Movies

సలార్‌ 3 ప్లాన్స్‌ ఉన్నాయా?

సలార్‌ 3 ప్లాన్స్‌ ఉన్నాయా?

ప్రభాస్‌ (Prabhas) హీరోగా ప్రశాంత్‌ నీల్‌ (Prasanth Neel) తెరకెక్కించిన చిత్రం ‘సలార్‌’ (Salaar). శ్రుతిహాసన్‌ (Shruti Haasan) కథానాయిక. గత నెలలో విడుదలైన ‘సలార్‌ పార్ట్‌ 1.. సీజ్‌ఫైర్‌’ బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకుంది. దీనికి సీక్వెల్‌గా రానున్న ‘సలార్‌ శౌర్యాంగపర్వం’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నటుడు అఖిల్‌ అక్కినేని ఇందులో అతిథి పాత్రలో కనిపించనున్నారంటూ నెట్టింట ప్రచారం జోరందుకుంది. దీనిపై ప్రశాంత్‌ నీల్‌ సతీమణి లిఖితా రెడ్డి తాజాగా స్పందించారు. అవన్నీ పూర్తిగా వదంతులు మాత్రమేనని, అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ‘సలార్‌ పార్ట్‌ 2’ను ఉద్దేశించి ఇన్‌స్టా వేదికగా పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె బదులిచ్చారిలా..

దేవా తండ్రి పాత్ర ఎవరు పోషిస్తున్నారు?

లిఖిత: శౌర్యాంగపర్వంలో ధార (దేవ తండ్రి పేరు) పాత్రను చూసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నా.

‘సలార్‌’ గ్లింప్స్‌లో చూపించిన జురాసిక్‌ పార్క్‌ డైలాగ్‌ గురించి ఏమైనా చెప్పగలరా?

లిఖిత: శౌర్యాంగపర్వం విడుదలయ్యాకే ఆ డైలాగ్‌ కరెక్టా? కాదా? అనేది తెలుస్తుంది.

తన తండ్రిని రాజమన్నార్‌ చంపాడనే విషయం దేవాకు తెలుసా?

లిఖిత: మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

పండిట్‌ రోల్‌ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని ఉంది?

లిఖిత: ‘సలార్‌ సీజ్‌ఫైర్‌’లో కొంతమాత్రమే రివీల్‌ చేశాం.

దేవా, వరద శత్రువులుగా మారడానికి ప్రధాన కారణం ఏమిటి?

లిఖిత: మీరు ఏం అనుకుంటున్నారు?

శౌర్యాంగపర్వానికి సంబంధించి ఏదైనా పార్ట్‌ షూట్‌ చేశారా?

లిఖిత: డైనోసార్‌….

దేవా శౌర్యాంగలకు చెందినవాడని తెలిసినా వరద అతడిని ఎందుకు చంపలేదు. తిరిగి ఖాన్సార్‌కు ఎందుకు తీసుకువచ్చాడు?

లిఖిత: అన్నింటికంటే స్నేహం గొప్పది.

ఖాన్సార్‌ సింహాసనంపై కూర్చొనే అర్హత తనకే ఉందని దేవాకు తెలుసా?

లిఖిత: ఈ సమాధానం కోసమే అందరూ ఎదురుచూస్తున్నారు. నేను కూడా.

దేవా, రాధారమతో ఆద్యకు ఉన్న సంబంధం ఏమిటి? రాధారమ.. ఆద్య తండ్రిపై పగ పెంచుకోవడానికి కారణం ఏమిటి?

లిఖిత: నువ్వు అడిగిన ఈ ప్రశ్నకు బదులివ్వాలంటే ‘శౌర్యాంగపర్వం’ స్క్రిప్ట్‌ను నేను దొంగిలించాలి.

సీజ్‌ఫైర్‌లో మాస్‌ సాంగ్‌ మిస్‌ అయ్యాం. పార్ట్‌ 2లో అయినా ఉంటుందా?

లిఖిత: తప్పకుండా!!

సలార్‌ 3 ప్లాన్స్‌ ఉన్నాయా?

లిఖిత: ‘శౌర్యాంగపర్వం’ క్లైమాక్స్‌లో దానికి సమాధానం దొరుకుతుంది.

(ప్రభాస్‌ పాత్రను ఉద్దేశించి) డైనోసార్‌ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే?

లిఖిత: కొన్ని తరాల పాటు మాట్లాడుకుంటారు.

దేవా చిన్నతనాన్ని చూపించినప్పుడు.. వాళ్లమ్మ గర్భిణిగా ఉన్నట్టు చూపించారు. కాబట్టి దేవాకు తమ్ముడు ఉండొచ్చు..!

లిఖిత: నేను దీనిని గుర్తించలేదు.

‘సలార్‌ సీజ్‌ఫైర్‌’ క్లైమాక్స్‌లో ప్రభాస్‌ శరీరం పచ్చరంగులోకి మారడానికి కారణం ఏమిటి?

లిఖిత: శౌర్యాంగల తెగ రంగు అది. అందుకే దేవ ఎక్కువగా ఆ రంగు దుస్తుల్లో కనిపిస్తాడు.

దేవాకు డైలాగ్స్‌ ఎక్కువగా లేవెందుకు?

లిఖిత: అతని నీడే మిలియన్‌ డైలాగ్స్‌కు సమానం కాబట్టి.

సీల్‌ను సృష్టించింది సలారే అయినప్పుడు 2017 నుంచి అతడు ఖాన్సార్‌లో లేకపోవడానికి కారణం ఏమిటి?

లిఖిత: దేవా దానిని సృష్టించాడు. ఖాన్సార్‌ వదిలి వేర్వేరు ప్రాంతాలకు వాళ్లు వలస వెళ్లడానికి కారణం ఏమిటనే దానికి తదుపరి పార్ట్‌లో సమాధానం దొరుకుతుంది.

దేవా – వరదల మధ్య ఏదైనా ఫైట్‌ ఆశించవచ్చా?

లిఖిత: ఒక్కసారి ఊహించుకో..!

దేవాని చూసి ఓబులమ్మ ఎందుకంత భయపడింది?

లిఖిత: దీనికి సమాధానం తెలిసినప్పుడు మనం కూడా అదే విధంగా భయపడతామని నేను అనుకుంటున్నా.

బాహుబలి 2’లో రాజమౌళి అతిథి పాత్రలో కనిపించినట్టు ‘సలార్‌ పార్ట్‌ 2’లో ప్రశాంత్‌ని ఆశించవచ్చా?

లిఖిత: ఆయన నీడ కూడా కనిపించదు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z