Devotional

టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు పై వేటు

టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు పై వేటు

టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు, ప్రస్తుత గౌరవ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులపై వేటు పడింది. టీటీడీ, జీయర్‌ స్వాములు, అర్చకులు, అధికారులు, బోర్డు, సీఎం, అహోబిలం మఠంపై ఆరోపణలు చేసిన క్రమంలో రమణదీక్షితులను తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తొలగిస్తున్నట్టు టీటీడీ బోర్డు సోమవారం ప్రకటించింది. టీటీడీ పరిపాలన అంశాలు, అధికారులు, జీయర్‌ స్వాములు, అర్చకులపై రమణదీక్షితులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నట్టుగా ఈ నెల 21న సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్‌ అయింది. కైంకర్యాలు సక్రమంగా చేయడం లేదని, నైవేద్యాలు తగినంత పెట్టడం లేదని, నిధుల కోసం తవ్వకాలు చేపట్టడంతో పాటు ఆలయంలో నూతన స్తంభాలు తీసుకువచ్చారని, ఇంకా అధికారులు, అర్చకులు, జీయర్‌ స్వాములు, పోటు కార్మికులందరినీ తీవ్రస్థాయిలో కించపరుస్తూ మాట్లాడుతున్నట్టు అందులో ఉంది. అది విడుదలైన నిమిషాల వ్యవధిలోనే రమణదీక్షితులు ‘ఎక్స్‌‘లో స్పందించారు. ‘అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వీడియోను చూసి షాక్‌ అయ్యాను. అది నా గొంతు కాదు. నాపై అసూయపడేవారు, నన్ను అప్రతిష్ఠపాల్జేయాలని ఈ చీప్‌ ట్రిక్‌ చేశారు’ అంటూ వివరణ ఇచ్చారు. అయితే మరుసటిరోజు ఆలయ అర్చకులు మీడియా ముందుకు వచ్చి రమణదీక్షితులపై విరుచుకుపడ్డారు. వ్యక్తిగత ప్రయోజనాలు, గుర్తింపు కోసం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు. ఆలయంలో అన్నీ ఆగమోక్తంగానే జరుగుతున్నాయని వివరించారు. తమ ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యాఖ్యలు చేసిన రమణదీక్షితులపై చర్యలు తీసుకోవాలంటూ రెండురోజుల తర్వాత టీటీడీ పెద్దజీయర్‌, చిన్నజీయర్‌ టీటీడీకి లేఖ సమర్పించారు. ఆయనపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని అహోబిలం మఠం నిర్వాహకులు కూడా లేఖ రాశారు. బోర్డు సభ్యులు, పోటు కార్మికుల నుంచీ రమణదీక్షితులపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత రావడంతో సోమవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ వీడియోపై చర్చించారు. నిందారోపణలు చేసిన ఆయన్ను వెంటనే టీటీడీ నుంచి తొలగించాలని తీర్మానం చేశారు. అయితే బోర్డు నిర్ణయంపై వంశపారంపర్య అర్చక కుటుంబానికి చెందిన రమణదీక్షితులు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z