Politics

సైకిల్ ఎక్కి చంద్రముఖి వస్తుంది-తాజావార్తలు

సైకిల్ ఎక్కి చంద్రముఖి వస్తుంది-తాజావార్తలు

* 57 నెలల్లో మీ బిడ్డ మీ మంచి కోసం 124 సార్లు బటన్‌ నొక్కాడు. ఈ మంచి ఇలాగే జరగాలంటే.. నా కోసం రెండు బటన్‌లు నొక్కండి. ఒకటి ఎమ్మెల్యే ఎన్నికల కోసం.. రెండోది పార్లమెంట్‌ ఎన్నికల కోసం. లేకుంటే.. గత ఎన్నికల్లో ఓటుతో మీరు పెట్టెలో బంధించిన చంద్రముఖి మళ్లీ నిద్రలేస్తుంది. సైకిల్‌ ఎక్కి టీ గ్లాస్‌ పట్టుకుని పేదల రక్తం తాగేందుకు ‘‘లక లక’’ అంటూ ప్రతీ ఇంటింటికి వస్తుంది. అబద్ధాలతో, మోసాలతో ఓ డ్రాక్యులా మాదిరి తలుపు తట్టి ప్రజల రక్తం తాగుతుంది. 2024 ఎన్నికల్లో జగనన్నకు ఓటేస్తే.. ఆ చంద్రముఖి బెడద ఇక మీకు శాశ్వతంగా ఉండదు. చంద్రగ్రహణాలు ఉండవు. చంద్రబాబును చంద్రముఖితో పోలుస్తూ దెందులూరు సిద్ధం సభలో ప్రసంగించిన సీఎం జగన్‌.

* లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌ తగిలింది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఢీలా పడిన గులాబీ పార్టీకి.. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గుడ్‌బై చెప్పారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజయ్య శనివారం రాజీనామా చేశారు. అయితే వరంగల్ పార్లమెంట్ సీటు ఆశించిన రాజయ్యకు.. పార్టీ అధిష్టానం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

* దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు దిల్లీ క్రైమ్ బ్రాంచ్ టీమ్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి సిబ్బంది వివరాలు వెల్లడించింది. దాదాపు 5 గంటలపాటు వేచిచూసినా సీఎం రాకపోవడంతో అక్కడే ఉన్న సిబ్బందికి నోటీసులు అందించడం గమనార్హం. అంతే కాకుండా ఈ నోటీసుపై మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని కేజ్రీవాల్ ను కోరారు. బీజేపీ ఎమ్మెల్యేలతో బేరసారాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో క్రైమ్ బ్రాంచ్ ఈ నోటీసులు పంపించింది. ఆ ఏడుగురు ఎమ్మెల్యేల పేర్లను కూడా వెల్లడించాలని కోరింది. అయితే.. ఈ నోటీసుపై కేజ్రీవాల్ స్పందిస్తారా లేదా అనేది చూడాలి.

* కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేలా పోరాడుతామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. శనివారం నాడు మణుగూరులో మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… జిల్లాకు మెడికల్ కాలేజీ ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. రాబోయే రోజుల్లో కార్యకర్తలు శ్రమించి మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాన్ని గెలిపించుకోవాలని కోరారు. మహబూబాద్ పార్లమెంట్ స్థానాన్ని మూడోసారి గెలుచుకొని హ్యాట్రిక్ సాధించాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.

* టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఉచ్చులో షర్మిలమ్మ పడిపోయారని.. ఆమెను కూడా తమ పార్టీకి శత్రువగానే భావిస్తామని ఆయన కామెంట్‌ చేశారు. వైఎస్‌ కూతురు, జగన్‌ సోదరిగా మాత్రమే ఆమెను గౌరవిస్తామని తెలిపారు. ప్రతిపక్ష నేతగా ఆమె చేసే వ్యాఖ్యలకు ధీటుగా స్పందిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏర్పడటానికి మూలకారణం చంద్రబాబే అని పెద్దిరెడ్డి విమర్శించారు. జగన్‌మోహన్‌రెడ్డి అరెస్టు వెనుక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విడిపోవడం వెనుక కారణం కూడా చంద్రబాబే అని అన్నారు. వైఎస్‌ కుటుంబం విడిపోవడానికి కూడా కారణమే చంద్రబాబు అని అన్నారు. షర్మిలమ్మ కూడా బాబు ట్రాప్‌లో పడిపోయిందని విమర్శించారు. ఏపీలో అభివృద్ధి ఎక్కడ అని అడుగుతున్న షర్మిలమ్మకు రాష్ట్రం మొత్తం తిరిగి చూస్తే జగన్‌ చేసిన డెవలప్‌మెంట్‌ కనిపిస్తుందని స్పష్టం చేశారు. ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడో చచ్చిపోయిందని.. ఆ పార్టీని నలుగురు మోస్తున్నారని పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. రఘువీరారెడ్డి, షర్మిలమ్మ, కేవీపీ రామచంద్రరావు, గిడుగు రుద్రరాజు.. ఈ నలుగురు చచ్చిపోయిన పార్టీని మోస్తున్నారని.. ఇంకా ఎవరైనా మిగిలిఉంటే ఉట్టి పట్టుకుంటారని సెటైర్‌ వేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ బతికేది లేదు.. బట్టకట్టేది లేదని విమర్శించారు. అలాంటి కాంగ్రెస్‌ పార్టీతో వచ్చే ఎన్నికల్లో తమకు పోటీ లేనేలేదని అన్నారు. టీడీపీ, జనసేన ఎన్ని కుట్రలు చేసినా ఏపీలో అధికారంలోకి వచ్చేది వైసీపీ అని స్పష్టం చేశారు.

* ఎమ్మిగనూరు కొత్త ఇన్‌చార్జిగా వచ్చిన బుట్టా రేణుక గతంలో కర్నూలు ఎంపీగా పనిచేశారు. 2014లో ఎంపీగా గెలిచిన రేణుక.. ఆ తర్వాత టీడీపీలోకి వెళ్లారు. గత ఎన్నికల ముందు మళ్లీ వైసీపీలో చేరారు. ఈసారి కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని భావించినా, ఎమ్మిగనూరులో చేనేత వర్గం ఓట్లు ఎక్కువగా ఉంటాయనే ఉద్దేశంతో రేణుకను ఇక్కడి నుంచి పోటీకి దించాలని నిర్ణయించింది పార్టీ. ఎమ్మిగనూరులో గెలుపు కోసం పార్టీ తీసుకున్న నిర్ణయం తమ నేతను బలిపశువును చేసిందని వారం రోజుల ఇన్‌చార్జి మాచాని వెంకటేశ్‌ వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

* వచ్చే లోకసభ ఎన్నికలో మోడీని గద్దె దించడానికి, ఇండియా కూటమి విజయం సాధించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన “భారత్ జోడో న్యాయ యాత్ర” ఝార్ఖండ్ రాష్ట్రంలో నేటితో రెండు రోజులు పూర్తి చేసుకుంది. ప్రసిద్ధి గాంచిన ఈ రాష్ట్రంలోని డియోఘర్‌లో ఉన్న బాబా బైద్యనాథ్ ధామ్ ఆలయంలో రాహుల్ గాంధీ పూజలు చేశారు దానికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

* “కెమెరామెన్ గంగతో రాంబాబు” సినిమా పన్నెండు ఏళ్ల క్రితం వచ్చినప్పటికీ, నాటి రాజకీయాలకే కాదు నేటి రాజకీయాలకు కూడా అద్దం పట్టే విధంగా ఉంటుంది అని నట్టి కుమార్ అన్నారు. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం 2012లో విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాను నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నట్టి కుమార్ ఈ నెల 7న ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నట్టి కుమార్ మాట్లాడారు. “ఈ సినిమా కలెక్షన్స్ కు సంబంధించి సేల్ అయిన ప్రతి టిక్కెట్ నుంచి 10 రూపాయలు జనసేనకు ఫార్టీ ఫండ్ ను అందజేస్తామని ఆయన అన్నారు.

* ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏం సలహాలు ఇచ్చారని రూ.లక్షల్లో జీతాలు ఇస్తూ సలహాదారులను పోషిస్తున్నారని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ప్రశ్నించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్‌కు ఉపన్యాసాలు రాసిస్తోన్న సలహాదారుకు నెలకు రూ.2లక్షల జీతంతో పాటు కేబినెట్‌ హోదా కల్పించడం ప్రభుత్వ బరితెగింపునకు నిదర్శనమన్నారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత మందిని నియమించారో చెప్పాలని అడిగితే సాక్షిలో ఫ్యాక్ట్‌ చెక్‌ పేరుతో తప్పుడు రాతలు రాశారని మండిపడ్డారు. సలహాదారులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వేతనంతో సమానంగా జీతాలు ఇస్తున్నారని ఆరోపించారు. ప్రజల సొమ్మును వారికి కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. యువత స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం ఖర్చు చేయాల్సిన నిధులు.. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుల కార్యాలయం కోసం ఖర్చుచేస్తున్నారని ఆరోపించారు.

* ఖమ్మం ఎంపీ టికెట్‌ కోసం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని దరఖాస్తు చేశారు. అనంతరం గాంధీభవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మం నుంచి సోనియాగాంధీ లేదా ప్రియాంకను పోటీ చేయాలని కోరామన్నారు. ఇద్దరిలో ఎవరు పోటీ చేసినా భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నారు. వారు పోటీ చేయకుంటే తనకు అవకాశం ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరారు. దాదాపు 20 ఏళ్లుగా ఖమ్మం ప్రజలతో కలిసి పనిచేస్తున్నామని, వారి ఒత్తిడి మేరకే ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.

* జ‌గ‌న్ ప్రభుత్వం ఉద్యోగుల ప్రాణాలు తీస్తోందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. వైకాపా పాల‌న‌ని అంత‌మొందిచేందుకు ఉద్యోగులంతా ఆత్మస్థైర్యంతో ఉండాలని కోరారు. విశాఖ‌ జిల్లాలో భూ అక్రమాల‌కు స‌హ‌క‌రించ‌లేద‌ని వైకాపా నేత‌లే త‌హ‌సీల్దార్ రమణయ్యను అత్యంత‌ దారుణంగా హత్య చేశారని ఆరోపించారు. అవినీతి, అక్రమాలు, వేధింపుల‌తో ప్రభుత్వ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవ‌డం విచార‌క‌ర‌మన్నారు. అధికారం కోసం సొంత బాబాయ్‌ని హత్య చేసిన జ‌గ‌న్ గ్యాంగ్ త‌మ దోపిడీకి స‌హ‌క‌రించ‌ని ఉద్యోగుల అడ్డు తొల‌గించుకుంటోందని ఆరోపించారు. వైకాపా నేత‌ల అవినీతికి వారెందుకు బ‌లి కావాలని ప్రశ్నించారు. జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌లో వంద‌ల మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారన్న ఆయన.. ఈ వారంలోనే ముగ్గురు బ‌ల‌య్యారని చెప్పారు. ఈ ఫ్యాక్షన్ స‌ర్కారు అంతానికి ఇంకా 2 నెల‌లే స‌మ‌యం ఉందని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిందితులను కఠినంగా శిక్షిస్తామని లోకేష్‌ స్పష్టం చేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z