Business

టాటా గ్రూపు నుండి మరో కొత్త IPO-BusinessNews-Feb 26 2024

టాటా గ్రూపు నుండి మరో కొత్త IPO-BusinessNews-Feb 26 2024

* టాటా గ్రూప్‌ (TATA Group) మరో ఐపీఓకి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. విద్యుత్తు వాహన తయారీ కంపెనీ ‘టాటా ప్యాసింజర్‌ ఎలక్ట్రికల్‌ మొబిలిటీ లిమిటెడ్‌ (TPEM)’ ను పబ్లిక్‌ ఇష్యూకు తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా 1-2 బిలియన్‌ డాలర్ల వరకు సమీకరించొచ్చని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ‘బిజినెస్‌లైన్’ వెల్లడించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం లేదా 2025-26 తొలినాళ్లలో ఐపీఓ ఉండొచ్చని సమాచారం. టాటా మోటార్స్‌కు (TATA Motors) అనుంబంధంగా పనిచేస్తున్న టీపీఈఎం దేశంలో అతిపెద్ద విద్యుత్తు వాహన తయారీ సంస్థగా కొనసాగుతోంది. నెక్సన్‌, టియాగో వంటి వాటిల్లో ఈవీ మోడళ్లను విక్రయిస్తోంది. ప్రస్తుతానికి ప్రయాణికుల వాహన విభాగంలో దేశీయంగా ఈ కంపెనీదే 80 శాతం మార్కెట్‌ వాటా. 2023 జనవరిలో అమెరికాకు చెందిన ప్రైవేట్‌ ఈక్విటీ కంపెనీ టీపీజీ నుంచి టీపీఈఎం 1 బిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించింది. అప్పటికి కంపెనీ విలువ 9.5- 10 బిలియన్‌ డాలర్ల వరకు ఉంటుందని అంచనా. 2026 నాటికి రెండు బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టాలనే లక్ష్యంలో భాగంగా ఈ మొత్తం సమకూర్చుకుంది.

* ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ ​ఫౌండేషన్ జంతు సంరక్షణకు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వంతారా పేరిట సమగ్ర జంతు సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. గాయపడిన జంతువులను రక్షించడం, చికిత్స చేయడంతో పాటు వాటి సంరక్షణ, పునరావాసం ఏర్పాటుచేయడం దీని ముఖ్య ఉద్దేశం. గుజరాత్‌లోని జామ్‌నగర్‌ రిలయన్స్‌ రిఫైనరీ కాంప్లెక్స్‌ 3వేల ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేశారు. వంతారా అనేది ఒక కృత్రిమ అడవి. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటుచేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. పూర్తిగా పోర్టబుల్ ఎక్స్​రే యంత్రాలు, శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు, అధునాతన సదుపాయాలు ఉన్నాయి. ఇందుకోసం ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN), వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF) వంటి సంస్థలతో జట్టు కట్టడంపై దృష్టిసారించింది.

* టీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ (Paytm payments bank) జారీ చేసిన ఫాస్టాగ్‌ (FasTag) వాడుతున్నారా? అయితే, త్వరలో మీరు కొత్తది కొనుగోలు చేయాల్సిందే. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో ఆ ఫాస్టాగ్‌లను మార్చి 15 తర్వాత రీఛార్జి చేయడానికి కుదరదు. అందులో నగదు పూర్తయ్యే వరకే వినియోగించే వెసులుబాటు ఉంది. ఇప్పటికే భారతీయ రహదారుల నిర్వహణ కంపెనీ (IHMCL).. ఫాస్టాగ్‌ జారీ చేసే అధీకృత బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ (PPBL)ను తొలగించింది. కాబట్టి పేటీఎం ఫాస్టాగ్స్‌ను వాడుతున్నవారు.. కొత్త వాటికి మారాల్సి ఉంటుంది. కొత్త ఫాస్టాగ్‌కు తొలుత జాయినింగ్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కొంత మొత్తం సెక్యూరిటీ డిపాజిట్‌ కింద చెల్లించాలి. ఫాస్టాగ్‌ వద్దనుకున్నప్పుడు ఈ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. ఆపై ఫాస్టాగ్‌ను ఎప్పటికప్పుడు రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయాలు ఇవీ..

NHAI ఫాస్టాగ్‌: జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) స్వయంగా ఫాస్టాగ్‌లను జారీ చేస్తోంది. ఇది ప్రత్యేకంగా ఏ బ్యాంకుకూ అనుసంధానమై ఉండదు. టోల్‌ ప్లాజాలు, పెట్రోల్‌ పంపులు వద్ద వీటిని కొనుగోలు చేయొచ్చు. ‘మై ఫాస్టాగ్‌’ యాప్‌ ద్వారా లేదా అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఇ-కామర్స్ సంస్థల నుంచి కూడా కొనుగోలు చేయొచ్చు.

ఎస్‌బీఐ ఫాస్టాగ్‌ : ప్రభుత్వరంగ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు (SBI) చెందిన ఫాస్టాగ్‌ను ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ పద్ధతుల్లో తీసుకోవచ్చు. ఇందుకోసం వన్‌టైమ్‌ ఫీజు కింద రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. రూ.200 సెక్యూరిటీ డిపాజిట్‌ కింద చెల్లించాల్సి ఉంటుంది. రూ.100తో కనీస రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుంది. గరిష్ఠంగా రూ.లక్ష వరకు రీఛార్జి చేసుకోవచ్చు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఫాస్టాగ్‌: ప్రైవేటు రంగానికి హెచ్‌డీఎఫ్‌ సైతం ఫాస్టాగ్‌లను జారీ చేస్తోంది. రూ.100 వన్‌టైమ్‌ ఫీజు కింద చెల్లించాలి. మరో రూ.100 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. రూ.100 నుంచి రూ.లక్ష వరకు ఎంతైనా రీఛార్జి చేసుకోవచ్చు. బ్యాంక్‌ వెబ్‌సైట్‌ లేదా దగ్గర్లోని బ్యాంక్‌ శాఖకు వెళ్లి పొందొచ్చు.

ఐసీఐసీఐ బ్యాంక్‌ ఫాస్టాగ్‌: ఐసీఐసీఐ ఫాస్టాగ్‌ను బ్యాంక్‌ వెబ్‌సైట్‌ ద్వారా గానీ, బ్రాంచ్‌లో గానీ పొందొచ్చు. ఈ బ్యాంక్‌లో జాయినింగ్‌ ఫీజు రూ.100, సెక్యూరిటీ డిపాజిట్‌ రూ.200గా ఉంది.

యాక్సిస్‌ బ్యాంక్‌ ఫాస్టాగ్‌: ఇతర బ్యాంకుల మాదిరిగానే ఫాస్టాగ్‌కు యాక్సిస్‌ బ్యాంక్‌లో తొలిసారి రూ.100 చెల్లించాలి. ఆపై సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.200 చెల్లించాలి. బ్యాంక్‌ వెబ్‌సైట్‌, బ్యాంక్‌ శాఖ వద్ద ఫాస్టాగ్‌ను పొందొచ్చు. ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ రూ.100 చెల్లిస్తే ఫాస్టాగ్‌ జారీ చేస్తుంది. సెక్యూరిటీ డిపాజిట్‌ రూ.150 చెల్లించాలి.

* 300 మెగావాట్ల సోలార్‌ పవర్‌ విద్యుత్‌కు సంబంధించి J&K పవర్‌ కార్పొరేషన్‌, SJVN గ్రీన్‌ విద్యుత్‌ వినియోగ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ప్రాజెక్ట్‌ను డొమెస్టిక్‌ కంటెంట్‌ రిక్వైర్‌మెంట్‌ (DCR) మోడ్‌లో అభివృద్ధి చేస్తారు. ఈ ప్రాజెక్ట్‌ నుంచి విద్యుత్‌ను నేరుగా లేదా డిస్కమ్‌ ద్వారా ప్రభుత్వ వినియోగానికి సరఫరా చేస్తారని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. రూ.5,491 కోట్ల వ్యయంతో IREDAకు సంబంధించిన (CPSU పథకం కింద అభివృద్ధి చేస్తున్న) 1,000 మెగావాట్ల బికనేర్‌ సోలార్‌ ప్రాజెక్ట్‌ నుంచి 300 మెగావాట్ల విద్యుత్‌ J&K పవర్‌ కార్పొరేషన్‌కు సరఫరా చేస్తారని కంపెనీ తెలిపింది.

* ప్రముఖ స్టాక్‌ బ్రోకరేజ్‌ సంస్థ జెరోదా (Zerodha) సహ వ్యవస్థాపకుడు, కంపెనీ సీఈఓ నితిన్‌ కామత్‌ (Nithin Kamath) అనారోగ్యానికి గురయ్యారు. కొద్ది వారాల క్రితం తనకు పాక్షిక పక్షవాతం వచ్చినట్లు సోమవారం ఆయన సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో ఐటీ, బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో రోజంతా సూచీలు నష్టాల్లోనే కొనసాగాయి. నిఫ్టీ 21,150 స్థాయిని కోల్పోయింది. సెన్సెక్స్‌ ఉదయం 73,044.81 పాయింట్ల (క్రితం ముగింపు 73,142.80) వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 72,666.82 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 352.67 పాయింట్ల నష్టంతో 72,790.13 వద్ద ముగిసింది. నిఫ్టీ 90.65 పాయింట్ల నష్టంతో 22,122.05 వద్ద స్థిరపడింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z