Politics

కళాకారులకు గుర్తింపు కార్డులను అందజేసిన రోజా

కళాకారులకు గుర్తింపు కార్డులను అందజేసిన రోజా

విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కళాకారుల గుర్తింపు కార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఇతర నేతలు, కళాకారులు పాల్గొన్నారు. కళాకారులకు గుర్తింపు కార్డులను మంత్రి రోజా అందజేశారు. అనంతరం కళాకారులతో కలిసి మంత్రి రోజా డప్పు వాయించారు. రాష్ట్రం విడిపోయాక కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వలేదని.. గుర్తింపు కార్డులు లేక కళాకారులు చాలా ఇబ్బందులు పడ్డారని మంత్రి రోజా వెల్లడించారు. కళాకారుల డేటా తీసుకోకపోవడం వల్ల కళాకారులకు న్యాయం జరగలేదన్నారు. కళాకారులు గుర్తింపు కోసం తాపత్రయ పడతారని.. కళాకారులకు అండగా నిలబడాలని జగన్మోహన్ రెడ్డి భావించారని మంత్రి తెలిపారు. అందుకే తనకు మంత్రిగా అవకాశం కల్పించారని.. సాంస్కృతిక సంబరాల ద్వారా కళాకారులను గుర్తించామన్నారు. ధైర్యంగా మేం కార్డుల ప్రదానోత్సవం చేయగలుగుతున్నామన్నారు.

సాంస్కృతిక సంబరాల్లో గుర్తించిన కళాకారులకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకున్నామని ఆమె పేర్కొన్నారు. మారుమూల కళాకారులను సైతం గుర్తించి వారికి గుర్తింపు కార్డులు అందజేస్తున్నామన్నారు. గతంలో కళాకారులను ఎవరూ పట్టించుకోలేదని.. జగనన్న మాత్రమే కళాకారులను పట్టించుకున్నారన్నారు. కళాకారులు ఈ విషయాన్ని గుర్తించాలన్నారు. ఎన్నికల సమయంలో దొంగలంతా ఒకటవుతున్నారని.. పందుల్లా గుంపులుగా వస్తున్నారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. దొంగలకు, ఆ పందులకు బుద్ధి చెప్పాలంటే కళాకారుల ఆట…మాట..పాట కావాలన్నారు. ట్వంటీ ట్వంటీ ఫోర్ (2024) …జగనన్న వన్స్ మోర్ అంటూ మంత్రి రోజా నినాదం చేశారు.

చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి పోయాడని.. జనాన్ని దోచుకుని హైదరాబాద్‌లో ఆస్తులు దాచుకున్నాడని మంత్రి రోజా విమర్శించారు. మళ్లీ ఆ దొంగలొస్తే ప్రజలకు విద్య,వైద్యం,కళాకారులకు అన్నం దొరకదన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చి విషం చిమ్మి పోతున్నారని.. నాన్ లోకల్ పొలిటీషయన్ల గురించి పట్టించుకోవద్దని మంత్రి రోజా అన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z