Business

జీ-సొనీ డీల్ లేనట్లే-వాణిజ్య వార్తలు

జీ-సొనీ డీల్ లేనట్లే-వాణిజ్య వార్తలు

* నగదు రహిత చెల్లింపుల్లో అమెరికాను భారత్‌ అధిగమించిందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ (S.Jaishankar) అన్నారు. మన దేశంలో ఒక నెలలో చేసిన డిజిటల్‌ చెల్లింపులు అమెరికాలో మూడేళ్లలో జరుగుతాయని తెలిపారు. నైజీరియా పర్యటనలో ఉన్న ఆయన అక్కడి ప్రవాస భారతీయులు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత ఆర్థిక వ్యవస్థ, కరోనా వ్యాక్సిన్‌ తయారీ, సరఫరా గురించి మాట్లాడారు.

* జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌తో కుదిరిన విలీన ఒప్పందాన్ని (Zee-Sony Merger) కల్వర్‌ మ్యాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ (ఇంతకుముందు సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియా) రద్దు చేసుకుంది. ఈ విలీన ప్రక్రియ పూర్తికి పొడిగించిన గడువు 2024 జనవరి 21తో ముగిసింది. ఆలోపు ఇరుపక్షాలు ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. దీంతో 10 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.83,000 కోట్ల) విలువైన విలీన ప్రణాళిక కథ ముగిసింది.

* ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC) కొత్త పాలసీని తీసుకొచ్చింది. ‘జీవన్‌ ధారా 2’ (ప్లాన్‌ నంబర్‌. 872) పేరుతో పెన్షన్‌ ప్లాన్‌ను లాంచ్‌ చేసింది. ఇది నాన్ లింక్డ్‌, నాన్‌ పార్టిసిపేటింగ్‌, వ్యక్తిగత, పొదుపు, డిఫర్డ్‌ యాన్యుటీ ప్లాన్‌. జనవరి 22 నుంచి ఈ పాలసీ విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ మోడ్‌లో కొనుగోలు చేయొచ్చు. మొత్తం 11 ఆప్షన్లలో వస్తోంది. డిఫర్‌మెంట్‌ పీరియడ్‌లో బీమా కవరేజీ ఉంటుంది. రెగ్యులర్‌ లేదా సింగిల్‌ ప్రీమియం ఆప్షన్‌ ఎంచుకోవచ్చు. జీవనధారా-2 అనేది పెన్షన్‌ పథకం. మలి దశలో పెన్షన్‌ కోరుకునే వారు ఈ పథకాన్ని ఎంచుకోవచ్చు. ఎక్కువ మొత్తంలో పెన్షన్‌ కావాలంటే ఎక్కువ యాన్యుటీని కొనుగోలు చేయాలి. జీవన్‌ ధారా-2 పాలసీ రెగ్యులర్‌, సింగిల్‌ ప్రీమియం (ఒకేసారి చెల్లించాలి) ఆప్షన్లలో వస్తోంది. సింగిల్‌ లైఫ్‌తో పాటు జాయింట్‌ లైఫ్‌ యాన్యుటీ కవరేజీ (ఇద్దరి పేరిట) ఆప్షన్ కూడా ఉంది. ఈ పాలసీలో చేరేందుకు కనీస వయసును 20 ఏళ్లుగా నిర్ణయించారు. యాన్యుటీ ఆప్షన్‌ను బట్టి గరిష్ఠ వయసు ఉంటుంది. ఏడాది నుంచి 15 ఏళ్ల డిఫర్‌మెంట్‌ పీరియడ్‌ ఉంటుంది. సింగిల్‌ ప్రీమియం, నెలవారీ, మూడు నెలలకోసారి, ఆరు నెలలకోసారి, వార్షిక పద్ధతిలో ప్రీమియం చెల్లించొచ్చు. యాన్యుటీని నెలకోసారి, మూడు నెలలు, ఆరు నెలలు, వార్షిక పద్ధతిలో పొందొచ్చు.

* ఆయన పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అధికారి. ఆకర్షణీయ వేతనం కూడా వస్తుంది. కానీ, లాభార్జనపైన ద్రుష్టి పడింది. అందుకోసం బ్యాంక్ నిబంధనలను ఉల్లంఘించి మరీ డిపాజిటర్లు.. అందునా ఫిక్స్‌డ్ డిపాజిట్ల మనీ ట్రాన్స్‌ఫర్ చేసి చిక్కుల్లో పడ్డారు. ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతూ అందుకు అవసరమైన మనీ కోసం బ్యాంకులో కస్టమర్లు చేసిన ఫిక్స్‌డ్ డిపాజిట్లు బ్రేక్ చేసి ఆ మనీ వాడేశారు. అందుకోసం రూ.52 కోట్లకు పైగా డిపాజిట్లను దారి మళ్లించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. సదరు బ్యాంకు మాజీ అధికారి బెదాంశు శేఖర్ మిశ్రాపై హవాలా లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద కేసు నమోదు చేసింది. రూ.2.56 కోట్ల విలువైన స్థిరాస్తులు, ఫిక్స్‌డ్ డిపాజిట్లను జప్తు చేసింది. 2021-22లో వెలుగు చూసిన ఈ ఫ్రాడ్‌పై తొలుత కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది.

* వినియోగదారులకు మెరుగైన ఫీచర్లు అందించడంలో భాగంగా వాట్సాప్‌ (WhatsApp) ఎప్పటికప్పుడు కొత్త వాటిని పరిచయం చేస్తుంది. గతేడాది హెచ్‌డీ క్వాలిటీ ఫొటోలు/వీడియోలను ఇతరులకు పంపేందుకు వీలుగా 2జీబీ ఫైల్‌ షేరింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీనికి సంబంధించి కొత్తగా మరో ఫీచర్‌ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ ‘నియర్‌బై షేర్‌’, ఐఓఎస్‌ ‘ఎయిర్‌ డ్రాప్‌’ తరహాలో ఇది పనిచేస్తుంది. దీంతో పక్కనే ఉన్నవారికి ఇంటర్నెట్‌ అవసరం లేకుండా ఫైల్స్‌ బదిలీ చేయొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ పరీక్షల దశలో ఉన్నట్లు వాట్సాప్‌ కమ్యూనిటీ బ్లాగ్‌ వాబీటా ఇన్ఫో (Wabeta Info) వెల్లడించింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z