DailyDose

విశాఖలో తహశీల్దార్ హత్య నిందితుడి గుర్తింపు-నేరవార్తలు

విశాఖలో తహశీల్దార్ హత్య నిందితుడి గుర్తింపు-నేరవార్తలు

* రాజస్థాన్‌ రాష్ట్రంలోని బికనీర్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జితేంద్ర ఓఝా అనే 48 ఏళ్ల వ్యక్తి తన పదేళ్ల కొడుకును నీటి కుంటలో తోసి చంపేశాడు. అనంతరం తాను కూడా అదే కుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జితేంద్ర ఓఝా ఎందుకు అంతటి తీవ్ర నిర్ణయం తీసుకున్నాడో తెలియాల్సి ఉందని చెప్పారు. అయితే, జితేంద్ర ఓఝా తన కొడుకును నీటి కుంటలోకి తోయగానే ఆ బాలుడు పలుమార్లు బయటికి వచ్చే ప్రయత్నం చేశాడని, కానీ ఓఝా మళ్లీమళ్లీ నీళ్లలోకి తోసేశాడని స్థానికులు చెప్పుకుంటున్నట్లు వెల్లడించారు.

* ఒక యువతి కదులుతున్న బస్సు నుంచి రోడ్డుపై పడబోయింది. అప్రమత్తమైన కండక్టర్‌ ఆమె జుట్టుపట్టుకుని బస్సులోనికి లాగాడు. బస్సు నుంచి పడకుండా ఆమెను కాపాడాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. తమిళనాడులోని ఈరోడ్‌ జిల్లాలో ఈ ఈసంఘటన జరిగింది. ఈరోడ్ నుంచి మెట్టూరు వెళ్తున్న బస్సులో కొందరు ప్రయాణికులున్నారు. ఆ బస్సు చిత్తర్ సమీపిస్తుండగా దిగేందుకు ఒక యువతి డోర్‌ వద్దకు వచ్చింది. అయితే బస్సు ఒక్కసారిగా కుదుపు ఇవ్వగా డోర్‌ వద్ద ఉన్న ఆమె కదులుతున్న బస్సు నుంచి బయటకు పడబోయింది. కాగా, బస్సు డోర్‌ ఫుట్‌బోర్డ్‌ వద్ద ఉన్న కండక్టర్‌ వెంటనే స్పందించాడు. బస్సు నుంచి పడబోయిన మహిళ తల జుట్టును గట్టిగా పట్టుకున్నాడు. ఆమెను బస్సులోకి లాగి కాపాడాడు. మరో ప్రయాణికురాలు కూడా సహకరించింది. అనంతరం స్టాప్‌ వద్ద బస్సు ఆగడంతో ఆ యువతి దిగింది. తనను కాపాడిన కండక్టర్‌కు ఆమె కృతజ్ఞతలు చెప్పింది. మరోవైపు ఆ బస్సులోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

* తల్లితో కలిసుండటం ఇష్టంలేక బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని మీరట్‌ పట్టణంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. భర్త చనిపోయిన ఓ మహిళ తన 17 ఏళ్ల కుమార్తె, 8 ఏళ్ల కుమారుడితో కలిసి మీరట్‌లోని ఓ అద్దె ఇంట్లో ఉంటోంది. ఇదివరకు వేరే ఇంట్లో ఉన్న ఆ కుటుంబం గత నెల 8న ఇప్పుడున్న ఇంట్లోకి మారింది. ఈ క్రమంలో తల్లి, తమ్ముడు ఇంట్లో లేని సమయం చూసి బాలిక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు తల్లి ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

* తడు చిన్న వయసులోనే ఆర్మీలో ఉద్యోగం సంపాదించాడు. వచ్చే జీతంతో తృప్తిపడకుండా మోసాల బాటపట్టాడు. రెండు చీటింగ్‌ కేసులలో అతడు నిందితుడిగా తేలడంతో ఆర్మీ అధికారులు ఉద్యోగం నుంచి తొలగించారు. అనంతరం జైలుకు వెళ్లి బెయిలుపై బయటికి వచ్చాడు. అయినా తన బుద్ధి మార్చుకోలేదు. మళ్లీ మోసాలు మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఓ మహిళతో పరిచయం పెంచుకున్నాడు. తాను ఆర్మీ ఉద్యోగినని, తనకు రూ.1.25 లక్షలు ఇస్తే ఆర్మీ కాలేజీలో క్లర్క్‌గా ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఆమె ఇచ్చిన రూ.1.25 లక్షలు సొంతానికి వాడుకున్నాడు. ఆ తర్వాత ఆమెకు ఉద్యోగం ఇప్పించలేదు, డబ్బు వాపస్‌ ఇవ్వలేదు. దాంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి దర్యాప్తు చేపట్టారు. గతంలో కూడా అతడు మోసాలకు పాల్పడే ప్రభుత్వ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నట్టు గుర్తించారు. అతడు బాధితురాలితో పాటు మరికొందరిని కూడా మోసగించి ఉంటాడని అనుమానిస్తున్నారు.

* ఏపీలోని విశాఖపట్నంలో తహసీల్దార్‌రమణయ్య హత్య కేసులో పోలీసులు ముందడుగు వేశారు. ఈ మేరకు నిందితుడిని గుర్తించామని విశాఖ సీపీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ మీడియాకు వెల్లడించారు. కేసును దర్యాప్తు చేసేందుకు, నిందితుడిని పట్టుకునేందుకు ఇద్దరు ఏసీపీలను నియమించామని పేర్కొన్నారు. నిందితుడు ఎయిర్‌పోర్టు వైపు వెళ్లినట్లు గుర్తించామని, బహుశా విమానం కూడా ఎక్కినట్లు తెలిసిందని వివరించారు. నిందితుడి కోసం అన్ని ప్రాంతాల్లో గాలిస్తున్నామని సీపీ తెలిపారు. త్వరలో నిందితుడని పట్టుకుంటామని, రియల్‌ ఎస్టేట్, భూవివాదాలే హత్యకు కారణం ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన రోజే ఆయన ఇంట్లోనే దుండగులు చంపేశారు. చినగదిలి రూరల్‌ తహసీల్దార్‌గా ఉన్న సనపల రమణయ్య ఎన్నికల నేపథ్యంలో ఇటీవల విజయనగరం జిల్లాలోని బంటుపల్లికి బదిలీ అయ్యారు. శుక్రవారం బాధ్యతలు చేపట్టిన ఆయన కొమ్మాదిలోని తన ఇంటికి చేరుకున్నారు. రాత్రి 10.15 గంటల సమయంలో ఫోన్‌ రావడంతో కిందకు వచ్చి అపార్ట్‌మెంట్‌ గేట్‌ వద్ద ఓ వ్యక్తిని కలిసినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో నమోదైంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో దుండగుడు తనతో తెచ్చుకున్న ఇనుపరాడ్‌తో రమణయ్య తలపై దాడిచేసి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే దవాఖానకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 3 గంటలకు ఆయన మృతి చెందారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z