Movies

రాజేంద్రప్రసాద్ అహం…బాబూమొహన్ అదృష్టం…సినిమా సూపర్‌హిట్!

రాజేంద్రప్రసాద్ అహం…బాబూమొహన్ అదృష్టం…సినిమా సూపర్‌హిట్!

అనుకోని పరిస్థితుల్లో ఒకరు చేయాల్సిన పాత్రలు మరొకరు చేయాల్సి వస్తుంది. ఇండస్ట్రీలో ఇది సర్వసాధారణం. అలా తళుక్కున మెరిసిన ఆ సన్నివేశాలు, పాటలు అశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న సందర్భాలెన్నో. ‘మాయలోడు’ (Mayalodu) సినిమా సందర్భంగా ఇలాంటి ఆసక్తికర ఘటనే చోటుచేసుకుంది. ఎస్వీ కృష్ణారెడ్డి (SV Krishna Reddy) దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్‌ (Rajendra Prasad) కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ఇందులో ‘చినుకు.. చినుకు అందెలతో..’ అంటూ సాగే పాట తొలుత రాజేంద్రప్రసాద్‌, సౌందర్యలే చేయాలి. కానీ, చివరి నిమిషంలో బాబూమోహన్‌ చేయాల్సి వచ్చింది. అందుకు కారణాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎస్వీ కృష్ణారెడ్డి పంచుకున్నారు.

‘‘రాజేంద్రప్రసాద్‌ వల్లే నేను దర్శకుడిని అయ్యాను. అందులో ఎలాంటి అనుమానం లేదు. కొన్నిసార్లు ఎదుటి వ్యక్తులు అనే మాటలు మనల్ని ఎంతగానో బాధిస్తాయి. ‘మాయలోడు’ చిత్రీకరణ పూర్తవుతున్న దశలో రాజేంద్రప్రసాద్‌తో జరిగిన సంభాషణ నన్ను బాధించింది. ‘నువ్వు డ్యాన్సులు చేస్తావ‌ట క‌దా.. స్టెప్పులు వేస్తావ‌ట .. ఏంటి నువ్వు డైరెక్షన్‌ చేస్తే సినిమా ఆడేస్తుందా’ అంటూ రాజేంద్రప్రసాద్‌ కాస్త వెటకారంగా మాట్లాడారు. ఆ మాటలు నన్ను బాధించినా.. సహనంతో భరించా. ఒక పాట మినహా దాదాపు షూటింగ్‌ పూర్తయిపోయింది. సౌందర్య డేట్స్‌ దొరకడంతో ఫలానా రోజున షూటింగ్‌కు రావాలంటూ రాజేంద్రప్రసాద్‌కు కబురు పంపా. నేను కోరిన తేదీల్లో రావడానికి ఆయన ససేమిరా అన్నారు. ‘హీరోయిన్ల డేట్స్‌ దొరకడమే కష్టంగా ఉన్న సమయంలో మీరు కాస్త సహకరించాలి’ అని వినయపూర్వకంగా అడిగా. ‘రావడం కుదరదు. నువ్వు అనుకున్న తేదీకి సినిమా విడుదలవుతుందని అనుకుంటున్నావా. నేను ఇంకా డబ్బింగ్‌ చెప్పాలి. పైగా ఇంకో పాట కూడా ఉంది’ అనేసరికి నేను కాస్త జంకాను. పాట సంగతి పక్కన పెడితే ముందు డబ్బింగ్‌ పూర్తి చేద్దామనే ఉద్దేశంతో అడిగితే, ఒకే ఒక్క రోజు అవకాశమిచ్చారు. అది కూడా ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకూ మాత్రమే. మధ్యలో ఒంటిగంట నుంచి 2 గంటల వరకూ లంచ్‌ బ్రేక్‌ అనే కండీషన్‌ పెట్టారు. ఒక్కరోజులో డబ్బింగ్‌ పూర్తికాదని ఆయన భావించారు. పైగా ‘మాయలోడు’ త‌మిళ రైట్స్‌ను రాయించుకున్న తర్వాతే డబ్బింగ్‌ థియేటర్‌లో అడుగు పెట్టారు. అంతకుముందే సినిమా మొత్తం 1200 అడుగుల రీల్‌ వస్తే, ఎడిటర్‌ను రిక్వెస్ట్‌ చేసి, మొత్తం ఒకే రీల్‌గా మార్చాను. ఆ విషయం రాజేంద్రప్రసాద్‌కు తెలియదు. దీంతో వరుసగా సన్నివేశాలు వస్తుంటే, ఆయన డబ్బింగ్‌ చెప్పుకొంటూ వెళ్లిపోయారు. మధ్యాహ్నం 1గంటలకే పూర్తి చేయడంతో ఆశ్చర్యపోయారు. ‘ఇంకా పాట చేయాలి కదా. ఎలా చేస్తావో చూస్తా’ అన్నారు. ఆ తర్వాత పాట షూటింగ్‌కు రమ్మని పిలిస్తే, ‘నాకు కుదరదయ్యా.. సౌందర్య డేట్స్‌ ఇచ్చిందన్నావు కదా చేసుకో’ అన్నారు. ఆ సమయంలో నాకు బాబూమోహన్‌ గుర్తుకు వచ్చారు. ఆయనకు ఫోన్‌ చేసి, పాట విషయం చెప్పాను. అందుకు ఆయన కూడా ఓకే అన్నారు. బాబూమోహ‌న్‌తో పాట‌ను తీస్తున్నాన‌నే విష‌యాన్ని తెలిసి.. మ‌ధ్య‌వ‌ర్తులను రంగంలోకి దింపారు. బాబూమోహన్‌తో తీయడం అంతగా బాగోదని అన్నారు. రాజేంద్రప్రసాద్‌ వచ్చి చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. నేను మాత్రం బాబూమోహన్‌కు ఇచ్చిన మాటకు కట్టుబడి నా నిర్ణయాన్ని మార్చుకోలేదు. నేను అనుకున్నట్లుగానే పాట తీశా. ‘మాయ‌లోడు’ విడుద‌లై సూపర్‌హిట్ అయింది. ప్ర‌త్యేకించి బాబూమోహ‌న్- సౌంద‌ర్య‌ల పాట ఒక ఊపు ఊపింది’’ అంటూ ఆనాటి విశేషాలను ఎస్వీ కృష్ణారెడ్డి గుర్తు చేసుకున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z