Sports

అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్‌..

అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్‌..

ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్‌.. డబ్ల్యూపీఎల్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. షఫాలీ వర్మ (64 నాటౌట్‌), మెగ్‌ లానింగ్‌ (51) అర్ధ శతకాలతోపాటు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మరిజన్నే కాప్‌ (3/5) విజృంభించడంతో.. సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 9 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌ను చిత్తు చేసింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన యూపీ నిర్ణీత 20 ఓవర్లలో 119/9 స్కోరు చేసింది. శ్వేత షెహ్రావత్‌ (45) ఒంటరి పోరాటం చేసింది. రాధా యాదవ్‌ 4 వికెట్లు పడగొట్టింది. టాపార్డర్‌ బ్యాటర్లు వ్రింద (0), తహిల మెక్‌గ్రాత్‌ (1), కెప్టెన్‌ అలిస్సా హీలీ (13)ను అవుట్‌ చేసిన కాప్‌.. యూపీని పూర్తిగా ఆత్మరక్షణలోకి నెట్టింది. ఛేదనలో ఢిల్లీ 14.3 ఓవర్లలో 123/1 స్కోరు చేసి గెలిచింది. ఓపెనర్లు లానింగ్‌, షఫాలీ జట్టుకు ధనాధన్‌ ఆరంభాన్నిచ్చారు. 12వ ఓవర్‌లో షఫాలీ అర్ధ శతకాన్ని పూర్తి చేసుకోగా.. టీమ్‌ స్కోరు సెంచరీ మార్క్‌ దాటింది. గెలుపునకు ఒక్క పరుగు కావాల్సి ఉండగా లానింగ్‌ను ఎకిల్‌స్టోన్‌ అవుట్‌ చేసినా.. జెమీమా (4 నాటౌట్‌) ఫోర్‌తో ముగించింది.

సంక్షిప్త స్కోర్లు: యూపీ: 20 ఓవర్లలో 119/9 (శ్వేత 45, గ్రేస్‌ హ్యారిస్‌ 17; రాధ 4/20, కాప్‌ 3/5); ఢిల్లీ: 14.3 ఓవర్లలో 123/1 (షఫాలీ 64 నాటౌట్‌, లానింగ్‌ 51; ఎకిల్‌స్టోన్‌ 1/31).

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z