అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ సంబరాలు ప్రఖ్యాత ‘బనారసీ చీరలు’ నేసే చేనేత కార్మికులకు చేతి నిండా ఉపాధి చూపుతున్నాయి. చీరల కొంగులపై (పల్లూ) రామమందిర చిత్రాలు ఉండాలని, శ్రీరాముడి బాల్యం నుంచి రావణసంహారం దాకా రామచరితలోని వివిధ ఘట్టాలను చిత్రించాలని, చీరల అంచులపై ‘శ్రీరామ’ నామాలు ఉండాలని కార్మికులకు ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ చీరల ధరలు రూ.7 వేల నుంచి రూ.లక్ష దాకా ఉన్నాయి. వారణాసిలోని ముబారక్పుర్ ప్రాంతానికి చెందిన చేనేత కార్మికుడు అనిసుర్ రెహమాన్ మాట్లాడుతూ.. ‘‘దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మాకు ఆర్డర్లు వస్తున్నాయి. జనవరి 22న ఈ చీరలు ధరించి తమ తమ ప్రాంతాల్లో వేడుకలు చేసుకోవాలని మహిళలు ఉత్సాహంగా ఉన్నారు’’ అని తెలిపారు. పల్లూపై ‘రామ్దర్బార్’ చిత్రం ఉండాలంటూ అమెరికా నుంచి తమకు రెండు ఆర్డర్లు వచ్చినట్లు మరో కార్మికుడు మదన్ తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –