DailyDose

సంగారెడ్డి జిల్లాలో విషాదం-నేర వార్తలు

సంగారెడ్డి జిల్లాలో విషాదం-నేర వార్తలు

* పెళ్లయిన తర్వాతి నుంచి కట్నం కోసం వేధింపులు

పెళ్లికి ముందు కట్నకానుకలు వద్దన్న వ్యక్తి పెళ్లయ్యాక మాత్రం రూ.15 లక్షలు ఇస్తేనే శోభనానికి అంగీకరిస్తానని చెప్పడంతో అవాక్కవడం అమ్మాయి తరపు బంధువుల వంతైంది. ఇందుకు సంబంధించి బెంగళూరులోని బసవనగుడి మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.బాధితురాలి కథనం ప్రకారం.. ఇంజినీర్ అయిన అవినాశ్‌వర్మతో 6 జూన్ 2022లో యువతి(27)కి వివాహం జరిగింది. వివాహ సమయంలో కట్నకానులు ఇతర లాంఛనాలు వద్దని చెప్పడంతో అల్లుడు ఎంత మంచివాడో అని అమ్మాయి తరపు బంధువులు మురిసిపోయారు. అయితే, వివాహం తర్వాత మాత్రం అవినాశ్‌వర్మలోని అసలు మనిషి బయటకు వచ్చాడు.కట్నం కోసం వేధింపులు మొదలుపెట్టాడు. అతడి వేధింపులు తట్టుకోలేని అమ్మాయి తల్లిదండ్రులు రూ. 5.8 లక్షలు సమర్పించుకున్నారు. అయినప్పటికీ సంతృప్తి చెందని అవినాశ్ తాను అడిగిన రూ. 15 లక్షల్లో మిగతా సొమ్ము ఇస్తేనే శోభనానికి అంగీకరిస్తానని చెప్పాడు. ఇవ్వకుంటే ఇంటి నుంచి వెళ్లిపోవాలని శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు. అతడి వేధింపులు రోజురోజుకు మరింత పెరగడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

* సంగారెడ్డి జిల్లాలో విషాదం

జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఫ్యాన్‌కు ఉరేసుకొని ఇంటర్‌ విద్యార్థిని(Inter student) బలవన్మరణానికి (Suicide) పాల్పడింది. ఈ విషాదకర సంఘటన జహీరాబాద్ మండలం రంజోల్(Ranjol) బాలికల గురుకుల పాఠశాలలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.గురుకుల పాఠశాలలో ఇంటర్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న స్వప్న (17) డార్మెంటరీ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. గమనించిన విద్యార్థులు, సిబ్బంది స్వప్నను చికిత్స కోసం జహీరాబాద్ సర్కార్ తవఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి స్వగ్రామం జహీరాబాద్ మండలంలోని తూముకుంటగా గుర్తించారు.

* భర్త గొడ్డలితో భార్యను దారుణంగా హత్య

వివాహేతర సంబంధం గురించి అడిగినందుకు దారుణహత్య చేశాడు. రఘునాథపాలెం మండలం శివాయి గూడెం గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రమానికి చెందిన మూడు వీరన్న (37) ఇదే గ్రామానికి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించడం.పై భార్య విజయలక్ష్మి (30) ప్రశ్నించడంతో దంపతుల మధ్య వివాదం జరిగింది. ఇదే విషయంలో పలుమార్లు గొడవలు అయ్యాయి. వీరికి పోలీసులు సైతం కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. అయినా భర్త మూడు వీరన్న లో ఏ మార్పు రాలేదు. దాంతో ఆదివారం ఉదయం మరోసారి దంపతుల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఆగ్రహించిన భర్త గొడ్డలితో భార్యను దారుణంగా హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

* సాహితీ ఇన్ఫ్రాటెక్‌పై 50 కేసులు

ప్రీలాంచ్‌ పేరుతో భారీ మోసానికి పాల్పడ్డ సాహితీ ఇన్ఫ్రాటెక్‌ వెంచర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌పై సీసీఎస్‌ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటి వరకు సంస్థ ఎండీ లక్ష్మీనారాయణ సహా 22 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 2019-2022 మధ్యలో పలు ప్రాజెక్టుల పేరుతో కస్టమర్ల నుంచి రూ. 504 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించారు. నానక్‌రాంగూడలో సాహితీ స్వధ కమర్షియల్‌ పేరుతో 69 మంది నుంచి రూ.65 కోట్లు, మేడ్చల్‌ – కొంపల్లి షిస్టా అబోద్‌ పేరుతో 248 మంది వద్ద రూ.79 కోట్లు, కొంపల్లిలో సాహితీ గ్రీన్‌ పేరుతో 153 మంది బాధితుల నుంచి రూ.40 కోట్లు, గచ్చిబౌలిలో సాహితీ సితార కమర్షియల్‌ పేరుతో 269 మంది వద్ద రూ.135 కోట్లు, బంజారాహిల్స్‌లో సాహితీ మహెటో సెంట్రో పేరుతో 44 మంది నుంచి రూ.22 కోట్లు, నిజాంపేటలో ఆనంద్‌ ఫార్చూన్‌ పేరుతో రూ.40.50 కోట్లు, మోకిలాలో సాహితీ సుదీక్ష పేరుతో రూ. 22 కోట్లు, బాచుపల్లిలో రూబీకాన్‌ పేరుతో 43 మంది నుంచి రూ. 6.9 కోట్లు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. వీటితోపాటు ఇప్పటి వరకు కస్టమర్ల నుంచి సాహితీ ఇన్‌ఫ్రా మొత్తం రూ.1,164 కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంస్థపై మొత్తం 50 కేసులు నమోదయ్యాయని చెప్పారు.

* లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల వద్ద తెలంగాణ ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టిన ఘటనలో డ్రైవర్ సహా మరొకరు మృతి చెందారు. టీఎస్ ఆర్టీసీ బస్సు మిర్యాలగూడ నుంచి తిరుపతికి వెళ్తుండగా మోచర్ల వద్ద లారీని బస్సు వెనకనుంచి బలంగా ఢీకొట్టింది.ఈ ఘటనలో బస్సు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. దీంతో డ్రైవర్ వినోద్ (45) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో ఏడుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం నెల్లూరు తరలించారు. వీరిలో 65 ఏళ్ల వృద్ధురాలు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

* కూరగాయల ట్రేల మధ్య గంజాయి రవాణా

కూరగాయల ట్రేల మధ్య గంజాయి రవాణా చేస్తూ నిందితులు పట్టబడ్డారు. ఐచర్ వ్యాన్ లో కూరగాయల ట్రే ల మధ్యలో చింతూరు నుండి ఔరంగాబాద్ తరలిస్తున్న గంజాయిని భద్రాచలంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న వ్యక్తి వద్ద నుండి 114 కేజీల గంజాయుతో పాటు 12 వేల రూపాయలు, ఒక ఫోను, వాహనాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.28.50 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.

* దళిత యువకుడు ముస్లిం యువతిపై దాడి

పబ్లిక్‌ ప్లేస్‌లో కలిసి కూర్చొన్నందుకు దళిత యువకుడు, ముస్లిం యువతిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. (Dalit boy, Muslim woman thrashed) అంతేగాక వారిని ఒక గదిలో నిర్బంధించి ప్లాస్టిక్‌ పైపులు, ఇనుప రాడ్లతో కొట్టారు. మొబైల్స్‌ ఫోన్స్‌తోపాటు వారి వద్ద ఉన్న డబ్బులు తీసుకున్నారు. కర్ణాటకలోని బెళగావిలో ఈ సంఘటన జరిగింది. 18 ఏళ్ల దళిత యువకుడు సచిన్ లమాని, 22 ఏళ్ల ముస్లిం యువతి ముస్కాన్ పటేల్ శనివారం సీఎం యువ నిధి పథకానికి దరఖాస్తు చేసేందుకు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లారు. భోజన విరామ సమయం కావడంతో ఆ తర్వాత రావాలని అక్కడి సిబ్బంది తెలిపారు. దీంతో వారిద్దరూ బెళగావిలోని కిల్లా సరస్సు వద్దకు చేరుకుని అక్కడ కూర్చొన్నారు.కాగా, కొందరు ఆకతాయిలు సచిన్‌, ముస్కాన్‌ వద్దకు వచ్చారు. ఆ మహిళ తన బంధువని సచిన్‌ చెప్పగా ఇద్దరి పేర్లు అడిగారు. ముస్లిం మహిళతో కలిసి ఉన్న అతడ్ని కొట్టారు. ఆమెతో కలిసి ఎందుకు ఉన్నావంటూ సచిన్‌ను ప్రశ్నించి వేధించారు. ఇంతలో మరో 13 మంది అక్కడకు చేరుకున్నారు. వారిద్దరిని ఒక చొటకు తీసుకెళ్లి గదిలో నిర్బంధించారు. తిట్టడంతోపాటు ప్లాస్టిక్‌ పైపులు, ఐరన్‌ రాడ్లతో సచిన్‌ను కొట్టారు. అతడి గొంతు నొక్కారు. ముస్కాన్‌పై కూడా దాడి చేశారు. బలవంతంగా మొబైల్‌ ఫోన్స్‌, వారి వద్ద ఉన్న రూ.7,000 నగదు లాక్కున్నారు. శనివారం సాయంత్రం వరకు వారిద్దరిని వేధించారు. ఆ తర్వాత బెదిరించి వారిని విడిచిపెట్టారు.మరోవైపు ఈ సంఘటన తర్వాత సచిన్‌, ముస్కాన్‌ స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. ఆగంతకులు తమను కొట్టి హింసించడంపై ఫిర్యాదు చేశారు. తమ మొబైల్స్‌తోపాటు డబ్బులు దోచుకున్నారని ఆరోపించారు. దీంతో ఎస్సీ, ఎస్టీ చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి 9 మంది నిందితులను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

* మిస్సయిన 26 మంది అమ్మాయిల గుర్తింపు

భోపాల్‌ శివారులోని పర్వాలియాలోని ఆంచల్ గర్ల్స్ హాస్టల్‌ నుంచి కనిపించకుండా పోయిన 26 మంది బాలికలను శనివారం పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు (సీడీపీవో) అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మరో ఇద్దరు అధికారులకు నోటీసులు జారీ అయ్యాయి. మిస్సయిన 10 మంది అమ్మాయిలను అదమ్‌పూర్ చావ్ని ప్రాంతంలో గుర్తించగా, 13 మందిని ముురికివాడల్లో, ఇద్దరిని టాప్ నగర్‌లో, ఒకరిని రాయ్‌సెన్‌లో గుర్తించారు. చిల్డ్రన్ హోం నుంచి బాలికలు మిస్సయిన విషయం నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎస్‌సీపీసీఆర్) చైర్మన్ ప్రియాంక కనుంగో ఆకస్మిక సందర్శనతో బయటపడింది. 68 మంది బాలికలు ఉండాల్సిన చోట 26 మంది అమ్మాయిలు కనిపించకుండా పోవడాన్ని గుర్తించారు. వీరందరూ గుజరాత్, ఝార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌కు చెందినవారే. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఇద్దరు సీడీపీవో అధికారులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. మరో ఇద్దరు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z