భారత గణతంత్ర వేడుకల (Republic Day Celebrations) నేపథ్యంలో దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ (Indira Gandhi International Airport) కార్యకలాపాలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. భద్రతా కారణాల దృష్ట్యా జనవరి 26 వరకు ఉదయం 10.20 గంటల నుంచి 12.45 మధ్య టేకాఫ్, ల్యాండింగ్‌ను తాత్కాలికంగా రద్దు చేసింది. ఈ మేరకు శుక్రవారం విమానయాన సంస్థలకు నోటీసులు జారీ చేసింది. భారత్ ఈ ఏడాది 75వ రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించుకుంటోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఆ దేశ నాయకుడు భారత్ గణతంత్ర వేడుకలకు ‘ముఖ్య అతిథి’గా హాజరుకావడం ఇది ఆరోసారి.
ఈ ఏడాది దిల్లీలోని కర్తవ్యపథ్‌లో నిర్వహించబోయే వేడుకలు ప్రత్యేకంగా నిలవనున్నాయి. తొలిసారిగా సరిహద్దు భద్రతా దళం( బీఎస్ఎఫ్) మహిళా సైనిక బృందం కవాతులో పాల్గోనుంది. మొత్తం 144 మంది బీఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుళ్లకు అసిస్టెంట్ కమాండెంట్ ర్యాంక్ అధికారిణి నేతృత్వం వహించనున్నారు. గణతంత్ర వేడుకల నేపథ్యంలో దేశ రాజధానిలో దిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే ఎలా ప్రతిస్పందించాలన్న దానిపై అక్షర్ధామ్ దేవాలయం సమీపంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 2,274 మంది ఎన్సీసీ క్యాడెట్లు ఈ వేడుకల్లో భాగం కానున్నారు
👉 – Please join our whatsapp channel here –