శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రోజురోజుకూ విదేశీ ప్రయాణికుల రాకపోకలు పెరుగుతున్నాయి. పర్యాటకంగా, పారిశ్రామికంగా తెలంగాణ రాణిస్తుండటమే దీనికి కారణంగా తెలుస్తోంది. 2022 నవంబరులో 2.90 లక్షల మంది విదేశీయులు రాగా.., 2023 నవంబరులో 3.51 లక్షల మంది వచ్చారు. ఏడాది వ్యవధిలో 61 వేల మంది పెరిగారు. ఇదే నెలలో దిల్లీ నుంచి 16.78 లక్షలు, ముంబయి నుంచి 12.69 లక్షలు, బెంగళూరు నుంచి 3.98 లక్షల మంది విదేశీయులు రాకపోకలు సాగించారు. అయితే ప్రయాణికుల పెరుగుదల శాతం పరంగా హైదరాబాద్ ముందుంటోంది. ఐటీ పరిశ్రమల హబ్‌గా బెంగళూరుకు ముందు నుంచీ పేరుంది. ఇక్కడ ఏటా సుమారు 40 వేల మంది చొప్పున విదేశీ ప్రయాణికులు పెరుగుతుండగా.. శంషాబాద్‌కు 50 వేల మందికిపైగా పెరుగుతున్నారు. వేగంగా రవాణా సౌకర్యాలను అనుసంధానం చేస్తూ శంషాబాద్ దక్షిణ భారతదేశానికి కేంద్రంగా మారింది. విమానయాన సంస్థలు కూడా దీనికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ప్రస్తుతం 80కి పైగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులుండగా.. రెండు మూడు నెలల్లో మరో 20 పెరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసానికి, ఉద్యోగాలకు వెళ్లేవారు శంషాబాద్‌నే ఎంచుకుంటున్నారు.
👉 – Please join our whatsapp channel here –