Business

తిరిగి భారత్ మార్కెట్లోకి వస్తున్న ఫోర్డ్

తిరిగి భారత్ మార్కెట్లోకి వస్తున్న ఫోర్డ్

రెండేండ్ల క్రితం భారత్‌లో కార్ల ఉత్పత్తిని నిలిపేసిన అమెరికా కార్ల తయారీ సంస్థ ‘ఫోర్డ్ మోటార్’ తన నిర్ణయాన్ని పున: పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. త్వరలో భారత్‌లో కార్ల తయారీ ప్రారంభించడానికి సిద్ధమవుతున్నదని వార్తాకథనాలు వచ్చాయి. రెండేండ్ల క్రితం భారత్‌లో కార్ల ఉత్పత్తి నిలిపేసిన ఫోర్డ్ మోటార్.. చెన్నై సమీప మారైమలే నగర్‌లోని ప్రొడక్షన్ యూనిట్ విక్రయానికి పలు ఆటోమొబైల్ సంస్థలతో సంప్రదింపులు నిర్వహించింది. కానీ, చెన్నై ప్లాంట్ విక్రయించాలన్న ఆలోచన నుంచి ఫోర్డ్ మోటార్ వెనక్కు తగ్గినట్లు తెలిసింది. ఆ ప్లాంట్ విక్రయానికంటే తిరిగి కార్ల ఉత్పత్తి ప్రారంభించడం మేలనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. భారత్‌లో ప్రస్తుతం ఎస్‌యూవీ కార్లకు బోల్డు గిరాకీ ఉంది. రీ ఎంట్రీలో భాగంగా భారత్ మార్కెట్లో తన ప్రీమియం ఎస్‌యూవీ థర్డ్ జనరేషన్ ‘ఎండీవర్ (Ford Endeavour)` ఆవిష్కరించాలని ఫోర్డ్ మోటార్ యోచిస్తున్నట్లు సమాచారం. భారత్ మార్కెట్లో సీబీయూ / సీకేడీ మోడల్ కార్లను విక్రయిస్తుందని భావిస్తున్నారు. గ్లోబల్ మార్కెట్లో విస్తరణకు చెన్నై ప్రొడక్షన్ యూనిట్‌లో ఎలక్ట్రిక్ కార్ల తయారీ ప్రణాళికను ఉపసంహరించుకున్నది. అయితే ఇటీవల ఫోర్డ్ మోటార్ సీఓఓగా భారత్ సంతతికి చెందిన కుమార్ గల్హోత్రా బాధ్యతలను స్వీకరించడంతో ఆ కంపెనీ భారత్ మార్కెట్లోకి రీ ఎంట్రీ చేయనున్నదన్న చర్చలు, ఊహాగానాలు ప్రారంభం అయ్యాయి. 1996లో భారత్‌లో తన ఎస్కార్ట్ కారుతో కార్ల ఉత్పత్తి, విక్రయాలు ప్రారంభించింది ఫోర్డ్ మోటార్ ఇండియా. అటుపై ఐకాన్, ఫిగో, ఎకో స్పోర్ట్, ఎండీవర్ మోడల్ కార్లను ఆవిష్కరించింది. తమిళనాడు రాజధాని చెన్నై, గుజరాత్ రాష్ట్రాల్లో ఫోర్డ్ మోటార్’కు ప్రొడక్షన్ యూనిట్లు ఉన్నాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z