Sports

సింగిల్స్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్న తెలంగాణ అమ్మాయి

సింగిల్స్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్న తెలంగాణ అమ్మాయి

రెండుసార్లు జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ తన కెరీర్‌లో తొలి అంతర్జాతీయ సింగిల్స్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. శుక్రవారం ముగిసిన వరల్డ్‌ టేబుల్‌ టెన్నిస్‌ (డబ్ల్యూటీటీ) ఫీడర్‌ టోర్నీలో 25 ఏళ్ల శ్రీజ మహిళల సింగిల్స్‌ విభాగంలో చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో శ్రీజ 11–6, 18–16, 11–5తో ప్రపంచ 46వ ర్యాంకర్‌ లిలీ జాంగ్‌ (అమెరికా)పై గెలిచింది. విజేతగా నిలిచిన ప్రపంచ 94వ ర్యాంకర్‌ శ్రీజకు 650 డాలర్ల (రూ. 54 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 125 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

టైటిల్‌ గెలిచిన క్రమంలో శ్రీజ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 37వ ర్యాంకర్‌ అమీ వాంగ్‌ (అమెరికా)పై 11–9, 9–11, 11–1, 6–11, 11–9తో గెలుపొందడం విశేషం. ‘చాలా సంతోషంగా ఉన్నా. నా కష్టానికి తగ్గ ఫలితం లభించింది. అంతర్జాతీయస్థాయిలో నాకిదే తొలి టైటిల్‌. నాకంటే మెరుగైన ర్యాంక్‌ ఉన్న క్రీడాకారిణులను ఓడించి విజేతగా నిలిచినందుకు ఆనందంగా ఉంది’ అని రిజర్వ్‌ బ్యాంక్‌ ఇండియా (ఆర్‌బీఐ)లో అసిస్టెంట్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీజ వ్యాఖ్యానించింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z