హైదరాబాద్‌ను మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా పేర్కొంటూ చట్టం తెచ్చేలా కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యదర్శిని ఆదేశించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను ప్రకటించిన పదేళ్ల గడువు ఈ ఏడాది జూన్ 2తో ముగుస్తున్నా.. ఏపీ విభజన చట్టం-2014 ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య ఆస్తులు, అప్పులు, తొమ్మిదో షెడ్యూల్‌లో పేర్కొన్న వివిధ కంపెనీలు, కార్పొరేషన్ల విభజన ప్రక్రియ పూర్తికాలేదని పేర్కొంటూ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన ‘ప్రజాసంక్షేమ సేవాసంఘం’ కార్యదర్శి పొదిలి అనిల్‌కుమార్ ఈ పిల్‌ను దాఖలు చేశారు. 2034 జూన్ 2 వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను ఉంచాలని కేంద్రాన్ని కోరుతూ చర్యలు తీసుకునేలా ఏపీ సీఎస్‌ను ఆదేశించాలన్నారు. ఏపీ విభజన చట్ట నిబంధనలను కేంద్ర హోం మంత్రిత్వశాఖ అమలుచేయకపోవడాన్ని రాజ్యాంగ, చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని కోరారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఏపీ సీఎస్, పరిశ్రమలు, వాణిజ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z