DailyDose

ఈ రూట్ల నుంచి విమానాశ్రయానికి మెట్రో

ఈ రూట్ల నుంచి  విమానాశ్రయానికి మెట్రో

శంషాబాద్‌ విమానాశ్రయానికి మెట్రో కొత్త మార్గంపై జరుగుతున్న కసరత్తులో ప్రాథమికంగా కొంత స్పష్టత వచ్చింది. నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌, చంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, పీ7 రోడ్‌ మీదుగా విమానాశ్రయానికి మార్గం మేలనే భావనలో మెట్రో నిపుణులున్నారు. కారిడార్‌-2 కొనసాగింపుగా ఎంజీబీఎస్‌ – ఫలక్‌నుమా – చంద్రాయణగుట్ట – మైలార్‌దేవ్‌పల్లి – విమానాశ్రయం మార్గంతో పోలిస్తే కారిడార్‌-3 కొనసాగింపు నాగోల్‌ మార్గంలో ఎక్కువ మంది ప్రయాణిస్తారనే అభిప్రాయాలను అధికారులు వ్యక్తం చేశారు. మెట్రోలో ట్రాఫిక్‌ అత్యంత కీలకం కాబట్టి మొగ్గు ఇటు కన్పించింది. ట్రాఫిక్‌ ఒక్కటే కాదు.. ఇతర అంశాల ప్రభావాన్నీ పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఫలక్‌నుమా నుంచి వచ్చే మార్గం చంద్రాయణగుట్ట వద్ద ఇరుకుదారి కావడంతోపాటు ఫ్లైఓవర్‌ పైనుంచి మలుపు తీసుకుని నిర్మాణం చేపట్టడం అతిపెద్ద సవాల్‌. అదే నాగోల్‌ నుంచి మార్గమైతే ఫ్లైఓవర్‌కు సమాంతరంగా వెళుతుంది. ఈ మార్గం ఏ మేరకు ఆర్థికంగా లాభసాటి అనే విషయాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటున్నారు.

గుట్ట వరకే..
కారిడార్‌-2 ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా, అక్కడి నుంచి 1.5 కి.మీ. దూరంలో చంద్రాయణగుట్ట వద్ద కూడలిలో విమానాశ్రయ మెట్రోని కలుస్తుంది. చాంద్రాయణగుట్టలో జంక్షన్‌ ఉంటుంది కాబట్టి జేబీఎస్‌ నుంచి వచ్చేవారు చంద్రాయణగుట్ట వరకు వచ్చి అక్కడ విమానాశ్రయ మెట్రోకి మారాలి. ఎంజీఎబీస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కి.మీ. మొదటిదశలో చేపట్టాల్సిన మార్గం. దీన్ని పూర్తిచేస్తూ మరో 1.5 కి.మీ. పొడిగిస్తే చంద్రాయణగుట్ట వరకు వస్తుంది. పైగా ఈ మార్గంలో విమానాశ్రయానికి వెళ్లేవారితో పోలిస్తే నిత్యం నగరానికి వెళ్లేవారే అధికంగా ఉంటారనే అభిప్రాయం కూడా ఉంది.

పలు పైవంతెనలు..
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టేందుకు అనువుగా ఉండే మార్గంవైపు అధికారులు మొగ్గు చూపుతున్నారు. ఎవరైనా ముందుకొస్తే వారికి నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తారు. ఒకవేళ ఎవరూ రాకపోతే ప్రభుత్వమే నిర్మిస్తుంది. నిర్వహణను ప్రైవేటుకు అప్పగిస్తుంది. నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు 5 కి.మీ. మార్గం గతంలోనే ప్రతిపాదించారు. దీన్ని చేపట్టడంతోపాటు కొత్తగా విమానాశ్రయం వరకు విస్తరిస్తే సరిపోతుంది. అయితే నాగోల్‌ – చంద్రాయణగుట్ట – విమానాశ్రయ మార్గంలోనూ సవాళ్లున్నాయని అధికారులు గుర్తించారు. పెద్దగా భూసేకరణ సమస్యలు లేకపోయినా ఈ మార్గంలో 5 ఫ్లైఓవర్లున్నాయి. వీటి పక్క నుంచి మెట్రోరైలు నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. అయితే ఈ మార్గంలో దూరం పెరుగుతుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z