విజయనగరం జిల్లాలోని గజపతినగరం జాతీయ రహదారిపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రయాణిస్తున్న వాహనాన్ని అంగన్వాడీలు సోమవారం అడ్డగించారు. తమ సమస్యలను పరిష్కరించాలని.. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని మంత్రిని కోరారు. చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుతంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై ‘ఎస్మా’ ప్రయోగించడాన్ని వారు తీవ్రంగా తప్పుబట్టారు.
అంగన్వాడీల వినతిపై మంత్రి స్పందిస్తూ.. వేతనాల పెంపు మినహా మిగిలిన సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తెలంగాణ కంటే అధికంగానే వేతనాలు ఇస్తున్నామన్నారు. బాలింతలు, గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వివరించినా.. సమ్మె విరమించకపోవడం వల్లే ఎస్మా ప్రయోగించాల్సి వచ్చిందన్నారు. సమ్మెను విరమించిన మరుక్షణమే ఎస్మా రద్దు చేస్తామని మంత్రి వెల్లడించారు.
👉 – Please join our whatsapp channel here –