2023 ఆర్థిక సంవత్సరంలో, డిస్నీ స్టార్ స్టాండెలోన్ సబ్‌స్క్రిప్షన్ ఆదాయం రూ. 4,949 కోట్లు ఉంది. నెట్వర్క్18/వయాకామ్18 సబ్‌స్క్రిప్షన్ రాబడి రూ. 1,925 కోట్లు ఉంది. సోనీ, జీ వరుసగా రూ. 3134 కోట్లు, రూ. 2,818 కోట్ల సబ్‌స్క్రిప్షన్ ఆదాయాలను సాధించాయి.
👉 – Please join our whatsapp channel here –