వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేషంగా తరలివస్తున్న భక్తులకు… ఉచిత సమయ నిర్దేశిత సర్వదర్శనం (ఎస్‌ఎస్‌డీ), రూ.300 ప్రత్యేకప్రవేశ దర్శనం (ఎస్‌ఈడీ) టికెట్ల కోటాను పెంచేందుకు చర్యలు తీసుకుంటామని తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. శనివారం తితిదే డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. అనంతరం విలేకర్లతో ఈవో మాట్లాడుతూ… వేసవి రద్దీ నేపథ్యంలో వీఐపీలకు, శ్రీవాణి, టూరిజం, వర్చువల్ సేవలకు కేటాయించే టికెట్లను తగ్గించి ఎస్‌ఎస్‌డీ, ఎస్‌ఈడీ టికెట్ల కోటా పెంచుతామన్నారు. ఎన్నికల కోడ్ రానున్న నేపథ్యంలో సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాల కోటా ఇవ్వబోమని చెప్పారు. ఈ నెల 8న గోగర్భతీర్థంలో క్షేత్ర పాలకుడికి మహా శివరాత్రి పర్వదినాన్ని, 20 నుంచి 24 వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్ని, 25న తుంబుర తీర్థ ముక్కోటిని నిర్వహించనున్నామని చెప్పారు. ఫిబ్రవరిలో 19.06 లక్షల మంది శ్రీవారిని దర్శించుకోగా, రూ.111.71 కోట్ల హుండీ కానుకలు లభించాయన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z