Politics

తెలంగాణ ప్రయోజనాల కోసం ఢిల్లీలో గులాబీ జెండా ఎగరాలి

తెలంగాణ ప్రయోజనాల కోసం ఢిల్లీలో గులాబీ జెండా ఎగరాలి

తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసం దిల్లీలో గులాబీ జెండా ప్రాతినిధ్యం ఉండాల్సిందేనని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఇవాళ నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎన్నికల సన్నద్ధతపై నాయకులు, కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సరళిని పరిశీలిస్తే నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ఓట్ల పరంగా భారాస మొదటి స్థానంలో ఉందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉందని, అసెంబ్లీ ఫలితాలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, ప్రాతినిధ్యం కోసం గట్టిగా కొట్లాడితే విజయం మనదేనని ధీమా వ్యక్తం చేశారు.

భారాసకు ఎన్నికల్లో గెలుపోటములు కొత్తేమీ కాదని కేటీఆర్‌ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలించేందుకు కాంగ్రెస్‌ పార్టీ అడ్డగోలుగా 420 హామీలు ఇచ్చి.. మాట దాటేస్తోందని ఆయన విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ భృతి ఇవ్వలేమని ఉపముఖ్యమంత్రి భట్టి తప్పించుకునే ప్రయత్నం చేశారన్నారు. అప్పులు, శ్వేత పత్రాల పేరుతో తప్పించుకునే డ్రామాలు చేస్తున్నారని ఆక్షేపించారు. పేదల కోసం ఉద్దేశించిన అనేక సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. దళితబంధు, బీసీ బంధు, గృహలక్ష్మి, ఇతర సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేస్తే ఆయా లబ్ధిదారులతో భారాస పోరాటం చేస్తుందని హెచ్చరించారు. రైతుబంధు డబ్బులు వేయకుండా ప్రభుత్వం మభ్య పెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. కాంగ్రెస్ అస్తవ్యస్త పనితీరు, పరిపాలనను ఎప్పటికప్పుడు ఎండగట్టేలా భారాస శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. పార్టీలో మార్పులుచేర్పులను కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా తీసుకుంటామని కేటీఆర్ చెప్పారు

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z