సంగీత దర్శకుడిగా ఎన్నో అద్భుతమైన పాటలు అందించిన ఆర్పీ పట్నాయక్ (RP Patnaik) మరో ప్రయోగంతో అందరి ముందుకురాబోతున్నారు. ఇప్పటివరకూ ‘భగవద్గీత’ అంటే తెలుగు వారికి ఘంటసాల గుర్తొచ్చేవారు. భౌతికంగా మన మధ్య లేకపోయినా ‘భగవద్గీత’ రూపంలో ఆయన గొంతు సజీవమే. ఇప్పుడు అదే గీతను నేటి యువత కోసం అందించడానికి సిద్ధమయ్యారు ఆర్పీ పట్నాయక్. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్ (ఇంతకుముందు ట్విటర్) వేదికగా ప్రకటన చేశారు. ‘‘నేటి యువతకు సరైన మార్గనిర్దేశం చేసే అత్యద్భుత తత్వజ్ఞానం, జీవనమార్గం చూపించే శాస్త్రం భగవద్గీతకు మించి ఇంకెక్కడా దొరకదు. అందరికీ అర్థమయ్యేలా ఈ సంపూర్ణ భగవద్గీత తాత్పర్యం (సంస్కృత శ్లోకాలు లేకుండా) నేటి యువత కోసం నేను రికార్డ్ చేశాను. పూర్తి వివరాలతో త్వరలోనే వస్తాను’’ అని ట్వీట్ చేశారు. మరి ఆర్పీ పట్నాయక్ తీసుకురాబోయే గీతాసారం ఆయనే స్వయంగా స్వరపరిచారా? లేక వేరెవరితోనైనా చెప్పించారా? తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. సంగీత దర్శకుడిగానే కాకుండా గాయకుడు, నటుడు, దర్శకుడిగా ఆర్పీ పట్నాయక్ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z