Politics

తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన హరీశ్‌రావు

తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన హరీశ్‌రావు

కొత్త విద్యుత్తు పాలసీ తెస్తామంటున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులు మళ్లీ దొంగరాత్రి బావుల కాడ కరెంటు కోసం ఎదురుచూసే పరిస్థితి తెస్తుందా? అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. రూపాయి బిల్లు లేకుండా కేసీఆర్‌ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తు ఇచ్చిందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్తగా తెచ్చేదేమిటని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం జీడిపల్లి గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. హరీశ్‌రావు మాట్లాడుతూ.. కేసీఆర్‌ పదేండ్ల పాలనలో గ్రామాలు అభివృద్ధి చెందాయని వివరించారు. ప్రభుత్వ దవాఖానలను బాగు చేసి నిరుపేదలకు కార్పొరేట్‌ వైద్య సేవలను అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్‌ నేతలకు రాజకీయం ఎక్కువ, అధికారం అంటే మక్కువ, రాజకీయం అంటే వాళ్లకు గేమ్‌ లాంటిందని విమర్శించారు. బీఆర్‌ఎస్‌కు రాజకీయం అంటే తెలంగాణ ప్రజల బతుకుదెరువు అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రతిపక్షంగా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పారు. తెలంగాణకు కష్టమొచ్చినా, ఆపదొచ్చినా ఢిల్లీలో కొట్లాడేది బీఆర్‌ఎస్‌ మాత్రమేనని పేర్కొన్నారు. ఓడిపోయినంత మాత్రాన తెలంగాణ ప్రజలను విడిచిపెట్టిపోమని, ఏ ఆపద వచ్చినా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎక్కడ అన్యాయం జరిగినా అండగా నిలిచి అసెంబ్లీలో గొంతు విప్పుతామని చెప్పారు. ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మెదక్‌ జెడ్పీ చైర్‌ పర్సన్‌ ర్యాకల హేమతలతాశేఖర్‌గౌడ్‌, ఫుడ్స్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ గంగుమల్ల ఎలక్షన్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ మెట్టు బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z