మట్టి నల్లగా ఉంటేనేం? ఎర్రగా ఉంటేనేం? అందులో గొప్పేముందని అనుకుంటున్నారా? అమెజాన్ అడుగున ఉండే నల్లమట్టి తీరే వేరు. ఇది అంతటా పరచుకున్నది కాదు. అక్కడక్కడా నిక్షిప్తమై ఉంటుంది. దీన్నే అమెజానియన్ డార్క్ ఎర్త్ (ఏడీఈ) అంటారు. బ్లాక్ గోల్డ్.. అంటే నల్ల బంగారం అనీ పిలుచుకుంటారు. దీనికి టెరాపెట్రా అని మరో పేరు కూడా ఉంది. దీని ప్రత్యేకతేంటంటే- అత్యంత సారవంతమైంది కావటం. క్షీణిస్తున్న కర్బన పదార్థంతో పాటు పంటలు ఏపుగా ఎదగటానికి అవసరమైన నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు దండిగా నిండి ఉన్న మట్టి. ప్రాచీన మానవులు ఆవాసాలు ఏర్పరచుకోవటానికి ప్రయత్నిస్తున్న కాలాలకు చెందిన మట్టి. ఇది సహజంగా ఏర్పడిందేమీ కాదు. మానవుల కృషి ఫలితం. దీని తయారీ విధానాన్ని తెలుసుకుంటే ఇప్పటికీ ఉపయోగపడుతుంది. వాతావరణ మార్పును ఎదుర్కోవటానికి, పంటల దిగుబడిని పెంచుకోవటానికి తోడ్పడుతుంది. అందుకే దీనిపై శాస్త్రవేత్తలకు అంత ఆసక్తి.
అమెజాన్ మీద అధ్యయనాలు చేస్తున్నకొద్దీ కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. అక్కడ సహజంగా పెరిగిన చెట్ల కన్నా పెంచిన చెట్ల సంఖ్య ఐదు రెట్లు ఎక్కువని 2017లోనే శాస్త్రవేత్తలు గుర్తించారు. అవి పురాతన ఆవాసాలకు సమీపంలో ఉంటున్నట్టూ తేలింది. అమెజాన్ స్థానిక సమాజాలు చాలావరకూ కనుమరుగు అయినప్పటికీ వారి వ్యవసాయ విధానాలు అడవుల వృద్ధికి తోడ్పడ్డాయి. ఇందులో నల్ల మట్టీ కీలక పాత్ర పోషించిందని భావిస్తున్నారు. సుమారు 12.5 అడుగుల మందంతో కూడిన ఈ మట్టి పొరలు అమెజాన్ అంతటా విస్తృతంగా వ్యాపించి ఉన్నాయి. బూడిద, పెంకులు, ఎముక, నత్తగుల్లల వంటి అకర్బన పదార్థాలతో పాటు ఆహార వ్యర్థాలు, మలం, మూత్రం వంటి సేంద్రియ పదార్థాలతోనూ ఇవి ఏర్పడ్డాయి. ఇవన్నీ పురాతన కాలం నాటి వ్యర్థాలు కావటం శాస్త్రవేత్తలకు ఆసక్తి కలిగిస్తోంది. ఇది వర్షాధార అడవి వృద్ధి చెందటానికే కాకుండా పంటలకు ఎరువుగానూ ఉపయోగపడింది. ఇప్పటికీ స్థానిక సముదాయాలు దీన్ని వాడుతుండటం గమనార్హం.
అమెజాన్ నల్ల మట్టి 1870లోనే పాశ్చాత్యదేశాలను ఆకర్షించింది. చుట్టుపక్కల ఎర్రమట్టికి భిన్నంగా అక్కడక్కడా నల్ల మట్టి పొరలున్నట్టు చాలామంది శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఇవి యాదృచ్ఛికంగా ఏర్పడ్డాయా? ఉద్దేశపూర్వకంగా నిర్మించారా? అనేది అంతు చిక్కలేదు. చివరికి గత సంవత్సరం దీని గుట్టును ఛేదించారు. నేలను పరిశీలించి, స్థానికుల అభిప్రాయాలను సేకరించి ఈ మట్టిదిబ్బలను కావాలనే రూపొందించినవిగా తేల్చారు. వీటిల్లో కొన్ని 5వేల ఏళ్ల క్రితం నాటివైతే.. మరికొన్ని 4వేల ఏళ్ల క్రితం తయారైనవీ ఉన్నాయి.
వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరుగా ఉన్నప్పటికీ నల్ల మట్టి పొరలను సృష్టించే విధానం చాలావరకు ఒకేలా కనిపిస్తోంది. అడుగున ఆహార వ్యర్థాలు, దాని మీద మలం, ఆపైన కర్రబొగ్గు పరచి ఉంటుంది. వ్యర్థాలన్నీ కుళ్లిపోయి సారవంతమైన మట్టిగా ఏర్పడటం ఒక ఎత్తయితే.. కార్బన్‌ను పీల్చుకునే విధంగా రూపొందటం మరో ఎత్తు. చుట్టుపక్కల మట్టితో పోలిస్తే ఈ పొర 7.5 రెట్లు ఎక్కువగా కార్బన్‌ను సంగ్రహిస్తుంది. మట్టి పోగుపడుతున్నకొద్దీ కార్బన్ లోపలే ఉండిపోతుంది. వందలాది ఏళ్లుగా అలాగే స్థిరంగా ఉంటుంది. దీనికి కారణం- సేంద్రీయ పదార్థాలతో ఏర్పడే బ్లాక్ కార్బన్ అయ్యిండొచ్చని భావిస్తున్నారు. ఆక్సిజన్ తక్కువగా ఉన్న పరిస్థితుల్లో అత్యధిక ఉష్ణోగ్రత వద్ద సేంద్రియ పదార్థాలు శుద్ధ కార్బన్‌గా మారతాయి. ఈ ప్రక్రియలో కార్బన్ పెద్దగా బయటకు వెలువడదు. కానీ అది సన్నటి పొడిలా మారుతుంది. అమెజాన్ నల్లమట్టిలో ఉండేది ఇదే. ఇప్పుడు ఈ పద్ధతితోనే మట్టిని సారవంతం చేయటానికి, అదే సమయంలో వాతావరణ మార్పును ఎదుర్కోవటానికి కొన్ని కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. దీని స్ఫూర్తితోనే కార్బన్ గోల్డ్ అనే కంపెనీ బయోచార్‌ను ఉత్పత్తి చేస్తోంది. దీన్ని మొక్కల పెంపకానికి సేంద్రీయ పదార్థంగా వాడుకోవచ్చు. బయోచార్ కార్బన్‌ను పట్టి ఉంచటంతో పాటు మట్టిలాగా మొక్కలకు దన్నుగా నిలుస్తుంది. నీటిని ఎక్కువసేపు పట్టి ఉంచుతుంది. పోషకాలు కోల్పోకుండా కాపాడుతుంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z