NRI-NRT

డల్లాస్‌లో వై.ఎస్.జగన్ సదస్సుకు ఏర్పాట్లు?-TNI ప్రత్యేకం

AP CM YS Jagans Meet Moving From Detroit To Dallas?

ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆగష్టు 3వ వారంలో అమెరికాలో జరపనున్న పర్యటనలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందుగా అందరూ భావించినట్లు డెట్రాయిట్‌లో కాకుండా డల్లాస్‌లో ప్రవాసాంధ్రుల ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని వైకాపా నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే దీనికోసం అవసరమైన ఏర్పాట్లను ముమ్మరం చేసినట్లు సమాచారం. డల్లాస్‌లో గతంలో చంద్రబాబు సదస్సు నిర్వహించినప్పుడు దాని కన్నా ఎక్కువ సంఖ్యలో ఈసారి జనసమీకరణ జరపాలని ఎన్నారై వైకాపా నేతలు ప్రణాళికలు వేసుకుంటున్నారు. 7 నుండి 8వేల మంది పట్టే సమావేశ మందిరం కోసం వైకాపా నేతలు సభావేదిక కోసం అన్వేషిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని జగన్ కార్యాలయానికి సమాచారం అందించారని శుక్రవారం నాటికి గ్రీన్ సిగ్నల్‌తో పాటు మరింత స్పష్టమైన సమాచారం వచ్చే అవకాశం ఉంది. డల్లాస్ ఐతే అమెరికా నలుమూలల నూండి ప్రవాసాంధ్రులు పెద్దసంఖ్యలో తరలిరావడానికి అవకాశం ఉంటుందని, వీలైనంత ఎక్కువ మంది ముఖ్యమంత్రితో ముఖాముఖి అయ్యే విధంగా ఏర్పాట్లు చేసేందుకు వీలుంటుందని ఎన్నారై వైకాపా నేతలు భావిస్తున్నారు.