లోక్‌సభ ఎన్నికల్లో సోనియాగాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయమైనట్టేనని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సోనియా ఇక్కడి నుంచి పోటీ చేయాలంటూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చేసిన తీర్మానాని కి కాంగ్రెస్ పెద్దలంతా సానుకూలంగానే స్పం దించినట్టు సమాచారం. సోనియా తెలంగాణ నుంచి పోటీ చేయాలన్న ప్రతిపాదన ఇక్కడి నుంచి వెళ్లింది కాదని, ఢిల్లీ సూచన మేరకే తీర్మానం చేశారని చెప్తున్నారు. ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ.. స్థానాల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేయాలని పీసీసీ కోరగా, ఖమ్మం నుంచి పోటీకి కాంగ్రెస్ పెద్దలు సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం.
తెలంగాణ నుంచే ఎందుకు?
సోనియా పోటీ చేయడానికి దేశంలోనే తెలంగాణ సురక్షితమని, అందులో ఖమ్మం మరింత సురక్షితమని కాంగ్రెస్ భావిస్తున్నది. గతంలో ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేసి, విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఖమ్మం నుంచి సోనియా పోటీ చేయడంతో తెలంగాణపైనే కాకుండా పొరుగు రాష్ర్టాలు ఏపీ, ఛత్తీస్‌గఢ్, కర్ణాటకపై కూడా ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నా రు. కర్ణాటక, తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండగా, మొన్నటిదాకా ఛత్తీస్‌గఢ్‌లోనూ అధికారంలో ఉండేది. రాహుల్కూడా కేరళ నుంచే లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో సోనియా కూడా దక్షిణాది నుంచే పోటీ చేస్తే పార్టీకి మరింత ఊపు వస్తుందనేది ఆ పార్టీ అంచనాగా చెప్తున్నారు. ఉత్తరాది రాష్ర్టాల్లో బీజేపీ బలంగా ఉండటం, కర్ణాటక, తెలంగాణలో అధికారంలో ఉండటంతో ప్రస్తుత పరిస్థితుల్లో సోనియా పోటీ చేయడానికి తెలంగాణ అత్యంత సురక్షితమని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్టు చెప్తున్నారు.
హైప్ సృష్టించే వ్యూహం?
అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే లోక్‌సభ ఎన్నికల్లోనూ ఎక్కువ సీట్లు గెలుచుకునేందుకు సోనియా ఇక్కడి నుంచి బరిలోకి దించాలన్నది రాష్ట్ర నేతల వ్యూహంగా భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపకపోతే భవిష్యత్‌లో పార్టీ బలహీనపడటమే కాకుండా అధికార పగ్గాలు ఇతరులకు అప్పగించే ప్రమాదం లేకపోలేదు. వీటి నుంచి గట్టెక్కడానికి కూడా సోనియాగాంధీ సెంటిమెంట్‌ను ప్రయోగిస్తున్నారనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. వాస్తవానికి వయసు, ఆరోగ్యం రీత్యా సోనియాగాంధీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేరా? అనే సందేహాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ రాష్ట్రం నుంచి సోనియాగాంధీ పోటీ చేస్తారన్న ప్రచారంతో హైప్ క్రియేట్ చేయడం కాంగ్రెస్ వ్యూహమని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక్కడి నుంచే ఎందుకు?
సోనియా ఖమ్మం ఎంచుకోవడానికి బలమైన కారణాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం లోక్‌సభ స్థానం పరిధిలోని భద్రాచలం మినహా మిగిలిన ఆరు స్థానాలు కాంగ్రెస్ గెలుచుకున్నది. ఇక్కడ కాంగ్రెస్‌తోపాటు కమ్యూనిస్టు పార్టీలకు కూడా పట్టు ఉన్నది. గతంలో ఇక్కడి నుంచి గెలిచిన చరిత్ర బీజేపీకి లేదు. కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమిలో వామపక్షాలు కూడా ఉండటంతో సోనియాగాంధీ గెలుపునకు పెద్దగా ఇబ్బంది ఉండదని కాంగ్రెస్ అంచనా వేస్తున్నది. ఖమ్మం నుం చి సోనియాగాంధీ పోటీ చేయని పక్షంలో పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని కమ్యూనిస్టు పార్టీలు కోరే అవకాశం ఉంటుంది.
ఆ పరిస్థితి తలెత్తకుండా నివారించేందుకు కూడా సోనియాగాంధీని ఇక్కడి నుంచి బరిలోకి దించడం పీసీసీ వ్యూహం కావచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడి నుంచి సోనియాగాంధీ పోటీ చేయని పక్షంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తన సోదరుడికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌లో పొంగులేటిని వ్యతిరేకించే సీనియర్లు కొందరు వ్యూహత్మకంగా సోనియాగాంధీని తెరపైకి తీసుకొచ్చి ఉంటారనే ప్రచారం జరుగుతున్నది. అటు వామపక్షాలకు, ఇటు పొంగులేటి కుటుంబానికి ఖమ్మం సీటు దక్కకుండా అడ్డుకునేందుకు సోనియాగాంధీ అభ్యర్థిత్వాన్ని తెరపైకి తీసుకొచ్చి ఉంటారని భావిస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –