DailyDose

వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ముందు స్వచ్ఛ ఆటో కార్మికులు నిరసన

వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ముందు స్వచ్ఛ ఆటో కార్మికులు నిరసన

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నాలుగు నెలల నుండి వేతనాలు చెల్లించడం లేదని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ముందు స్వచ్ఛ ఆటో కార్మికులు ఆటోలతో నిరసన చేపట్టారు. పెండింగ్ లో ఉన్న నాలుగు నెలల వేతనాలు చెల్లించాలంటూ స్వచ్ఛ ఆటో కార్మికులు విధులు బహిష్కరించి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ముందు స్వచ్ఛ ఆటోలతో ఆందోళన దిగారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 169 స్వచ్ఛ ఆటోలు 66 డివిజన్ ల నుంచి చెత్త సేకరిస్తున్నాయి. నాలుగు నెలల నుండి స్వచ్ఛ ఆటో కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు ఆందోళన బాట పట్టారు. కార్పొరేషన్ అధికారుల తీరు పట్ల ఆగ్రహ వ్యక్తం చేశారు. నాలుగు నెలలు గడుస్తున్నా వేతనాలు లేవని వాపోయారు. సంక్రాంతి పండుగ వస్తున్నా వేతనాలు ఇచ్చే దిసగా కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కుటుంబాన్ని పోషించుకోవడానికే ఇంతలా కష్టపడుతున్నా మా కష్టన్ని గుర్తించడం లేదని మండిపడ్డారు. సమయానికి వేతనాలు ఇవ్వకపోవడంతో బ్యాంకు లోన్ ఆలస్యమై ఇతర లోన్లు రావడంలేదని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గతంలో ఇంటికి 60 రూపాయల చెత్త పన్ను వసూలు చేసిస్తామన్న అధికారులు ఇప్పటివరకు అది పట్టించుకోవడంలేదని గుర్తు చేశారు. తమకు ఇచ్చిన ఆటోల మెయింటెనెన్స్ మాకు భారంగా మారిందని వాపోతున్నారు. తాము ఇక స్వచ్ఛ ఆటోలు నడిపే పరిస్థితి లేదని అన్నారు. కార్పొరేషన్ అధికారులు కేవలం 169 మంది ఆటో డ్రైవర్ కం ఓనర్లు అనుకుంటున్నారే తప్ప 169 కుటుంబాలుగా పరిగణంలోకి తీసుకోవడం లేదని తెలిపారు. ఇప్పటికైనా పెండింగ్ లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు ఆటోలు తీసేది లేదని కార్మిక సంఘం నాయకులు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z