DailyDose

మైలవరం లకిరెడ్డి కళాశాలలో విద్యార్థిని మృతి-నేరవార్తలు

మైలవరం లకిరెడ్డి కళాశాలలో విద్యార్థిని మృతి-నేరవార్తలు

* రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పరిధి బాబుల్‌రెడ్డి నగర్‌లో జంట హత్యలు కలకలం రేపాయి. మద్యానికి బానిసై వేధిస్తోన్న తండ్రిని, అడ్డుకునేందుకు ప్రయత్నించిన బంధువుని ఓ యువకుడు దారుణంగా హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాబుల్‌రెడ్డి నగర్‌కు చెందిన లక్ష్మీనారాయణ.. మద్యానికి బానిసై నిత్యం భార్య, పిల్లలను వేధించేవాడు. కొన్ని రోజుల క్రితం వారు నివసిస్తున్న ఇంటిని అమ్మకానికి పెట్టారు. ఇల్లు అమ్మితే వచ్చే నగదులో రూ.20 లక్షలు తనకు ఇవ్వాలని భార్యతో శనివారం సాయంత్రం గొడవకు దిగాడు. ఇందుకు ఆమె అంగీకరించకపోవడంతో దాడి చేశాడు. తల్లిని కొడుతుండగా ఆపేందుకు ప్రయత్నించిన కుమారుడు రాకేశ్‌పైనా లక్ష్మీనారాయణ దాడికి దిగాడు. డబ్బు కోసం అమ్మను కొడతావా అంటూ.. తండ్రిని ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చి రాడ్డుతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన లక్ష్మీనారాయణకు సాయం చేసేందుకు వచ్చిన బంధువుపైనా నిందితుడు దాడి చేశాడు. ఈ ఘటనలో లక్ష్మీనారాయణ అక్కడికక్కడే చనిపోగా, చికిత్స పొందుతూ మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. తన తండ్రి నిత్యం మద్యం సేవించి వేధించేవాడని కుమార్తె ఆమని తెలిపింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు రాకేశ్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

* ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడయ్యాయి. బాలకృష్ణ ఇల్లు సహా 18 చోట్ల ఏసీబీ ఇటీవల సోదాలు చేసి భారీగా స్థిర, చరాస్తులకు సంబంధించిన దస్త్రాలను గుర్తించింది. బాలకృష్ణ ఇంట్లో స్వాధీనం చేసుకున్న 50 స్థిర, చరాస్తులకు సంబంధించిన పత్రాలను పరిశీలించగా.. వాటి విలువ దాదాపు రూ.5 కోట్లు ఉంటుందని అంచనా. వాటితోపాటు సోదాల్లో రూ.99 లక్షల నగదు, నాలుగు కార్లు, రూ.8.26 కోట్ల విలువైన బంగారం, వెండి, వాచ్‌లు, ఫోన్లు, గృహోపకరణాలను సీజ్‌ చేసినట్లు రిమాండ్‌ రిపోర్టులో అధికారులు పేర్కొన్నారు.

* ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం మండలంలోని లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బీటెక్‌ విద్యార్థిని రోషిణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. శనివారం ఉదయం కళాశాల వసతి గృహంలో ఉరి వేసుకుని కనిపించడంతో.. మిగతా విద్యార్థినులు వార్డెన్‌కు సమాచారం అందించారు. చందర్లపాడుకు చెందిన రోషిణి రెండో సంవత్సరం ECE చదువుతోంది. విద్యార్థిని మృతిపై తల్లిదండ్రులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అప్పటికే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. తమ కుమార్తె మరణానికి కారణాలు చెప్పాలంటూ అడ్డుపడ్డారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు తన సోదరుడితో సంభాషించినట్లు తోటి విద్యార్థులు పోలీసులకు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు ఏసీపీ రమేశ్‌, సీఐ కృష్ణ కిశోర్ వెల్లడించారు.

* హైద‌రాబాద్ న‌గ‌రంలో విచ్చ‌ల‌విడిగా గంజాయి స‌ర‌ఫ‌రా చేస్తున్నట్లు పోలీసుల‌కు ప‌క్కా స‌మాచారం అందింది. దీంతో మ‌ల్కాజ్‌గిరి ఎస్‌వోటీ, చౌటుప్ప‌ల్ పోలీసులు త‌నిఖీలు నిర్వ‌హించారు. గంజాయి స‌ర‌ఫ‌రా చేస్తున్న అంత‌ర్ రాష్ట్ర ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. ఈ ముఠా నుంచి 64 కిలోల ఎండు గంజాయి, 2 కార్లు, మూడు ఫోన్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ. 32.30 ల‌క్ష‌లు ఉంటుంద‌ని పోలీసులు వెల్ల‌డించారు. అరెస్టు అయిన ముగ్గురు నిందితులు కేర‌ళ‌కు చెందిన‌వార‌ని పోలీసులు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z