500 ఏళ్ల నిరీక్షణ తర్వాత జరిగిన బాల రాముడి ప్రాణ ప్రతిష్ట మహొత్సవం పురస్కరించుకుని చిన్మయ మిషన్ పిట్స్‌బర్గ్ రామనామంతో మారుమ్రోగిపోయింది. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని చిన్మయ మిషన్ పిట్స్‌బర్గ్ జనవరి 21న పెద్ద ఎత్తున కార్లతో ఊరేగింపు నిర్వహించింది, ఆ తర్వాత లోకక్షేమం కోసం శ్రీ సీతా రామ కల్యాణం కూడా నిర్వహించింది. ఈ కారు యాత్ర చిన్మయ అమర్‌నాథ్ శివాలయం నుంచి 30 మైళ్ల దూరంలో ఉన్న చిన్మయ హనుమాన్ దేవాలయం వరకు సాగింది. అందుకోసం సుమారు 141 కార్లతో పెద్ద ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు చిన్నపిల్లలు, వృద్ధ తల్లిదండ్రులతో సహా కుటుంబాలు చలిని సైతం లెక్కచేయకుండా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. రామ నామాన్ని జపిస్తే -10 డిగ్రీల సెల్సియస్ చలి కూడా ఏం చేయలేదని ఈ కారు యాత్ర మనకు అవగతమయ్యేలా చేసింది. పుణ్యభూమి అయోధ్యతో పాటు పిట్స్‌బర్గ్ కూడా భక్తుల రామ భక్తితో మరో అయోధ్యగా మారింది. ఎక్కడ చూసినా “జై శ్రీరామ్” అనే భక్తి నినాదాలు ఆకాశంలో ప్రతిధ్వనించాయి. కారు ఊరేగింపు అనంతరం చిన్మయ సంజీవిని హనుమాన్ దేవాలయంలో లోక క్షేమం కోసం అని శ్రీ సీతా రామ కల్యాణ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించింది చిన్మయ మిషన్ పిట్స్‌బర్గ్. అలాగే మహా ప్రసాద వితరణతో ఈ ఉత్సవం ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వాలంటీర్స్‌కి , భక్తులకి సదరు ఆలయ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియచేశారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z