* ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ ‘పేటీఎం’ (Paytm) మాతృ సంస్థ ‘వన్ 97 కమ్యూనికేషన్స్ (OCL)’ షేరు విలువ భారీగా పతనమైంది. గురువారం బీఎస్ఈ ఇంట్రాడేలో 19.99 శాతం నష్టపోయి రూ.609 దగ్గర ‘లోయర్ సర్క్యూట్’ను తాకింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విధించిన ఆంక్షల నేపథ్యంలోనే షేరు కుంగినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 29 తరువాత కస్టమర్ల నుంచి కొత్త క్రెడిట్ డిపాజిట్లు, ఫండ్ బదిలీలు, ప్రీ పెయిడ్ ఇన్స్ట్రుమెంట్, వ్యాలెట్, ఫాస్ట్ ట్యాగ్, నేషనల్ కామన్ మొబిలిటీ (ఎన్సీఎంసీ) కార్డుల్లో డిపాజిట్లు స్వీకరించకూడదని పేటీఎంను ఆర్బీఐ తాజాగా ఆదేశించిన విషయం తెలిసిందే. పేమెంట్స్ బ్యాంక్‌లో నిబంధనల ఉల్లంఘనను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ ప్రకటనలో తెలిపింది. దీనిపై పేటీఎం గురువారం స్పందించింది. ఆర్బీఐ ఆంక్షల వల్ల తమ వార్షిక కార్యకలాపాల లాభంపై రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్ల మేర ప్రభావం ఉంటుందని తెలిపింది. అయినప్పటికీ కంపెనీ లాభాల్ని మెరుగుపరిచేందుకు చేస్తున్న కృషి ఎప్పటిలానే కొనసాగుతుందని సంస్థ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.
* దేశవ్యాప్తంగా కోటి ఇళ్లు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును పొందేందుకు ప్రభుత్వం వీలు కల్పిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో (Union Budget 2024) పేర్కొన్నారు. ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకం కింద రూఫ్ టాప్ ప్యానెళ్లు ఏర్పాటు చేయడం ద్వారా దీనిని సాకారం చేస్తామని చెప్పారు. ఇందులో భాగంగా బడ్జెట్లో సౌర విద్యుత్తు రంగానికి రూ.7,327 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో కేటాయించిన రూ.4,979 కోట్ల కంటే దాదాపు 48 శాతం ఎక్కువ. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా ‘రూఫ్ టాప్ సోలార్’ పాలసీ వల్ల కలిగే ప్రయోజనాలను కేంద్ర మంత్రి సభకు వివరించారు. సాధారణ, మధ్య తరగతి కుటుంబాలు తమ ఇళ్లపై ఏర్పాటు చేసే సౌర ఫలకాల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్తును గృహావసరాలకు వినియోగించుకోవడమే కాకుండా, మిగిలిన విద్యుత్తును డిస్కంలకు విక్రయించుకునే వీలుందని సీతారామన్ చెప్పారు. తద్వారా ప్రతి కుటుంబం ఏడాదికి రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు ఆదాయాన్ని పొందొచ్చన్నారు. గత కొంతకాలంగా విద్యుత్తు వాహనాలకు గిరాకీ ఏర్పడటంతో సోలార్ పవర్‌తో ఛార్జింగ్ పెట్టేలా కొత్త స్టేషన్లు వస్తాయన్నారు. వాటి వల్ల ఉపాధి కల్పన జరుగుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఆత్మనిర్భర్ భారత్‌కు అనుగుణంగా ఆర్థిక వృద్ధిని సాధించేందుకు దోహదం చేస్తుందని సీతారామన్ అన్నారు.
* జర్మనీలో అతిపెద్ద లెండర్ డ్యుయిష్ బ్యాంక్ (Deutsche Bank) 3500 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించనున్నట్టు గురువారం ప్రకటించింది. 2023లో బ్యాంక్ లాభాలు పడిపోవడంతో వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా బ్యాంక్ కొలువుల కోతకు తెగబడింది. లాభాలు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 16 శాతం తగ్గడం, పునర్వ్యవస్ధీకరణ, పరిహార వ్యయాలు పెరగడం బ్యాంక్ లాభదాయకతపై ప్రభావం చూపింది. అయితే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధిక వడ్డీరేట్ల కారణంగా బ్యాంక్ రాబడులు మాత్రం ఆరు శాతం వృద్ధి కనబరిచాయి. అనిశ్చితి వాతావరణంలోనూ బ్యాంక్ మెరుగైన సామర్ధ్యం కనబరిచిందని డ్యుయిష్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ క్రిస్టియన్ సివింగ్ పేర్కొన్నారు. వ్యయ నియంత్రణ చర్యలకు కట్టుబడి క్రమశిక్షణతో ముందుకెళతామని చెప్పారు.
* ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2024-25 మధ్యంతర బడ్జెట్‌ను కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ మహీంద్ర ప్రశంసించారు. బడ్జెట్‌పై మనం ఎప్పుడూ అసహజ రీతిలో భారీ ఆశలు పెట్టుకుంటామని, భారీ విధాన మార్పులకు బడ్జెట్ ఒక్కటే వేదిక కాదని, ఇలాంటి మార్పులు ఏడాది పొడవునా ఇతర సందర్భాల్లోనూ ఉంటాయని ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. బడ్జెట్ చుట్టూ మనం డ్రామాను కరియేట్ చేస్తుంటామని, కీలక విధాన ప్రకటనలపై అంచనాలు పెంచుతుంటామని తాను చాలా ఏండ్లుగా చెబుతున్నానని ఆనంద్ మహీంద్ర గుర్తుచేశారు. బడ్జెట్లో చక్కటి ఆర్ధిక ప్రణాళికతో ముందుకెళుతున్నారని ప్రశంసలు గుప్పించారు. నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ఆనంద్ మహీంద్ర స్వాగతించారు.
* కేంద్ర ప్రభుత్వం చురుగ్గా చర్యలు చేపట్టడం వల్లే ద్రవ్యోల్బణం నియంత్రణ స్థాయికి దిగి వచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. గురువారం వచ్చే ఆర్థిక సంవత్సరా (2024-25) తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశ పెడుతూ ఈ సంగతి వెల్లడించారు. ద్రవ్యోల్బణం దిగి వచ్చిందని తెలిపారు. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని నియంత్రణ స్థాయి 4-2 శాతం మధ్యకు తీసుకు రావాలని ఆర్బీఐకి కేంద్ర ప్రభుత్వం దిశా నిర్దేశం చేసిందన్నారు. డిసెంబర్ నాటికి గత నాలుగు నెలలుగా శరవేగంగా రిటైల్ ద్రవ్యోల్బణం 5.69 శాతానికి పెరుగుతూ వచ్చింది. దీనికి కూరగాయలు, పప్పు దినుసులు, సుగంధ ద్రవ్యాల ధరలు పెరగడమే కారణమని అన్నారు. ఆహార ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో 2022తో పోలిస్తే గత నవంబర్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం 5.72 నుంచి 5.55 శాతానికి దిగి వచ్చిందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) తెలిపింది. 2022 డిసెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం 4.19 శాతం ఉంటే 2023 డిసెంబర్ నెలలో 8.7 శాతానికి పెరిగిందని పేర్కొంది. గత ఆగస్టు రిటైల్ ద్రవ్యోల్బణం 6.83 శాతం ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z