Devotional

22 నాటికి అయోధ్యకు చేరుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది?

22 నాటికి అయోధ్యకు చేరుకోవాలంటే ఎంత ఖర్చు  అవుతుంది?

అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం, శ్రీరాముని ప్రాణప్రతిష్ట వేడుక జనవరి 22న ఘనంగా జరగనుంది. ఈ వేడుకకు పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తూ వారికి లేఖలు పంపారు.

అయితే జనవరి 22 నాటికి అయోధ్యకు చేరుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? విమాన టిక్కెట్లు, హోటల్ గదుల ఛార్జీలు ఎలా ఉంటాయి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకునే ‍ప్రయత్నం చేద్దాం. ఈజ్ మై ట్రిప్, థామస్ కుక్, ఎస్‌ఓటీసీ తదితర ట్రావెల్ సంస్థలు.. అయోధ్యలో జరిగే వేడుకకు హాజరయ్యేందుకు చాలామంది ఎంత ఖర్చయినా భరించేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నాయి. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏడు వేల మందికి ఆహ్వానాలు పంపించారు. వీరిలో పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు కూడా ఉన్నారు.

‘థామస్ కుక్’, ‘ఎస్‌ఓటీసీ’ సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైల నుండి అయోధ్యకు విమాన టిక్కెట్ల ధరలు రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకూ చేరుకున్నాయి. ఇతర సమయాల కంటే ప్రస్తుతం విమాన ఛార్జీలు చాలా అధికంగా ఉన్నాయి. సోమవారం మేక్ మై ట్రిప్‌లో జనవరి 20న ముంబై నుంచి అయోధ్యకు వెళ్లేందుకు వన్‌వే ఫ్లైట్ టికెట్ రూ.17,900 నుంచి రూ.24,600 వరకూ ఉంది. అదే సమయంలో జనవరి 21 నాన్‌స్టాప్ విమానానికి రూ.20,699గా ఉంది. జనవరి 20న కోల్‌కతా నుంచి అయోధ్యకు విమాన టిక్కెట్ల ధర రూ.19,456 నుంచి రూ.25,761గా ఉంది. బెంగళూరు నుండి అయోధ్యకు వెళ్లాలనుకుంటే జనవరి 20కి రూ. 23,152 నుండి రూ. 32,855 వరకు విమాన టిక్కెట్ల ధర ఉంది.

ఈజ్ మై ట్రిప్ పేర్కొన్న వివరాల ప్రకారం అయోధ్య రామాలయ ప్రారంబోత్సవానికి దాదాపు ఏడువేల మంది అతిథులు హాజరుకానున్నారు. ఈనెల 22 తరువాత ప్రతిరోజూ మూడు నుండి ఐదు లక్షల మంది భక్తులు అయోధ్యకు చేరుకునే అవకాశం ఉంది.

నూతన రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్యలోని హోటళ్లన్నీ ఇప్పటికే పూర్తిగా బుక్ అయిపోయాయి. హోటళ్లలో గదుల ఆక్యుపెన్సీ రేటు 80 నుండి 100 శాతానికి చేరుకుంది. ఫలితంగా కొన్ని హోటళ్లలో రాత్రిపూట గది అద్దె ధర రూ.70 వేలు వరకూ చెబుతున్నారు. అందుకే అయోధ్యకు వచ్చే చాలామంది భక్తులు పగటిపూట అయోధ్యలో ఉంటూ, రాత్రి పూట లక్నో లేదా ప్రయాగ్‌రాజ్‌లో బస చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z