సూర్య భగవానుని గొప్పదనాన్ని గుర్తుచేసుకునే పండుగే మకరసంక్రాంతి. ఈ రోజున స్నానం చేసి, సూర్యభగవానుని పూజించి, దానాలు చేస్తారు. మకర సంక్రాంతి పండుగను మన దేశంలో చాలా పేర్లతో పిలుస్తారు. తమిళనాడులో పొంగల్, గుజరాత్‌లో ఉత్తరాయణం, పంజాబ్‌లో లోహ్రీ, అస్సాంలో భోగాలి, బెంగాల్‌లో గంగాసాగర్, ఉత్తరప్రదేశ్‌లో ఖిచ్డీ, తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అని పిలుస్తారు.
సంక్రాంతి నాడు ఆకాశంలో గాలిపటాలు ఎగురుతూ కనిపిస్తాయి. పతంగుల పోటీలు జరుగుతుంటాయి. ఒకరి గాలిపటాన్ని మరొకరు కట్ చేసేందుకు ప్రయత్నిస్తూ వినోదిస్తారు. పిల్లలే కాదు పెద్దలు కూడా ఉత్సాహంగా గాలిపటాలు ఎగురవేస్తారు. అయితే సంక్రాంతిరోజున గాలిపటాలు ఎగురవేయడం వెనుక ఉద్దేశం ఏమిటని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక పలు ప్రయోజనాలు ఉన్నాయనే సంగతి మీకు తెలుసా?
మకర సంక్రాంతి నాడు గాలిపటాలు ఎగురవేయడం వెనుక పలు శాస్త్రీయ కారణాలున్నాయి. బహిరంగ ప్రదేశంలో ఆకాశంలో గాలిపటాలు ఎగురవేయడం ద్వారా మనకు సూర్యుని నుండి విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ డి మన శరీరానికి ఎంతో అవసరం. అంతేకాకుండా ఎండలో నిలుచుని గాలిపటాలు ఎగురవేయడం ద్వారా మనకు చలినుంచి రక్షణ దొరుకుతుంది. శరీరాన్ని వ్యాధుల బారి నుండి రక్షించుకోవచ్చు.
మకర సంక్రాంతి వేళ గాలిపటాలు ఎగురవేయడం వెనుక మతపరమైన కారణాలు కూడా ఉన్నాయి. ఇతిహాసాలలోని వివరాల ప్రకారం మకర సంక్రాంతి నాడు గాలిపటాలు ఎగురవేసే సంప్రదాయాన్ని శ్రీరాముడు ప్రారంభించాడు. శ్రీరాముడు తొలిసారి గాలిపటం ఎగురవేసినప్పుడు, ఆ గాలిపటం ఇంద్రలోకానికి వెళ్లింది. నాటి నుంచి శ్రీరాముడు ప్రారంభించిన సంప్రదాయాన్ని హిందువులు భక్తిశ్రద్ధలతో కొనసాగిస్తున్నారు. మకర సంక్రాంతి రోజున పతంగులు ఎగురవేయడం, ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం ద్వారా సౌభ్రాతృత్వం, సంతోషం వెల్లివిరుస్తాయి. గాలిపటం అనేది ఆనందం, స్వేచ్ఛ, ఐశ్వర్యానికి చిహ్నమని చెబుతుంటారు.
👉 – Please join our whatsapp channel here –