DailyDose

చంద్రబాబుతో పవన్‌ భేటీ- తాజా వార్తలు

చంద్రబాబుతో పవన్‌ భేటీ- తాజా వార్తలు

* చంద్రబాబుతో పవన్‌ భేటీ

సంక్రాంతి సందర్భంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను తెదేపా అధినేత చందబ్రాబు తన నివాసానికి భోజనానికి ఆహ్వానించారు. ఉండవల్లిలో శనివారం రాత్రి ఇద్దరు నేతలు భేటీ కానున్నారు. రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై ఓ స్పష్టత వచ్చే అవకాశముంది. ఆదివారం ఉదయం మందడంలో నిర్వహించే సంక్రాంతి భోగి మంటల కార్యక్రమంలో కలిసి పాల్గొననున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక జీవోల ప్రతులను భోగి మంటల్లో దహనం చేయనున్నారు.

* సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన రేవంత్​‌రెడ్డి

తెలంగాణ ప్రజలందరికీ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్​‌రెడ్డి ( CM Revanth Reddy ) మకర సంక్రాంతి ( Sankranti ) శుభాకాంక్షలు తెలిపారు. శనివారం నాడు ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. పాత నిర్బంధపు చీకట్లను రూపుమాపే కొత్త కాంతులు ఇంటింటా వెల్లివిరియాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సూర్యుని కొత్త ప్రయాణం కొత్త మార్పుకు నాంది పలకాలని, రాష్ట్రమంతటా సంక్షేమంతో పాటు అభివృద్ధి వెలుగులు విరజిమ్మాలని అన్నారు. భోగ భాగ్యాలను అందించే భోగి.. కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి.. కనుమ పండుగలు.. అందరూ ఆనందంగా జరుపుకోవాలని మనసారా ఆకాంక్షించారు. తెలంగాణలో మొదలైన ప్రజా పాలనలో స్వేచ్ఛా సౌభాగ్యాలతో ప్రజలు సంతోషంగా పండుగ సంబురాలు జరుపుకోవాలని తెలిపారు. సకల జన హితానికి, ప్రగతి పథానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని సీఎం రేవంత్​‌రెడ్డి హామీ ఇచ్చారు.

* ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ రాజీనామా

సీఆర్‌ ఏపీ మీడియా అకాడమీ(సీ రాఘవాచారి ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ) చైర్మన్ పదవికి సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాసరావు రాజీనామా ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు ఒక ప్రకటనలో స్పష్టత ఇచ్చారాయన. తనపై నమ్మకంతో మీడియా అకాడమీ చైర్మన్‌గా నియమించి.. పూర్తి సహాయ సహకారాలు అందించినందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారాయన.సీనియర్‌ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు.. 2022 నవంబర్ 10వ తేదీన ఏపీ మీడియా అకాడమీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ 13 నెలల 15 రోజులు కాలంలో వర్కింగ్ జర్నలిస్టుల కోసం పలుకార్యక్రమాలు చేయగలగడం సంతృప్తినిచ్చిందని ప్రకటనలో పేర్కొన్నారాయన. అయితే.. ఈ నెల 16 వరకు సంక్రాంతి నేపథ్యంలో సెలవులు ఉండడంతో.. 17 వ తేదీ నుంచి తన రాజీనామా అమలులోకి వస్తుందని ఆయన వెల్లడించారు.

* తెదేపా నేతల ఆందోళన

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా విజయవాడ కనకదుర్గ వారధిపై భద్రతాలోపాలు కనిపించాయి. అధికారులు వారధిపై లారీ అడ్డంపెట్టి విద్యుత్‌ లైట్ మరమ్మతులు చేపట్టారు. ఆయన పర్యటనపై ముందస్తు సమాచారం ఉన్నా.. వారధిపై వాహనాన్ని అడ్డంగా పెట్టడంపై తెదేపా నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. వారధిపై ట్రాఫిక్‌ స్తంభించి చంద్రబాబు జెడ్‌ప్లస్‌ వాహన శ్రేణి దాదాపు పది నిమిషాల పాటు నిలిచిపోయింది. ఎన్‌ఎస్‌జీ కమాండోలు ట్రాఫిక్ క్లియర్‌ చేసి కాన్వాయ్‌ను ముందుకు తీసుకెళ్లారు. వంతెనపై విద్యుత్‌ పరికరాల వాహనం అడ్డుపెట్టడంపై ఎన్‌ఎస్‌జీ సిబ్బంది తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

* బెంగళూరుకి బయలుదేరిన రామ్ చరణ్

సంక్రాంతి’.. ఈ పేరు చెబితే చాలు.. పండుగ ఎప్పుడెప్పుడు వస్తుందా.. ఎప్పుడెప్పుడు సొంత ఊళ్లకు వెళ్తామా అని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక సంక్రాంతికి సాధారణ ప్రజలే కాకుండా టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా వాళ్ళ సొంత ఊళ్లకు పయనమవుతుంటారు. అయితే ఈ ఏడాది సంక్రాంతి పండుగ‌ను తెలుగు రాష్ట్రాల్లో కాకుండా బెంగళూరులోని ఫామ్‌హౌస్‌లో జ‌రుపుకోనుంది టాలీవుడ్ మెగా ఫ్యామిలీ.సంక్రాంతి వేడుకలకు ఇప్ప‌టికే మెగా ఫ్యామిలీ మొత్తం బెంగళూరుకు పయనంకాగా.. తాజాగా ఈ వేడుకల్లో పాల్గొనేందుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన, కూతురు క్లీంకారా(Klin Kaara)తో బెంగళూరుకి బయలుదేరారు. క్లీన్ కారా (Klin Kaara) పుట్టిన త‌ర్వాత వ‌స్తున్న మొద‌టి సంక్రాంతి కావడంతో ఈ పండుగ‌ను భారీ ఎత్తున సెల‌బ్రేట్ చేసుకోనుంది. ఇక వీరితో పాటుగా పవన్ కల్యాణ్ కొడుకు అకీరా నందన్, ఆద్యలు కూడా ఉన్నారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

* రఘురామకృష్ణరాజు ఆవేదన

సొంత నియోజకవర్గానికి రాకుండా తనను ఇన్నాళ్లూ ఇబ్బంది పెట్టారని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆవేదన వ్యక్తంచేశారు. రాజమహేంద్రవరం నుంచి రోడ్డు మార్గాన భీమవరం చేరుకున్న రఘురామకు అభిమానులు, తెదేపా-జనసేన నేతలు ఘనస్వాగతం పలికారు. ‘‘తెదేపా, జనసేన కలిసిన రోజే కోస్తాలో వైకాపా పని అయిపోయింది. ఫిబ్రవరి రెండో వారంలో ఆ పార్టీకి రాజీనామా చేయబోతున్నా. అప్పటికి పొత్తుల అంశం ఖరారయ్యే అవకాశం ఉంది. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం తర్వాత భాజపాతో పొత్తు విషయం తేలుతుంది. మూడు పార్టీలు కలిసే ఎన్నికలకు వెళ్తాయని భావిస్తున్నా. తెదేపా-జనసేన కూటమి తరఫున పోటీకి నేను సిద్ధంగా ఉన్నా’’ అని రఘురామ వివరించారు.

* రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖరరావు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మకరరాశిలోకి సూర్యుడి ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణం పుణ్యకాలమన్నారు. ప్రజల జీవితాల్లో సంక్రాంతి సుఖ సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. ప్రజలు సిరి సంపదలతో, భోగ భాగ్యాలతో తులతూగాలన్నారు. సంక్రాంతి పండగను ఆనందంగా జరుపుకోవాలన్నారు.

* వైసీపీకి మరో బిగ్ షాక్

వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ ఎంపీ బాలశౌరి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన మచిలీపట్నం నుంచి ఎంపీగా ఉన్నారు. వైసీపీ ఇంఛార్జుల మార్పులతో మరోసారి సీటు దక్కడం కష్టమని భావించిన ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎంపీ బాలశౌలి వైఎస్ జగన్‌కు సన్నిహితుడు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇస్తానని సీఎం జగన్ స్పష్టత ఇవ్వకపోవడంతో బాలశౌలి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరి కాసేపట్లో వైసీపీ నాలుగో లిస్టు విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ముందుగానే ఎంపీ బాలశౌరి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే ఆరుగురు ఎంపీ అభ్యర్థులను వైసీసీ అధిష్టానం ఖరారు చేసింది. ఎంపీ బాలశౌరి రాజీనామాతో ఆ స్థానంలో ఎవరి పేరు ఉండబోతుందో చూడాలి. మరోవైపు ఎంపీ బాలశౌరి రాజీనామాతో మచిలీపట్నం వైసీపీ నేతలు, కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z