చెస్ (Chess) సంచలనం, యువ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద (R Praggnanandha) చరిత్ర సృష్టించాడు. తన కెరీర్‌లోనే తొలిసారి చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ (Viswanathan Anand)ను దాటి భారత టాప్ ర్యాంకర్‌గా అవతరించాడు. బుధవారం జరిగిన టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నమెంట్ నాలుగో రౌండ్‌లో ప్రపంచ ఛాంపియన్ డింగ్ లిరెన్ (చైనా)ను ఓడించడంతో ఈ ఘనత అందుకున్నాడు.
ప్రస్తుతం ఫిడే ర్యాంకింగ్స్ ప్రకారం.. ప్రజ్ఞానంద 2748.3 పాయింట్లతో 11వ స్థానంలో ఉన్నాడు. విశ్వనాథన్ ఆనంద్ 2748 పాయింట్లతో 12 స్థానంలో కొనసాగుతున్నాడు. దీంతో భారత్ తరఫున టాప్ ప్లేయర్‌గా ఈ యువ గ్రాండ్‌మాస్టర్ అగ్రస్థానంలోకి ఎగబాకాడు. అంతేకాదు, విశ్వనాథన్ ఆనంద్ తర్వాత.. క్లాసికల్ చెస్ విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌ను ఓడించిన రెండో భారతీయుడిగా నిలిచాడు.
భారత నంబర్ వన్ ప్లేయర్‌గా ప్రజ్ఞానంద అవతరించడంపై అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ప్రశంసలు కురిపించారు. ‘‘అద్భుతమైన క్షణాలు. ప్రపంచ ఛాంపియన్‌ను ఓడించి ఈ ఘనత అందుకున్నావు. నిన్ను చూసి ఈ దేశం గర్వపడుతోంది’’ అని అభినందించారు. ప్రజ్ఞానందకు ఆర్థికంగా అండగా ఉంటామని ఇటీవల అదానీ గ్రూప్ ప్రకటించింది.
గతేడాది జరిగిన చెస్ ప్రపంచకప్‌లో ప్రజ్ఞానంద కొద్దిలో టైటిల్ కోల్పోయిన సంగతి తెలిసిందే. అయినా ఫైనల్‌లో దిగ్గజ ఆటగాడు కార్ల్‌సన్‌కు గట్టి పోటీనిచ్చి అందరి మనసులు గెల్చుకున్నాడు.
👉 – Please join our whatsapp channel here –