విదేశాల్లో చదువులు.. ఇప్పుడో ట్రెండ్. ఫారిన్ ఎడ్యుకేషన్ అంటేనే విద్యార్థులు ఊహాలోకంలో తేలియాడుతుంటారు. ముందు ఏదో ఓ కోర్సులో చేరాలి. కోర్సు పూర్తికాగానే మంచి ఉద్యోగం కొట్టేయాలి. డాలర్లు పౌండ్లు, యెన్‌లు సంపాదించాలన్న ఆశతో ఉంటారు. గ్లోబల్ ఎడ్యుకేషన్ కాన్‌క్లేవ్ స్టూడెంట్ మొబిలిటీ రిపోర్ట్23 ప్రకారం 1.3 మిలియన్ విద్యార్థులు విదేశాల్లో చదువుతున్నారు. కొత్తగా వెళుతున్నవారు లక్షల్లో ఉంటున్నారు. ఒకప్పుడు పోలోమంటూ అమెరికా బాటపట్టిన వారంతా ఇప్పుడు ఏదేశమైన పర్వాలేదనుకొంటున్నారు. ఈ ప్రయత్నంలో ఏ దేశమెళ్లాలి.. ఏం చదవాలన్న అన్వేషణ అతి ముఖ్యం. ఆయా దేశాల్లో అమల్లో ఉన్న ఇమ్మిగ్రేషన్ నిబంధనలన్నింటిపై అవగాహన కలిగి ఉండటం అత్యవసరం. దీనికితోడు ఇటీవలికాలంలో ఇమ్మిగ్రేషన్, వీసా వంటి అనేక నిబంధనలు మారాయి.
ఆస్ట్రేలియాలో
భారతీయ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఎంపికచేసుకొనే దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2022లో 1.09 లక్షల భారతీయ విద్యార్థులు ఆస్ట్రేలియాలో చదువుకొంటున్నారు. ఇటీవలికాలంలో వచ్చిన మార్పుల ప్రకారం ఐఈఎల్‌టీఎస్, టొఫెల్, డ్యూలింగో ఇంగ్లిష్ పరీక్షల్లో స్కోర్‌ను ఆస్ట్రేలియా పెంచింది. టెంపరరీ గ్రాడ్యుయేట్ వీసాకు ఐఈఎల్‌టీఎస్ స్కోర్ 6.0 నుంచి 6.5కు, స్టూడెంట్ వీసా స్కోర్‌ను 5.5 నుంచి 6.0కు పెంచారు. స్టూడెంట్ వీసా బ్యాంక్ డిపాజిట్ మొత్తం 24,505 డాలర్లు ఉంచాల్సి ఉంటుంది.
యూకేలో
ఏటా 7.5లక్షల అంతర్జాతీయ విద్యార్థులు ఉన్నత చదువులకు యూకే పయనమవుతున్నారు. ఈ సంఖ్యను తగ్గించేందుకు యూకే ప్రభుత్వం పలు నిబంధనలు అమలుచేస్తున్నది. పీహెచ్‌డీ విద్యార్థులు తమ కుటుంబాలను యూకేకు తీసుకురావడంపై అక్కడి అధికారులు నిషేధం విధించారు. కొన్ని నెలల క్రితమే యూకే వీసా రుసుములను ఇండియన్ కరెన్సీలో రూ. 51,787 చెల్లించాల్సి వస్తున్నది.
ఫ్రాన్స్‌లో
ఫ్రాన్స్‌లో మాస్టర్స్ విద్యార్థుల కోసం అక్కడి ప్రభుత్వం గతంలో స్పాన్సర్ చేసిన రెండేండ్ల పోస్ట్ స్టడీ వర్క్‌వీసాను ఇప్పుడు ఐదేండ్లకు పొడిగించింది. మాస్టర్స్‌కు మించి చదివిన వారికి ఐదేండ్ల షార్ట్ స్టే స్కెంజెన్ వీసాను పొందవచ్చు.
ఐర్లాండ్‌లో
భారతీయ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఎంపికచేసుకొనే గమ్యస్థానాల్లో ఐర్లాండ్ ఒకటి. బ్యాచిలర్, మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసిన అంతర్జాతీయ విద్యార్థులు పోస్ట్ స్టడీ వర్క్ వీసా కోసం రెండేండ్ల పాటు ఈ దేశంలో ఉండొచ్చు.
ఇటలీలో
డిగ్రీ చదువు పూర్తయిన తర్వాత ఇటలీలో ఉండాలనుకొనే విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది. తాజా అంచనాల ప్రకారం 2022లో ఇటలీలో 5,897 మంది భారతీయ విద్యార్థులున్నారు. ఇటలియన్ లాంగ్వేజ్‌లో ప్రొఫెషనల్, ఇంటర్న్‌షిప్‌లు చేసుకొనే వెసులుబాటును కల్పించారు.
న్యూజిల్యాండ్‌లో
ఇంటర్నేషల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ (ఐఈఎల్‌టీఎస్) వన్ స్కిల్ రీటెక్ ఎంపికను అంగీకరిస్తున్నట్టు ఈ దేశం ఇటీవలే ప్రకటించింది. మొదటి ప్రయత్నంలో కోరుకొన్న స్కోర్ సాధించకుంటే వినడం, చదవడం, రాయడం, మాట్లాడడం ద్వారా స్కోర్‌ను మెరుగుపరుచుకోవచ్చు.
కెనడాలో
భారతీయ విద్యార్థుల్లో కొందరు కెనడా బాట పడుతున్నారు. 2023 డిసెంబర్ 1 నుంచి పోస్ట్ సెకండరీ డిజిగ్నేటెడ్ లెర్నింగ్ ఇన్‌స్టిట్యూషన్స్ ప్రతి దరఖాస్తుదారు అంగీకార పత్రాన్ని నేరుగా ఐఆర్‌సీసీతో ధ్రువీకరించాలని కెనడా పేర్కొన్నది. ఇది ఇటీవలికాలంలో కెనడా విధించిన కొత్త తరహా నిబంధన. మోసాలను నివారించేందుకు అక్కడి ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. మార్కెట్‌కనుగుణంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ వీసాలను సమీక్షించాలని నిర్ణయించింది. విద్యార్థుల కనీస జీవన వ్యయాన్ని 10వేల కెనడియన్ డాలర్ల నుంచి 20,635 డాలర్లకు పెంచనున్నారు.
అమెరికాలో
స్టూడెంట్ వీసా అపాయింట్‌మెంట్ సిస్టమ్‌లో మోసాలు, దుర్వినియోగాలను నిరోధించేందుకు విద్యార్థి వీసా దరఖాస్తుల్లో కొత్త నియామాన్ని అమెరికా ప్రకటించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఎఫ్, ఎం, జే స్టూడెంట్ వీసాల కోసం దరఖాస్తు చేసుకొనే వారు తమ ప్రొఫైల్‌ను రూపొందించి.. వీసా అపాయింట్‌మెంట్ షెడ్యూల్ సమయంలో సొంత పాస్‌పోర్ట్ సమాచారాన్ని వెల్లడించాలి. ప్రొఫైల్‌ను తప్పుగా నమోదుచేసినా, తప్పుడు పాస్‌పోర్టు నంబర్‌ను ఉపయోగించి బుక్ చేసుకొన్న అపాయింట్‌మెంట్‌ను కాన్సులేట్ అధికారులు రద్దుచేస్తారు. దీంతో వీసా రుసుమును కోల్పోతారు.
👉 – Please join our whatsapp channel here –