Business

వాహనదారులకు మారుతీ సుజుకీ షాక్-వాణిజ్య వార్తలు

వాహనదారులకు మారుతీ సుజుకీ షాక్-వాణిజ్య వార్తలు

* వాహనదారులకు మారుతీ సుజుకీ షాక్

కొత్త ఏడాది కార్ల ధ‌ర‌ల‌కు రెక్కలొస్తున్నాయి. ముడిప‌దార్ధాల ధ‌ర‌ల పెరుగుద‌ల‌, ద్రవ్యోల్బ‌ణ ఒత్తిళ్ల పేరిట ఆటోమొబైల్ కంపెనీలు కొనుగోలుదారుల‌పై భారం మోపుతున్నాయి. ఇక‌ ప్ర‌ముఖ ఆటోమొబైల్ కంపెనీ మారుతి సుజుకి త‌న వాహ‌నాల ధ‌ర‌ల‌ను పెంచింది.ద్ర‌వ్యోల్బ‌ణం, ముడిప‌దార్ధాల ధ‌ర‌లు ఎగ‌బాక‌డంతో వాహ‌న మోడ‌ల్స్ అన్నింటి ధ‌ర‌ల‌ను స‌గ‌టున 0.45 శాతం పెంచింది. వాహ‌నాల పెంపు త‌క్ష‌ణం అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల‌కు స‌మాచారం అందించింది. వాహ‌నాల ధ‌ర‌ల పెంపు నిర్ణ‌యంతో స్టాక్ మార్కెట్‌లో మారుతి సుజుకి షేర్లు మంగ‌ళ‌వారం ప్రారంభ సెష‌న్‌లో దాదాపు 1.5 శాతం లాభ‌ప‌డ్డాయి.ఇక మ‌రో దేశీ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ సైతం ముడిప‌దార్ధాల ధ‌ర‌ల పెరుగుద‌ల‌తో త‌మ వాహ‌నాల ధ‌ర‌ల‌ను ఈ ఏడాది జ‌న‌వరిలో పెంచాయి. మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా, హోండా కార్స్ ఇండియా, ల‌గ్జీరీ కార్ల త‌యారీ కంపెనీ ఆడి సైతం ఈ నెల‌లో త‌మ కార్ల ధ‌ర‌ల‌ను పెంచుతున్న‌ట్టు ప్ర‌క‌టించాయి.

* ఓపెన్‌ఏఐ కీలక నిర్ణయం

సార్వత్రిక ఎన్నికల వేళ అమెరికాకు చెందిన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రీసెర్చి ఆర్గనైజేషన్‌, చాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్‌ఏఐ (OpenAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రచారంలో AIను అనుమతించబోమని స్పష్టంచేసింది. అలాగే ఎన్నికల్లో పాల్గొనే వ్యక్తుల డీప్‌ఫేక్‌లు, చాట్‌బాట్‌లను నిరోధించేందుకు కృషి చేస్తామని తన బ్లాగ్‌ పోస్ట్‌లో పేర్కొంది. 2024లో భారత్‌తో సహా అమెరికా, యూకేలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జనరేటివ్‌ ఏఐ ఆధారిత టెక్నాలజీలైన చాట్‌జీపీటీ, డాల్‌-ఇ వంటి వాటి పాలసీల్లో మార్పులు చేస్తున్నట్లు ఓపెన్‌ఏఐ పేర్కొంది. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికల ప్రక్రియలో జోక్యం ఉండకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓపెన్‌ఏఐ తెలిపింది.ప్రజాస్వామ్యంలో ఎన్నికల సమగ్రతను కాపాడటం ముఖ్యమని, అలాంటి ప్రక్రియను అపహాస్యం చేసేలా తమ సాంకేతికత ఉండకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓపెన్‌ఏఐ తెలిపింది. తప్పుదోవ పట్టించే డీప్‌ఫేక్‌లు, అభ్యర్థులను అనుకరించే చాట్‌బాట్‌లు దుర్వినియోగం అవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఓపెన్‌ఏఐ తెలిపింది. ఏదైనా కొత్త సిస్టమ్స్‌ను విడుదల చేసే ముందు అభిప్రాయ స్వీకరణ చేపట్టి దానివల్ల హానికి అవకాశం ఉంటే దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తామని తెలిపింది.ఇమేజ్‌లను జనరేట్‌ చేసే డాల్‌-ఇలో (Dall-e) ఒకవేళ అభ్యర్థులు సహా ఎవరైనా వ్యక్తుల ఇమేజ్‌ జనరేషన్‌ కోసం అడిగితే అలాంటి రిక్వెస్టులను ఆయా టూల్స్‌ తిరస్కరిస్తాయని ఓపెన్‌ఏఐ పేర్కొంది. రాజకీయ ప్రచారం, లాబీయింగ్‌ల కోసం అప్లికేషన్లు రూపొందించేందుకు తమ వేదికలను అనుమతించబోమని స్పష్టంచేసింది. వ్యక్తులు, సంస్థల పేరుతో చాట్‌బాట్‌లు రూపొందించడానికి అనుమతించబోమని తెలిపింది. సమాచారంలో పారదర్శకత కోసం చాట్‌జీపీటీలో ఇప్పటికే ఉన్న సమాచార వనరులతో పాటు యూజర్లు అట్రిబ్యూషన్, లింకులతో కూడిన రియల్‌టైమ్‌ వార్తలను అందుకుంటారని ఓపెన్‌ఏఐ వెల్లడించింది.

* ఇక కేవైసీ సమర్పిస్తేనే ఫాస్టాగ్

జాతీయ రహదారులపై కార్లతో ప్రయాణించే వారు టోల్ గేట్ల వద్ద టోల్ ఫీజు చెల్లించాలి.. టోల్ ఫీజు చెల్లింపులు వేగవంతం చేయడానికి ఆన్ లైన్ పేమెంట్స్ కోసం ‘ఫాస్టాగ్’ విధానాన్ని కేంద్రం తీసుకొచ్చింది. అయితే సదరు ఫాస్టాగ్’ల నిర్వహణపై నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) కీలక నిర్ణయం తీసుకున్నది. వాహనదారులు తమ బ్యాంకుల్లో ఫాస్టాగ్’లకు కేవైసీ సమర్పించకుంటే వాటిని డీయాక్టివేట్ చేస్తామని తెలిపింది. దీనికి ఈ నెల 31వ తేదీ తుది గడువుగా నిర్దేశించింది. మీరు మీ ‘ఫాస్టాగ్’ స్టేటస్ ఏమిటో తెలుసుకునేందుకు ఏంచేయాలో తెలుసుకుందాం..!మీ ఫాస్టాగ్’ స్టేటస్ తెలుసుకోవడానికి ఫాస్టాగ్ వెబ్‌సైట్‌https://fastag/ihml.com లోకి వెళ్లి మీ మొబైల్ నంబర్, అటుపై పాస్ వర్డ్ లేదా ఓటీపీ నమోదు చేసి లాగిన్ కావాలి. అటుపై డాష్ బోర్డులోకి వెళ్లి ‘మై ప్రొఫైల్ ఆప్షన్’ ఎంచుకుంటే.. మీ కేవైసీ స్టేటస్ వివరాలు కనిపిస్తాయి. మీ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకుంటే.. వెంటనే అందుకు అవసరమైన సమాచారం తెలుసుకుని అడిగిన డాక్యుమెంట్లు సమర్పించి ప్రాసెస్ పూర్తి చేస్తే మీ ఫాస్టాగ్ కేవైసీ పూర్తయినట్లే.టోల్ ఫీజు పేమెంట్ కోసం వాహనం విండో స్క్రీన్‌పై అతికించే ‘ఫాస్టాగ్’ స్టిక్కర్‌లను వివిధ బ్యాంకుల శాఖలు, దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై గల టోల్ ప్లాజాలు, ప్రాంతీయ రవాణా కార్యాలయాలు, కామన్ సర్వీస్ పాయింట్లు, ట్రాన్స్ పోర్ట్ హబ్‌లు, పెట్రోల్ బంక్‌ల వద్ద విక్రయిస్తారు. వీటిని కొనుగోలు చేయాలంటే వాహన యజమానులు తమ వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్‌సీ), తమ ఇంటి అడ్రస్, గుర్తింపు కార్డ్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో సమర్పించాలి.ఒక వాహనానికి ఒకటి కంటే ఎక్కువ ఫాస్టాగ్’లు, ఒకే ఫాస్టాగ్’ను ఒకటి కంటే ఎక్కువ వాహనాలకు వాడుతున్నట్లు ఎన్‌హెచ్ఏఐ గమనించింది. కొన్నిసార్లు సంబంధిత యజమానులు కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకుండానే ‘ఫాస్టాగ్’లు జారీ అవుతున్నట్లు గుర్తించింది. ఫాస్టాగ్ స్టిక్కర్లు తీసుకున్న వాహన యజమానులు.. వెహికల్ ముందు విండో స్క్రీన్‌పై కాక తమకు ఇష్టమొచ్చిన చోట అతికించడంతో టోల్ ప్లాజాల వద్ద వాటిని స్కాన్ చేయడంలో ఆలస్యమవుతున్నది. ఈ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు ‘ఒకే వాహనం – ఒకే ఫాస్టాగ్’ విధానాన్ని ఎన్‌హెచ్ఏఐ తీసుకొచ్చింది.

* అదరగొట్టిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

ప్రైవేటురంగ బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీ (HDFC Bank) త్రైమాసిక ఫలితాలను (Q3 results) మంగళవారం ప్రకటించింది. డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో స్టాండర్డ్‌లోన్‌ పద్ధతిన రూ.16,373 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.12,259 కోట్లతో పోలిస్తే 34 శాతం వృద్ధి నమోదైంది. బ్యాంకు మొత్తం ఆదాయం సైతం రూ.51,208 కోట్ల నుంచి రూ.81,720 కోట్లకు పెరిగింది.ఏకీకృత ప్రాతిపదికన బ్యాంకు లాభం 39 శాతం పెరిగి రూ.17,718 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ.1,15,015 కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.54,123 కోట్లుగా నమోదైంది. బ్యాంకు నికర వడ్డీ ఆదాయం (NII) 23.9 శాతం పెరిగి రూ.28,470 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో వడ్డీ ఆదాయం రూ.22,990 కోట్లుగా ఉంది. స్థూల నిరర్ధక ఆస్తులు (GNPA) 1.23 శాతం నుంచి 1.26 శాతానికి చేరగా.. నికర నిరర్ధక ఆస్తులు 0.33 శాతం నుంచి 0.31 శాతానికి తగ్గినట్లు బ్యాంక్‌ పేర్కొంది. బ్యాంక్‌ మొత్తం డిపాజిట్లు 27.7 శాతం పెరిగి 28.47 లక్షల కోట్లకు చేరినట్లు వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు బీఎస్‌ఈలో 0.42 శాతం పెరిగి రూ.1678.95 వద్ద ముగిశాయి.

* విమానాలపై పొగమంచు ఎఫెక్ట్

ఉత్తరాదిలో దట్టమైన పొగ మంచు కురుస్తుండటంతో దేశ రాజధాని ఢిల్లీ సహా పలు విమానాశ్రయాల పరిధిలో విమానాల రాకపోకలు జాప్యం అవుతున్నాయి. పొగ మంచు వల్ల విమానాల ఆలస్యం వల్ల తలెత్తే ఇబ్బందులను నివారించేందుకు విమానయాన సంస్థలకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్వోపీ) జారీ చేసింది. ఈ ‘ఎస్వోపీ’లను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం ట్వీట్ చేశారు.దేశంలోని ఆరు విమానాశ్రయాల పరిధిలో ఇబ్బందుల పరిష్కారానికి విమానయానశాఖ ‘వార్ రూమ్’లు ఏర్పాటు చేసింది. వీటి పరిధిలో విమానాల రాకపోకలపై మూడుసార్లు నివేదిక ఇవ్వాలని ఎయిర్ లైన్స్‌ను ఆదేశించింది. ఆ జాబితాలో దేశ రాజధాని ఢిల్లీతోపాటు ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా విమానాశ్రయాలు ఉన్నాయి.ప్రత్యేకించి ఢిల్లీ విమానాశ్రయ పరిధిలో దట్టమైన పొగ మంచు వల్ల విమాన సర్వీసుల షెడ్యూల్‌లో అంతరాయం ఏర్పడటంతో కేంద్ర పౌర విమానయాన శాఖ సోమవారం ఈ ‘ఎస్వోపీ’లను జారీ చేసి ఉండవచ్చునని భావిస్తున్నారు. విమానయానశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ పర్యవేక్షిస్తుందని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ట్వీట్ చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z