DailyDose

నకిలీ సబ్బుల మాఫియా గుట్టురట్టు-నేర వార్తలు

నకిలీ సబ్బుల మాఫియా గుట్టురట్టు-నేర వార్తలు

* నకిలీ సబ్బుల మాఫియా గుట్టురట్టు

నకిలీ మైసూర్‌ శాండల్‌ సబ్బులను తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను మలక్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో సోదాలు నిర్వహించి నకిలీ ఉత్పత్తులతోపాటు దాదాపు రూ. 2 కోట్ల విలువైన తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన రాకేశ్‌ జైన్‌, మహావీర్‌ జైన్‌లను నిందితులుగా గుర్తించి వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కర్ణాటక ప్రభుత్వానికి చెందిన కేఎస్‌డీఎల్‌ సంస్థకు మైసూర్‌ శాండల్‌ సబ్బులపై పేటెంట్‌ హక్కులు ఉన్నాయి.హైదరాబాద్‌ కేంద్రంగా నకిలీ మైసూర్‌ శాండల్‌ సబ్బులు మార్కెట్‌లోకి వస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం కర్ణాటక పరిశ్రమల శాఖ మంత్రి, కేఎస్‌డీఎల్‌ ఛైర్మన్‌ ఎం.బి. పాటిల్‌కు సమాచారం అందింది. దీనిపై తెలంగాణ అధికారులకు సమాచారం ఇవ్వడంతోనే తాజాగా దాడులు జరిగినట్లు తెలుస్తోంది.

* అనంత‌గిరి ఘాట్ రోడ్డులో రోడ్డు ప్ర‌మాదం

జిల్లా ప‌రిధిలోని అనంత‌గిరి ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. హైద‌రాబాద్ నుంచి తాండూరు వెళ్తున్న ఓ ఆర్టీసీ బ‌స్సు అదుపుత‌ప్పింది. అనంత‌రం బ‌స్సు ఘాట్ రోడ్డులో ఉన్న పొద‌ల్లోకి దూసుకెళ్లింది. దీంతో బ‌స్సులో ప్ర‌యాణిస్తున్న ప‌లువురు ప్ర‌యాణికుల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. గాయ‌ప‌డ్డ వారిని చికిత్స నిమిత్తం వికారాబాద్ ఏరియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. పొద‌ల్లో చిక్కుకున్న బ‌స్సును, క్రేన్ సాయంతో బ‌య‌ట‌కు తీస్తున్నారు. ఆ మార్గంలో ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది

* లింగాల మండలం చెన్నంపల్లిలో దారుణం

నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలం చెన్నంపల్లిలో దారుణం చోటుచేసుకుంది. వివాహిత మృతి ఘటనలో భర్తను మృతురాలి బంధువులు చంపారు. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా ఉంటున్న సింధు, నాగార్జున మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకుని సింధు ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే బంధువులు ఆమెను నాగర్‌కర్నూల్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకువస్తుండగా ఆమె మృతి చెందింది. అనంతరం మృతదేహంతో బంధువులు అచ్చంపేటకు తిరుగుపయనమయ్యారు. ఆమె మృతికి భర్తే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. శుక్రవారం అర్ధరాత్రి ఆమనగల్లు వద్ద నాగార్జునను సింధు బంధువులు కొట్టిచంపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

* కల్వర్టు గుంతలో పడ్డ వాహనాలు

జోగులాంబ గద్వాల జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రైవేటు బస్సు బోల్తా పడి ఓ మహిళ సజీవదహనం.. నలుగురికి తీవ్ర గాయాలైన విషయం తెలిసింది. తాజాగా ఇవాళ మధ్యాహ్నం మరో రోడ్డు ప్రమాదం సంభవించింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలంలోని షున్సిమియాగూడ వద్ద ప్రమాదం జరిగింది. రోడ్డు విస్తరణ పనుల కోసం తవ్విన కల్వర్టు గుంతలో ప్రమాదవశాత్తు కారు, ఆటో, బైక్‌ బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో కారులోని వ్యక్తి, మహిళ మృతి చెందారు. బైక్‌తోపాటు పడిన యువకుడికి తీవ్ర గాయాలవ్వగా స్థానిక అస్పత్రికి తరలించారు. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలించి.. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

* పండుగ వేళ అత్తాపూర్‌లో విషాదం

సంక్రాంతి పండుగ వేళ అత్తాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. కైట్‌ ఎగరవేస్తూ విద్యుత్‌ తీగలకు బాలుడు తాకాడు. దీంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు.గాలి పటాలు ఎగుర వేయడానికి తన స్నేహితులతో కలిసి మేడపైకి వెళ్లిన తనిష్క్.. పతంగి ఎగరేస్తూ విద్యుత్‌ ఘాతానికి గురయ్యాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అప్పటికే బాలుడు మృతిచెందాడు. బాలుడు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

* ముంబయిలో భారీ అగ్నిప్రమాదం

శ ఆర్థిక రాజధాని ముంబయిలో (Mumbai) భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. డోంబివలీ ప్రాంతంలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో శనివారం ఉదయం మంటలు చెలరేగాయి. లోధా పలావ టౌన్‌షిప్‌లోని ఫేజ్‌-2లో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని పదిహేను అగ్నిమాపక శకటాలతో మంటలు ఆర్పివేశారు. మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో చెలరేగిన మంటలు.. 13వ అంతస్తులో చెలరేగిన మంటలు 18వ అంతస్తు వరకు వ్యాపించాయి. ఆ అపార్ట్‌మెంట్‌ ఇంకా నిర్మాణ దశలోనే ఉండటంతో ప్రాణనష్టం తప్పింది. తొలి మూడు ఫ్లోర్లలో మాత్రమే కొన్ని కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ప్రమాదం సంగతి తెలిసిన వెంటనే వాళ్లంతా సురక్షితంగా బయటకు వచ్చేశారు. మంటలు చెలరేగడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z